Home అంతర్జాతీయ వార్తలు ఉత్తర కొరియాలో ట్రంప్ అడుగు

ఉత్తర కొరియాలో ట్రంప్ అడుగు

Donald Trump

 

చర్చల ప్రక్రియలో ముందడుగు
సరిహద్దుల్లో కిమ్‌తో సంక్షిప్త, కీలక చర్చలు
ఉద్రిక్తతల నేపథ్యంలో నేతల కలయిక

ప్యాన్‌ముంజోమ్/ ప్యాంగ్యాంగ్ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఉత్తర కొరియా భూభాగంలో ఈ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్‌ను కలుసుకున్నారు. అమెరికా అద్యక్షులు ఒకరు ఉత్తర కొరియా భూ భాగంలో కొద్దిసేపు అయినా పర్యటించడం ఇదే తొలిసారి. ఈ విధంగా ట్రంప్ ఉత్తర కొరియా భూభాగంలోకి రావడం చారిత్రకంగా మారింది. జపాన్‌లోని ఒసాకాలో జి20 సదస్సు నుంచి నేరు గా ప్రెసిడెంట్ ట్రంప్ కొరియాకు వచ్చారు. రెండు కొరియా దేశాలు, అమెరికా సబంధాల నేపథ్యంలో నెలకొన్న అంతర్యుద్థ ప్రాంతంలో ఆదివారం ట్రంప్ రాక అత్యున్నత స్థాయినాటకీయ దౌత్య పరిణామాన్ని చాటింది. దక్షిణ కొరియా ప్రాంతానికి తొలుత చేరుకున్న ట్రంప్ సరిహద్దుల్లోని నిస్సైనిక ప్రాంతాన్ని (డిఎంజడ్) దాటి అక్కడున్న కిమ్‌ను కలిశారు. అక్కడ కొద్ది సేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలపై చర్చలకు క్షేత్ర స్థాయిని వాతావరణం కల్పించేందుకు ఇరువురు నేతలు ఈ సందర్భంగా అంగీకరించారు.

ఆ తరువాత కిమ్ చేయి పట్టుకుని ట్రంప్ దక్షి ణ కొరియా భూ భాగానికి తీసుకువెళ్లారు. అక్కడ కొనసాగిన చర్చలలో కిమ్‌ను అమెరికా పర్యటనకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. వైట్‌హౌస్‌కు కోరుకున్నప్పుడు రావచ్చునని, ఎల్లవేళలా కిమ్ అంటే తనకు స్నేహ భావం ఉందని ట్రంప్ చెప్పారు. తాను ఇక్కడికి రావడం తనకు గర్వకారణం అని, అనేక మంచి పనులు ఇక ముందు జరగనున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. తరువాత కిమ్ స్పందిస్తూ తమ ఇద్దరి మధ్య కరచాలనం శాంతికి ఆహ్వానం అన్నారు. ఉత్తర దక్షిణాల విభజనకు ప్రతీక అయిన ప్రాంతం లో నిలబడి ఉన్న తాము గతాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్లుతామని చెప్పకనే చెపుతున్నామని ఈ సందర్భంగా కిమ్ చెప్పారు. కొద్ది సేపటికి అక్కడే ఉన్న దక్షిణ కొరియా నేత మూన్ జెఇన్ కూడా వారితో వచ్చి కలిశారు. ట్రంప్ వారిద్దరితో కరచాలనం చేశారు.

ముగ్గురు కలిసి నవ్వు తూ కొద్ది సేపు మాట్లాడుకుంటూ గడిపారు. ట్రంప్ కిమ్‌ల తొలి భేటీ ఆద్యంతం అట్టహాసంగా సింగపూర్‌లో గత ఏడాది జరిగింది. నిరాయుధీకరణ దిశలో ఇష్టాగోష్టి చర్చలు జరిగాయి. తరువాతి భేటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలో జరిగాయి, అయితే తరువాత చర్చలలో పురోగతి కన్పించలేదు. తరువాతి క్రమంలో ఇరుదేశాల మధ్య ఆయుధాల విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. ఈ దశలో తనకు తానుగా స్పందించి ట్రంప్ కొరియా పర్యటనకు తరలివచ్చారు. సరిహద్దులు దాటి ట్రంప్ వెళ్లడం అత్యంత కీలక పరిణామం అని దీనితో చర్చలలో ప్రతిష్టంభనకు సరైన పరిష్కార మార్గం దక్కుతుందని స్టిమ్సన్ సెంటర్ ఫర్ ఆసియా విశ్లేషకులు డేవిడ్ కిమ్ తెలిపారు.

Donald Trump steps into North Korea with Kim Jong Un