Home తాజా వార్తలు ఐటి అండతో లాభాలు

ఐటి అండతో లాభాలు

Domestic stocks ended with gains while IT stocks gained

145 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్

ముంబై: ఐటి స్టాక్స్ అండతో దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడడంతో ఐటి స్టాక్స్ లాభాలతో సూచీలు పైపైకి ఎగసాయి. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల అప్రమత్తతతో ఒడిదొడుకులకు లోనైన సూచీలు పుంజుకున్నాయి. అవిశ్వాసంలో బిజెపి నెగ్గుతుందనే ధీమాతో దాని ప్రభావం మార్కెట్లపై పెద్దగా కనిపించలేదు. మార్కెట్ ముగిసేసరికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 145 పాయింట్ల లాభపడి 36,496 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 11,010 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఐటి దిగ్గజం విప్రో క్యూ1 ఫలితాల్లో అంచనాలను అందుకోవడం ఐటికి కలిసొచ్చింది. కంపెనీ తొలి క్వార్టర్ ఫలితాల్లో నికర లాభాలను రెండు శాతం పెంచుకుంది. అయిచే ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఫార్మా, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల షేర్లు లాభపడడం సూచీలకు కలిసొచ్చింది. లోహాలు, ఆటో మొబైల్స్ రంగాలు నష్టపోయాయి. ఐటి, ఫార్మా, రియల్టీ రంగాలు 1.5 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.3 శాతం బలపడింది. మెటల్, ఆటో రంగాలు 0.5 శాతం క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్ 8 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 6 శాతం చొప్పున పెరిగాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,402 నష్టపోగా, 1,156 లాభపడ్డాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) రూ.316 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. అలాగే దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 470 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. రూపాయి భారీగా పతనమవుతుండడంతో నియంత్రించేందుకు ఆర్‌బిఐ జోక్యం చేసుకునే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.