Home అంతర్జాతీయ వార్తలు ట్రంప్‌కి మతిభ్రమించింది

ట్రంప్‌కి మతిభ్రమించింది

                        North-Korea

సియోల్ : అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తప్పదనుకుంటే తమ దేశాన్ని సర్వనాశనం చేస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మతిచెడిందని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటారని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం తాజాగా హెచ్చరించారు. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంపై తాము హైడ్రోజన్ బాంబుని ప్రయోగించే అవకాశముందని, అయితే దానిపై తుది నిర్ణయం తమ అధినేతదేనని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్‌హో హెచ్చరించారు. ఉత్తరకొరియాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తామంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో తొలిసారిగా ప్రసంగించిన అమెరికా అధినేత లక్షంగా ఉత్తరకొరియా నేత విరుచుకుపడ్డారు.

తన ఐరాస ప్రసంగంలో కిమ్‌ని రాకెట్ మ్యాన్‌తో పోల్చిన ట్రంప్…ఉత్తరకొరియాని సర్వనాశనం చేస్తామంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. యావత్ ప్రపంచం చూస్తుండగా ట్రంప్ తనతో పాటు తన దేశాన్ని అవమానించారు. అంతేకాక చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భీకర యుద్ధం చేస్తామంటూ తమకు హెచ్చరిక జారీ చేశారని కిమ్ చెప్పినట్లు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) ఉటంకించింది. ఐరాసలో చెత్తవాగుడు వాగినందుకు అమెరికా సార్వభౌమాధికారిగా ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకునే విధంగా చేస్తానని ఉత్తరకొరియా అధినేత తీవ్రంగా హెచ్చరించారు.

మరోవైపు ఉత్తరకొరియాపై ఆంక్షల్లో భాగంగా, ట్రంప్ తాజా కార్యనిర్వాహక ఆదేశానుసారం, అమెరికాలోని కంపెనీలు ఉత్తరకొరియాతో వ్యాపార కార్యకలాపాలు చేపట్టడం నిషేధం. కాగా, నిషేధిత అణ్వాయుధ కార్యక్రమాన్ని ఉత్తరకొరియా కొనసాగించకుండా ఆ దేశంపై ఆంక్షలను కఠినతరం చేయాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా పిలుపునిస్తోన్న సంగతి తెలిసిందే.