Home కలం బాలలకు తాయిలం ‘వెన్న ముద్దలు’

బాలలకు తాయిలం ‘వెన్న ముద్దలు’

Dr. Cottonpaka Mohan write up venna muddalu

‘బాలలే విజ్ఞాన హేతువులు
నేడు రేపుల మధ్య సేతువులు
చంద్ర బంధుర సుధా శీతువులు
మానవత్వ వికాస హేతువులు’ – శ్రీశ్రీ
1979లో అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా బాలల లక్షణాలను ప్రశంసిస్తూ శ్రీశ్రీ చెప్పిన మాటలివి. బాలలు విజ్ఞాన సేతువులు… అన్నెం పున్నెం ఎరుగని అమాయకులు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళని నమ్మే అచ్చమైన స్వచ్ఛమైన వాళ్ళు. ఉగ్గుపాల, వెన్నముద్దల దశ నుండి బయటకు వచ్చి అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలను, వారి పాలమనసును సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన, గురువులపైన, సమాజంపైన ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే చక్కని, చిక్కని బాల్యాన్ని దాటి వచ్చిన మనలాంటి వారి మనసు కన్నీరుకార్చకుండా ఉండలేదు మరి. బాల్యం నుండే చిన్నారులకు చదువుతోపాటు సంస్కారం, మన సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు, మానవతా విలువలు పెంపొందించడంలో నేడు బాలసాహిత్యం ప్రధాన భూమిక పోషిస్తుంది. ఆధునిక సాహిత్యంలో బాల సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాలలకు హితాన్ని చేసేదే బాల సాహిత్యం. “నేటి బాలలే-రేపటి పౌరులు” కదా, దేశ భవిష్యత్తు అంతా నేడు పాఠశాల తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటున్న సమయం ఇది. వారి బాల్యాన్ని ఆనందంగా గడిపేందుకు, ఆలోచనా రీతుల్ని పెంపొందించేందుకు బాల సాహిత్యం చిన్నారులకు ఎంతగానో చేదోడు వాదోడుగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. బాలల మనసెరిగిన గేయాలు, మన చుట్టూ ఉండే పరిసర ‘వస్తు విషయాల’ను ఇతివృత్తంగా తీసుకొని రాసిన గేయాలను చిన్నారులకు అందించినట్లయితే వారు నేర్చుకున్న బాలగేయాలు వెన్నంటి ఉండి చెడు మార్గంలో పోనీయకుండా కాపాడుతూ ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఎంతగానో దోహద పడతాయి. బాల గేయంలో అభినయంతో పాటు అంత్యప్రాసలు, చక్కటి బొమ్మలు ఉండటం వలన పిల్లలకు ఎక్కువ కాలం ధారణగా ఉండి వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి ప్రయత్నమే ఇక్కడ రచయిత డా. పత్తిపాక మోహన్ చేసారు. వారి బాల్యాన్ని ఎంతో రంగులమయం చేసిన గేయాలు, బడిలో సార్ లు, టీచర్లు చెప్పిన సంగుతులన్నీ మరొక్కసారి గుర్తుచేసుకుంటూ రాసిన బాలగేయాల్ని ‘వెన్న ముద్దలు’గా మనకు అందించారు.

‘బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రతీది బాలసాహిత్యం’ అని నమ్మే డా. మోహన్ ఇప్పటికే ‘పిల్లల కోసం మన కవులు (2004), చందమామ రావే (2010), పిల్లల కోసం మన పాటలు (2013) పిల్లల కోసం పొడుపు కథలు (2017), ఆకుపచ్చని పాట, ఒక్కేసి పువ్వేసి చందమామ (2018) వెలువరించారు. అంతేగాక ఇతర భారతీయ భాషల్లో విశేష ప్రాచుర్యం పొందిన పదిహేను పిల్లల కథల పుస్తకాలను మన తెలుగు పిల్లల కోసం తెలుగులోకి అనువాదం చేశారు. బాల సాహిత్య వికాసం కొరకు వందకుపైగా వ్యాసాలు అన్ని ప్రముఖ పత్రికల్లో రాసారు. పసిపిల్ల మనసుకు హత్తుకుపోయేలా వారి విజ్ఞానాన్ని వికసింపజేసేలా అందమైన అమాయకమైన బాల్యానికి మంచి సందేశాన్ని అందించేవిగా ‘వెన్నముద్దలు’ గేయ సంపుటి పొందుపరచబడింది. దీనిలోని గేయాల విషయానికి వస్తే….

