Home మెదక్ డబుల్ సంబురాలు

డబుల్ సంబురాలు

DOUBLE-HOME

సంగారెడ్డి/గజ్వేల్/మర్కూక్ : డబుల్ బెడ్‌రూం గృహప్రవేశాలతో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజల ఆనందానికి అవధుల్లేవు. ఏ ఇంట చూసినా కుటుంబ సభ్యులు, పండగకు వచ్చిన వారి బంధువులతో సందడితో కనిపించాయి. ఇంటి ప్రధాన ద్వారానికి బంతిపూలు, మామిడి ఆకులతో తోరణాలు కట్టి పల్లె వాతావరణాన్ని ద్విగుణీకృతం చేశారు. వాస్తుపూజ, సత్యనారాయణస్వామి పూజలు, విందుభోజనాలతో సర్వత్రా సంబురాలు చేసుకుంటూ కనిపించారు. ప్రతి ఇంటికీ నల్లాలతో తాగునీరు నిరంతరంగా రావటంతో నీటికష్టాలు తీరాయని ఆనందంతో ఉన్నారు. ఇంటింటికీ ఎల్‌ఇడి బల్బులు బిగించారు. ఇంటకో ఐదు మొక్కలు నాటుకున్నారు. తమ పాలిట దేవునిగా సిఎం కెసిఆర్ మారాడని వేనోళ్ల లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సామెల్ల లలిత, సాయిలు దంపతులైతే తమ ఇంటిప్రవేశ ద్వారం వద్ద కుర్చీలో సిఎం కెసిర్ ఫోటో పెట్టుకుని దేవున్ని పూజించినట్లు పూజలు చేశారు. ఒక ఆఇంట్లోనే కాదు చాలా మంది ఇలా సిఎం ఫోటోలు పెట్టుకుని పూజలు చేశారు. ఇంకోవైపు పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కులో చిన్నారుల ఆటపాటలతో కేరింతలు కొడుతూ ఎన్నడూ లేని కొత్త అనుభూతితో ఉల్లాసంగా గడిపారు. నర్సన్నపేట గ్రామంలో కొందరు లబ్దిదారుల ఇండ్లు అసంపూర్తిగా ఉన్నప్పటికీ ముహూర్తం బాగుందని, అందరితోపాటు పూజచేసుకోవాలనే కోరికతో శుక్రవారం ఆ ఇండ్లలోనే సత్యనారాయణ పూజలు నిర్వహించుకున్నారు. విశాలమైన రోడ్లు, డివైడర్లు, డివైడర్ల మధ్య ఎల్‌ఇడి వీధి దీపాలు, రోడ్లకు ఇరువైపులా నాటిన పచ్చని చెట్లు ఆగ్రామాలలో అహ్లాదకరమైన వాతావరణంతో పూర్తి స్థాయి పట్టణ శోభను సంతరించుకున్నాయి. నర్సన్నపేటలో ఇంటింటికీ పదిచొప్పున కోళ్లు, రెండు పాడిపశువులను శుక్రవారం అందచేశారు. ఎర్రవల్లిలో మాత్రం ఇంతపెద్ద పండుగలాగా చేసుకుంటున్న కార్యక్రమంలో గ్రామస్తులంతా నిమగ్నమైనామని చెప్పటంతో అక్కడ కోళ్లు, పాడిపశువుల పంపిణీ తాత్కాలికంగా వాయిదా వేశారు.
వేదపండితులు, పురోహితులకు ఆర్టీసి బస్సుల ఏర్పాటు …
వివిధ ప్రాంతాల నుంచి వేదపండితులు, పురోహితులు ఎర్రవల్లి, నర్సన్నపేటకు రావటానికి వీలుగా 13 ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేశారు. ఒకేసారి సుమారు 6వందల గృహప్రవేశాలు చేయటానికిగాను దానికి తగిన సంఖ్య కంటే అధికంగానే గజ్వేల్ బ్రాహ్మణ పరిషత్, నారాయణఖేడ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేదపండితులు, పురోహితులు వచ్చారు. తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ అష్టకాల రాంమ్మోహన్ శర్మ నేతృత్వంలో సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు లోక రవిచంద్ర, గజ్వేల్ బ్రాహ్మణ యువపరిషత్ పక్షాన బండారు రాంప్రసాదరావులు సమన్వయంతో వేదపండితులు, పురోహితులను సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు. ఈ బ్రాహ్మణ, వేదపండితులకు మర్కూక్ పాండురంగ ఆశ్రమంలో బసకల్పించటంతో పాటు అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేశారు.
పూజలో పాల్గొన్న కలెక్టర్ దంపతులు …
కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన గణపతి హోమం పూజలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు జెసి హనుమంతరావు, ఆర్డీఒ విజయేందర్‌రెడ్డి తదితర అధికారులు పూజలో పాల్గొన్నారు. హోమం పూర్ణాహుతి పూర్తయ్యేవరకు మాత్రం కలెక్టర్ దంపతులు పూజ నుంచి కదలకుండా కూర్చున్నారు.

మాట తప్పని నాయకుడు కెసిఆర్ …

ఎర్రవల్లికి చెందిన సామెల్ల లలిత మాట్లాడుతూ తామైతే జీవితంలో ఇంత మంచి ఇల్లు కట్టలేక పోయేవాళ్లం, పేదోళ్లపాలిట కెసిఆర్ సారు దేవుడే అన్నారు. ఇప్పటికీ ఇంత గొప్ప ఇల్లు తమకు దక్కిందంటే నమ్మలేక పోతున్నామని ఆమె పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేసింది. అదే గ్రామానికి చెందిన తొందురు ఎల్లమ్మ, బిక్షపతి దంపతులు మాట్లాడుతూ మా అదృష్టం కొద్దీ కెసిఆర్ మావూరికి వచ్చిండు. ఎలక్షన్ల ఇల్లు గిట్లనే కట్టిస్తనన్నడు కానీ అప్పుడు నమ్మలే.. కానీ ఇచ్చిన మాట నిలుపుకుని మాట తప్పని లీడరు అనిపించుకున్న సిఎంకు మేం రుణపడి ఉంటం అని అన్నారు. మాకు ఒక్కపైసా ఖర్చు లేకుండా ఇల్లు కట్టించుడే కాకుండా ఇంటిపూజ చేసిన పంతులు ఖర్చు, ఆఖరుకు పూజసామాను కూడా పెద్దసారే పెట్టుకున్న మారాజు అంటూ సిఎం కెసిఆర్ పట్ల వారు తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

– తొందురు ఎల్లవ్వ- సామెల్ల లలిత