Home అంతర్జాతీయ వార్తలు కనీవినీ ఎరుగని దాడి చేస్తాం

కనీవినీ ఎరుగని దాడి చేస్తాం

  • ఉ.కొరియాకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
  • గువామ్‌పై  పొంగ్యాంగ్ దాడి ప్రకటనకు అమెరికా స్పందన

Donald-Trump-Kim-Yong

వాషింగ్టన్ : తమపై దాడి చేస్తానంటూ పదే పదే హెచ్చరిస్తున్న ఉత్తరకొరియాకి దీటైన సమాధానమిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పష్టం చేశారు. గువామ్ దీవిలోని అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరాలకు సమీపంలో తమ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయాలనుకుంటున్నట్లు ఉత్తరకొరియా చేసిన ప్రకటన నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘అమెరికాకు మరిన్ని హెచ్చరికలు చేయకుండా ఉంటే ఉత్తరకొరియాకి మంచిది. లేకుంటే, ప్రపంచం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఆ దేశం మా కోపావేశాన్ని చవిచూస్తుంది. సాధారణ ప్రకటనతో పాటు అతని(కిమ్ జోంగ్ ఉన్)కి హెచ్చరిక చేస్తున్నాం’ అని ట్రంప్ న్యూజెర్సీలోని తన విడిది గృహంలో మంగళవారం విలేకరులతో అన్నారు. ఉత్తరకొరియా అణు సామర్థాలపై పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మరోవైపు ఉత్తరకొరియా తన అణ్వాయుధాల్లో ప్రవేశపెట్టేలా ఒక వార్‌హెడ్‌ను విజయవంతంగా తయారు చేసిందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఉత్తరకొరియా తన వద్ద ఉన్న మధ్యస్తం నుండి దీర్ఘశ్రేణి సామర్థ వ్యూహాత్మక బాలిస్టిక్ రాకెట్ హ్వాసంగ్1తో గువామ్ చుట్టుపక్కల ప్రాంతాలపై దాడికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) వెల్లడించిన నేపథ్యంలో తాము కూడా దీటైనా సమాధానమిస్తామంటూ ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అయితే ఆయన ప్రకటనను విపక్ష డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరకొరియాను మరింత రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, ఆ దేశం దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలను కొనసాగించేలా చేయడం సరికాదు. దానికి బదులుగా, బిల్ పెర్రీ, శామ్ నన్, జార్జ్ షూల్ట్ లాంటి సీనియర్ రాజనీతిజ్ఞుల సూచనలను అమెరికా తీసుకుని ఉత్తరకొరియాతో ద్వైపాక్షిక చర్చలు జరపడం ఉత్తమమని సిలికాన్ వ్యాలీకి ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతి అమెరికా పార్లమెంటు సభ్యుడు రో ఖన్నా అభిప్రాయపడ్డారు. సెనేటర్ డయానీ ఫిన్‌స్టెయిన్ కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టారు. ఆంక్షలను కఠినతరం చేసి ఉత్తరకొరియాని ఏకాకిని చేయడం ద్వారా అణ్వాయుధాలను ప్రోదిచేసుకోవాలన్న ఆ దేశ ప్రయత్నం నీరుగారిపోదు. ట్రంప్ ప్రస్తుతం చేస్తున్న దుందుడుకు ప్రకటనలు కూడా పరిస్థితిని శాంతింపజేసేలా లేవని ఆమె అన్నారు. మరోవైపు ఉత్తరకొరియాతో చర్చలకు తాము సుముఖంగానే ఉన్నామని అమెరికా హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సంయమనానికి చైనా వినతి
ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై చైనా స్పం దించింది. కొరియా ద్వీపకల్పంలో పరిస్థితి జటిలంగానూ, సున్నితంగానూ ఉందని పేర్కొంది. అందువల్ల ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. మాటలు, చేతలతో ద్వీపకల్పంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఉత్తరకొరియాపై ట్రం ప్ చేసిన ప్రకటనపై స్పందించాలని కోరడంతో చైనా విదేశాంగ శాఖ ఈ మేరకు పేర్కొనడం గమనార్హం.