‘పిలుపు’ గేయంలో….
“కొక్కొరోకొక్కో కోడి కూసింది / తెల్లవారింది నిద్ర లేవండి
భౌ…భౌ…భౌ….భౌ కుక్క అరిచింది / ఇంటిలోనికెవ్వరో వచ్చినట్టుంది
మ్యావ్ మ్యావ్ మ్యావ్ పిల్లి పిలిచింది / ఎలుక పిల్ల ఎగిరి కలుగులో దూరింది”
సృష్టిలో ఒక్క మనిషి మాత్రమే తనలోని భావాలను భాష ద్వారా ఎదుటివారికి తెలియజేస్తాడు. ఇటువంటి అవకాశం ఇతర ఏ జీవులకు లేదు. కానీ దీనికి అతీతమైన సందేశాన్నిమనకు అందించారు రచయిత. మనుషులకే కాదు.. పశువులకు, పక్షులకు, జంతువులకు సృష్టిలోని ఏ ప్రాణిని తీసుకున్నా ఆయా ప్రాణులను బట్టి వివిధ రకాల పిలుపులను అనుకరిస్తాయని… ఒక్కో పిలుపు ఒక్కో సందర్భాన్ని …సంకేతాన్ని తెలియజేస్తుందని ‘పిలుపు’ గేయం ద్వారా పిల్లలకు తెలిపారు.
బాల బాలికలకు ‘సమైక్యతా భావం’ గురించి చెప్పడం బాల గేయాల ద్వారానే సాధ్యం. అడవిలోని జంతువుల మధ్య ఉన్న సమైక్యత – సమాజంలోని మానవుల మధ్య ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తుంది ‘అడవి తల్లి’ గేయం.
“అందానికి ప్రతిరూపం, పచ్చనైన అడవి / చెట్టూ పుట్టలతో వెలిగేటి గుడి
కులం చీడ లేనిది, మతం కానరానిది / సమన్యాయం పాటించే సంఘమది
ఎలుకా, చిలుకా, పెద్దపులి ఒకటే ఒకటే అన్నీ / కలిసిమెలిసి జీవించాలి ఆకలి వేస్తే వేటాడాలి
చిన్నా పెద్ద ఎవరైనా, మంచిచెడ్డలు ఏవైనా / అంతా ఒకటే అడవిలో అన్నీ ఒకటే.”
అడవిని పవిత్రమైన గుడితో, కులాల చీడ – మతాల జాడ ఏమాత్రం దరిదాపులకు రాని మమతల ఒడితో పోల్చారు. ధనిక పేద వర్గాలు కనబడని సమన్యాయం జంతువులది అంటారు. ఆకలేస్తేనే వేటాడే గుణం జంతువులది, కానీ మనిషి సర్వ భక్షకుడు అంటూ ‘అడవి తల్లి’ గేయం ద్వారా ‘అడవే నేటి సమాజానికి ఆదర్శం’ కావాలని చెప్పే సందేశం బాగుంది. అంతరించిపోతున్న ఆటలను అందలమెక్కించిన గేయం ‘గుడుగుడు గుంచం’. గేయం పాడుతున్నంత సేపు మనందరం మరొక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్ళాల్సిందే.
“గుడుగుడు గుంచం కూడి ఆడుదాం / చింతగింజలు తెద్దాం ఓనగుంటలాడుదాం
పెంకముక్క తెద్దాం తొక్కుడు బిళ్ళ ఆడుదాం / చేయి కలిపి తిరుగుుదాం దాల్‌దడి ఆడుదాం
ఆడపిల్లలం అందరం చెమ్మ చెక్కా ఆడుదాం / అందరం కూడుదాం అష్ఠాచెమ్మా ఆడుదాం”
పిల్లల్ని ఊహాలోకంలో విహరింప చేసి, ఆటల పేర్లను, ఆడే విధానాన్ని పరిచయం చేయటం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ గేయంలోని ఆటల పేర్లను వింటున్నంతసేపు పిల్లలు ఒకింత ఆశ్చర్యానికి గురయినప్పటికి వాటి పేర్లను తెలుసుకునే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తారు. తొక్కుడు బిళ్ళ, దాల్‌దడి, అష్టాచెమ్మా, దాగుడుమూతలు, ఒనగుంట, గుడుగుడు గుంచం వంటి ఆటలు ఉంటాయని తెలుసుకుంటూ… ఆటలన్నీ ఆడిన అనుభూతికి కల్పించే గేయం.
ఉపాధ్యాయుని గురుతర బాధ్యతను గుర్తుచేస్తూనే… పిల్లలు పాటించవలసిన నియమాలను మనందరి ముందు ఉంచే ప్రయత్నమే “అ…ఆ…ఇ…ఈ” గేయం. పసి హృదయం ఏమి రాయబడని నల్లబల్ల. దానిపైన ఉపాధ్యాయుడు ఏది రాస్తే అదే వాడి మనసులో ముద్రపడి పోతుంది. చదువు పట్ల విద్యార్థులకు ఉన్న భయాన్ని భక్తిగా మార్చి బడికి రప్పించటంలో ఉపాధ్యాయుని పాత్ర అనిర్వచనీయమైనది. బడి అంటేనే బారెడంత దూరం పారిపోయే పిల్లల్ని ‘బడికి వెళ్దామా’ అని అనిపించిన గేయం ఇది.
