Home భద్రాద్రి కొత్తగూడెం ‘డబుల్’కు పగుళ్లు!

‘డబుల్’కు పగుళ్లు!

  • నాసిరకంగా ‘రెండు పడకల ఇళ్ల’ నిర్మాణాలు
  • ఇసుకలో కొరవడిన నాణ్యత
  • ఇటుకదీ అదే పరిస్థితి..
  • చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “డబుల్ బెడ్‌రూం” తొలినాళ్లలోనే బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. కాంట్రాక్టర్ల కక్కుర్తి… అధికారుల ఉదాసీనత… పథకానికి అభాసుపాలు చేస్తోంది. నిర్మాణానికి సరిపడ నిధులు సర్కారు విధిల్చడంలేదనే సాకుతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మారింది. నిర్మాణ దశలోనే పగుళ్లు రావడం నాణ్యతకు అద్దం పడుతోంది. ఇసుక దుబ్బని తలపిస్తోందనే విమర్శ వినిపిస్తోంది. నాసిరకం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. ఈ ఇళ్లు మూడ్నాళ్ల ముచ్చటేనని ఇట్టే అర్థమవుతోంది.

Double-Bedroom-House

బూర్గంపహాడ్ : ప్రతి పేదవానికీ ఇల్లుండాలని, అది కూడా కుటుంబానికి సరిపడేలా, సకల సౌకర్యాల నడుమ నిర్మించి ఇవ్వాలని తెలంగాణ సర్కారు భావించింది. కెసిఆర్ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల పూర్తి కాగా మరికొన్ని చోట్ల నిర్మాణం జరుగు తోంది. కానీ ఇళ్లు నిర్మించే తీరు చూస్తుంటే.. పనుల్లో డొల్లతనం ఇట్టే అర్థమవుతోంది. ఈ ఇళ్లు మూణ్నాళ్ల ముచ్చటేనని తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర సమీపంలో డబుల్ బెడ్ రూం నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ 31 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అయితే పనుల తీరు చూస్తుంటే.. డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నాణ్యత
కొరవడిందనే ఆరోపణకు తార్కాణంగా నిలుస్తోంది.
నాణ్యత డొల్లే..!
నాసిరకం ఇటుకలు, ఇసుకతో నిర్మాణం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కాసులకు కక్కుర్తి పడిన కాంట్రాక్టర్ నాసిరకం ఇసుకతోనే పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనితోపాటు ఇటుకలో నాణ్యతే లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కింద పడేస్తే ముక్కలు ముక్కులవుతోందని, వాటితోనే నిర్మాణం జరుగుతోందని చెబుతున్నారు. దీనివల్ల ఒకపక్క పనులు చేస్తుంటేనే.. మరోవైపు ఇళ్లు బీటలు
వారుతున్నాయని అంటున్నారు.
మంత్రి ఆదేశాలు బేఖాతర్..
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అక్కడకు వచ్చిన రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. రోడ్డు కంటే ఇంటి నిర్మాణాల బేస్ మట్టం ఎక్కువ ఎత్తులో ఉండేలా నిర్మించాలని చెప్పారు. పనుల్లో నాణ్యత కొరవడితే సహించేది లేదని హెచ్చరించారు. అయినప్పటికీ ఇక్కడ పనులు మాత్రం వీటన్నింటికీ పూర్తి భిన్నంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు ఇలాగే కొనసాగితే అవి కొద్దికాలానిగే కూలిపోతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి డబుల్ బెడ్‌రూం పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ విషయమై డిఇ రామును వివరణ కోరగా… పనుల గురించి తనకేమీ తెలియదని చెప్పారు. డబుల్ బెడ్‌రూం పనులన్నింటినీ ఎఇనే పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కావున సందేహాలుంటే ఎఇతోనే మాట్లాడాలని చెప్పడం గమనార్హం.