Home తాజా వార్తలు సెటిల్‌మెంట్‌లకు తావివ్వద్దు: ఎర్రబెల్లి

సెటిల్‌మెంట్‌లకు తావివ్వద్దు: ఎర్రబెల్లి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి
అందరిని కలుపుకొని పోవాలి
గ్రామాలను పచ్చగా ఉంచుకోవాలి
గ్రామాల్లోనే సర్పంచ్, కార్యదర్శులు ఉండాలి
ఐదు నెలల్లో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తా
35ఏళ్ల నిరీక్షణ నెరవేరింది
తొర్రూరు అభినందన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 Errabelli Dayakar Rao

మనతెలంగాణ/తొర్రూరు : గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేసి వారికి న్యాయం కల్పించడంతో పాటు గ్రామంలో అందరిని కలుపుకొని పోవాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎల్‌వైఆర్ గార్డెన్‌లో తొర్రూరు మండల టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏ చిన్న పదవి ఇచ్చినా స్వీకరిస్తానని అనుకున్నానని కాని తనకు ఇంత పెద్ద బాధ్యత ఇస్తాడని అనుకోలేదు.

సిఎం కెసిఆర్ తనను ప్రజా సమస్యలు తెలిసినవాడివి పంచాయతీరాజ్ ఇస్తున్నా తీసుకో అనడంతో నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ ఎవరు ఏ చిన్న తప్పు చేసినా ఊరుకోరని అన్నారు. తన 35ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు తీరిందని అన్నారు. అందుకు గ్రామాల్లో పార్టీలకతీతంగా ఎవరికి అన్యాయం చేయకుండా, ఇబ్బందులు పెట్టకుండా కార్యకర్తలు, నాయకులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నిరంతరం సేవ చేస్తానని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు ఆదరించి ఈసారి అధిక మెజార్టీతో గెలిపించడం ఆనందంగా ఉందన్నారు.

గ్రామాల్లో ఎలాంటి అవినీతి లేకుండా స్వచ్ఛమైన పాలనను అందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణ కేంద్రంలో నాయకులు ఎవరు కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేయవద్దని చెప్పారు. ఇలాంటివి ఏ కార్యకర్త చేసినా పరోక్షంగా నాకే వర్తిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధే లక్షంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ నెల 7న వరంగల్‌లో జరగబోయే రాష్ట్ర టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు పార్లమెంట్ సన్నాహక సమావేశ బహిరంగ సభకు తొర్రూరు నుంచి వెయ్యి మంది కార్యకర్తలు తరలి రావాలని అన్నారు. తనకు కేసీఆర్ రెండు ఎంపీలను గెలిపించే పెద్ద బాద్యత మరొకటి ఇచ్చారని అన్నారు. గ్రామాల్లో పార్టీలకతీతంగా అందరిని కలుపుకొని పోవాలని అన్నారు. ఎవరికి కూడా అన్యాయం చేయవద్దని చెప్పారు.తొర్రూరు పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అందుకు అందరు సహకరించాలన్నారు.

సెటిల్‌మెంట్‌లకు తావివ్వద్దు ….

గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో, తండాల్లో ఎవరైనా న్యాయం కోసం నాయకుల దగ్గరికి వస్తే వారికి అన్యాయం చేయకుండా న్యాయం వైపు మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయాలని సెటిల్‌మెంట్‌లకు తావివ్వద్దని అన్నారు. గ్రామాల్లో ఎవరైనా సెటిల్‌మెంట్‌లు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యల కోసం కృషి చేయాలని చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్షమని అన్నారు. కేసీఆర్ కళలు కన్న బంగారు తెలంగాణ సాధన కోసం అందరు కలిసి కట్టుగా పరిష్కారం చేసుకోవాలని అన్నారు.

గ్రామాలను పచ్చగా ఉంచుకోవాలి….

గ్రామాలు, తండాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. గ్రామాల్లో ఎక్కడా చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతీ ఒక్కరు విధంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని అన్నారు. గ్రామం పచ్చగా ఉంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే ప్రజలు సుఖసంతోశాలతో ఉంటారని చెప్పారు.

గ్రామాల్లోనే కార్యదర్శులు, సర్పంచ్‌లు ఉండాలి….

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను గ్రామాల్లోనే ఆయా గ్రామాల కార్యదర్శులు, సర్పంచ్‌లు అందుబాటులో ఉండాలని ఎక్కడో పట్టణ కేంద్రాల్లో ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఆడపడుచులు ఆరుబయటకు మరుగుదొడ్ల కోసం వెళితే సర్పంచ్‌లను సస్పెండ్ చేయిస్తా. ఆడపడుచులు ఆరుబయటకు వెళ్లకుండా చూడాల్సిన బాద్యత కార్యదర్శులు, సర్పంచ్‌లపై ఉందని చెప్పారు. ప్రతీ ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని అన్నారు. అవగాహన లేని గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
గ్రామాల్లో పారిశుద్దం లోపించకుండా ప్రజలు చూసుకోవాలని, ఎప్పటికప్పుడు సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రజల బాధలను తీర్చాలని సూచించారు.

ఐదు నెలల్లో కాళేశ్వరం ద్వారా నీళ్లందిస్తా….

ప్రజలకు ఐదు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీటిని జిల్లాకు తీసుకువచ్చి ప్రతీ గ్రామాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ప్రస్తుతం ఇంటింటికి నీళ్లను అందిస్తున్నామని, కొన్ని గ్రామాలకు మరికొద్ది రోజుల్లో అందుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాలను ఐదు నెలల్లో తీసుకువచ్చి రైతాంగ సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల్లో సాగునీటి కోసం నిరంతరం అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఐకేపీ నేతృత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్, మహిళా సంఘాల బలోపేతం, యువతకు డెవలప్‌మెంట్ స్కిల్స్ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, శ్మశాన వాటిక కార్యక్రమాలను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

 

Don’t Settlements in Village said by Errabelli Dayakar Rao