“పలకా బలపం తెద్దామా / పరుగున బడికి వెళ్దామా
‘అ ఆ ఇ ఈ’ రాద్దామా / అంకెలు లెక్కలు చేద్దామా
చక్క….. చక్కని బొమ్మలు గీద్దామా / బడిలో టీచరు కిద్దామా…”
గేయం పాడుతూ.. అభినయం చేస్తూ పిల్లలు వారికి తెలియకుండానే అ, ఆ..లు రాయాలని, బొమ్మలు గీయాలని టీచరుతో మెప్పు పొందాలనే ఆతృత పిల్లల్లో కల్గుతుంది. వారికి మానసిక చైతన్యాన్ని కల్గించి, ఉత్తేజాన్ని పెంచే ఈ గేయం ప్రాథమిక స్థాయి పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతిలోని పలకరింపులను, పులకరింతలను పిల్లలకు దగ్గర చేసే గేయం “మూడు కాలాలు”. ఏ కాలమయినా కమ్మగా అనుభవించే పసితనం పిల్లలది. కాలాలను పరిచయం చేస్తూ ఎండాకాలపు వేడి గాలులను, చలికాలపు చల్ల గాలులను, వానాకాలపు వర్షపు జల్లులను సుతిమెత్తగా అందిస్తూ పిల్లల్ని కాలం ఒడిలో కరిగిపోయేలా చేసే గేయం ఇది.
“ఎండా కాలం వచ్చింది / వేడిగాలులు తెచ్చింది…..
చలికాలం వచ్చింది / చల్లని గాలులు వీచింది……
వానాకాలం వచ్చింది / వర్షపు జల్లులు కురిసింది”
మాతృదేవో భవ ! పితృదేవో భవ! ఆచార్యదేవో భవ! అంటూ తల్లి తండ్రి తర్వాత ‘గురువు’కు పెద్ద పీట వేసారు మన పెద్దలు. గురుబ్రహ్మ, గురువిష్ణూ, గురుదేవో మహేశ్వరా అంటూ బ్రహ్మ, విష్ణూ, మహేశ్వరుల తర్వాత అంతటి మహోన్నత స్థానం కేవలం ఉపాధ్యాయునికి మాత్రమే దక్కింది. ఉపాధ్యాయుడే పిల్లల మార్గదర్శకుడు – మార్గనిర్ధేశకుడు అంటూ “ఉపాధ్యాయుడు” గేయం చెప్తుంది.
“కల్లలెరుగని పిల్లల లోకం / కలతలు దూరం చేస్తాడు
… అంతరిక్షాన ఎగరాలంటె / రాకెట్ తానై వస్తాడు
ఆశ ఆశయమేదేమైనా / తెరచాపగ తానుంటాడు
జ్ఞానదీపమై వెలిగే గురువుకు / ఇదే ఇదే మా వందనము.” అంతరిక్షానికి ఎగరాలన్నా, భూమండలం చుట్టి రావాలన్నా ఉపాధ్యాయుడే విద్యార్థికి తెరచాప. అన్నెంపున్నెం ఎరుగని పిల్లలను సన్మార్గంలో పెట్టే జ్ఞానదీపమే గురువు అంటూ గురువులందరికి ఆదర్శప్రాయంగా నిలిచిన గేయం.
‘వెన్నముద్దలు’ బాల గేయాలు పిల్లలను ఒకవైపు ఆనందలోకంలో విహరింపజేస్తూనే మరొకవైపు చక్కటి సందేశాలను అందించాయి. గేయంలోని ‘పదాలు’ పువ్వులంత మెత్తగా, ‘భావాలు’ పరిమళమంత హాయిగా ఉన్నాయి. పాడుకోవడానికి సులువుగా ఉండి ప్రతీ అంశం పిల్లల మనసుల్లో చిరకాలం నిలిచి ఉంటాయి. తెలుగు బాల సాహిత్యం మళ్ళీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసిస్తున్న సమయంలో వచ్చి ఈ గేయాలు రేపటి బాలలకు ఎరువుగా ఉపయోగపడుతుందన్న అపార నమ్మకం నాకుంది.
(ఈ నెల 14న డాక్టర్ పత్తిపాక మోహన్‌కు డాక్టర్ వేదగిరి రాంబాబు స్మారక బాల సాహిత్య పురస్కారం 2018 ప్రదానం జరుగుతున్న సందర్భంగా…)

                                                                                                                                              డా॥ పత్తిపాక మోహన్