Home మెదక్ డబుల్ బెడ్‌రూం పథకం పేదలకు వరం

డబుల్ బెడ్‌రూం పథకం పేదలకు వరం

అందరూ సద్వినియోగం చేసుకోవాలి
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
PADMAమెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు పేదలకు పక్కా గృహాల నిర్మాణం డబుల్ బెడ్‌రూం పథకాన్ని దసరా రోజు ప్రారంభిం చడం గొప్ప విశేషమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కొనియాడారు. అందులో భాగంగానే శుక్రవారం నాడు మెదక్ మండలంలోని హవేలి ఘనపూర్‌లో గంగిరెద్ది కాలనీ పేదలకు 38 డబుల్ బెడ్‌రూం ఇండ్లకు భూమి పూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని పేదలకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాకు మొదటి విడతగా 4 వేల గృహాలు మంజూరు కాగా, నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. మొట్టమొదటిగా డబుల్ బెడ్‌రూం పథకాన్ని మెదక్ మండలంలోనే ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరు 38 గృహాలను ఒకే దగ్గరనే నిర్మించుకోవల్సిందిగా గంగిరెద్దికాలనీ వాసులకు ఆమె తెలిపారు. ఒక్క గృహానికి ప్రభుత్వం తరుపునుంచి రూ.5.4లక్షల చొప్పున చెల్లిస్తుందని తెలిపారు. దీంతో అందమైన ఇళ్లును నిర్మించుకోవచ్చని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం ఇలాంటి చక్కటి పథకాన్ని చేపట్టడం మంచి పరిణామమని ఆమె అన్నారు. ముఖ్యంగా ఇళ్లులేని నిరుపేదలకు, అద్దె ఇంట్లో నివాసం ఉండేవారికి ఈ డబుల్ బెడ్‌రూం పథకం ఎంతో దోహద పడుతుందన్నారు. ప్రభుత్వ అధికారులు వచ్చి కాంట్రాక్టర్లతో ముగ్గువేయించి చక్కటి ఇళ్లును నిర్మించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు. లబ్ధ్దిదారులు కూడా భాగస్వాములై పనిలో దగ్గరుండి మీకు నచ్చినట్లుగా కాంట్రాక్టర్‌తో సహకారం తీసుకుని కట్టుకోవాలని ఆమె సూచించారు.
ఇందులో ఎటువంటి నిష్పక్షపాతం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అనంతరం కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు మంచి అవకాశం ఇచ్చి, ఇళ్లులేని నిరుపేదలకు రూ.5.4 లక్షలతో చక్కటి డబుల్ బెడ్‌రూం నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విశేషమని, మెదక్ నియోజకవర్గంలో హావేలి ఘనపూర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమంలో అందరు పాల్పంచుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల గురించి ఆలోచించి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో మెంచు నగేష్, తహశీల్దార్ విజయలక్ష్మీ, హావేళి ఘనపూర్ సర్పంచ్ సునీతా సాయిలు, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఎంపిపి లక్ష్మీకిష్టయ్య, జెడ్పిటిసీ లావణ్యరెడ్డి, ఎంపిడివో రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.