Home తాజా వార్తలు ఆకలితీర్చే చల్లని తల్లి

ఆకలితీర్చే చల్లని తల్లి

Dr. Neelima Arya

 

సాధారణంగా తినగా మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తింటాం. లేకుంటే వృథాగా పడేస్తాం. కానీ మనం పడేసే ఆహారంతో మరొకరి ఆకలి తీర్చవచ్చు కదా! ఈ ఆలోచన ఫలితంగానే 39 ఏళ్ల సామాజిక కార్యకర్త, పారిశ్రామికవేత్త అయిన డా. నీలిమ ఆర్య జీహెచ్‌ఎంసీ, ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కొద్ది రోజుల కిందట మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద ‘ఫీడ్ ది నీడ్’ను ప్రారంభించింది.

పేదల ఆకలిని తీర్చడం కోసం ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. స్థానిక కాలనీవాసులు, ఐటీ ఉద్యోగులు, రెస్టారెంట్ నిర్వాహకులు మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతున్నారు. వీటన్నింటిని అక్కడ ఉన్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది, వాలంటీర్లు ఆకలంటూ వచ్చే వారికి అందిస్తున్నారు.

భారతదేశంలో 1.3 బిలియన్ జనాభా ఆకలితో చనిపోతున్నట్లు వరల్డ్ బ్యాంక్ ఓ సర్వేలో తెలిపింది. 200 మిలియన్ జనాభా ఆహార కొరతతో బాధపడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇండియాలో మాత్రమే ఆకలితో అలమటించేవారు ఎక్కువ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

 

 

డా. నీలిమ ఆర్య ఆకలితో అలమటించేవారికి ఏదైనా సాయం చేయాలనుకుంది. ఫీడ్ ది నీడ్ ఆలోచన నీలిమదే. నగరం మొత్తం మీద మొత్తం 100 రిఫ్రిజిరేటర్లను ఏర్పాటుచేయాలన్నది ఆమె లక్షం. అందుకోసం అందరికీ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తోంది. “సిటీలో ఎవరూ ఆకలితో బాధపడకూడదు. 11 ఏళ్ల నుంచి సింగిల్ పేరెంట్‌గా ఉన్న నాకు ఆకలి అంటే ఏంటో బాగా తెలుసు. చాలా మంది మిగిలిపోయిన ఆహారాన్ని పడేస్తుంటారు. దాన్ని సేకరించి ఈ ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల చాలా మంది ఆకలిని తీర్చినవారమౌతామని” అంటోంది నీలిమ. రోజులో ఎప్పుడైనా సరే ఇక్కడ సేకరించిన ఫుడ్‌ను పెట్టవచ్చని, దాన్ని ఎవరైనా ఆకలిగా ఉన్నవారు తింటారని అంటోంది. ఈ ఫ్రిజ్ 530 లీటర్లు ఉంటుంది. ఇలాంటివే ఇంకా 9 వరకు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. నీలోఫర్ ఆస్పత్రి వద్ద, చందానగర్ మెట్రోస్టేషన్ వద్ద , ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద ఈ నెలాఖరు కల్లా ఏర్పాటుచేస్తామంటోంది.

నీలిమతోపాటు ఆపిల్ హోమ్ ఎన్‌జీవో సభ్యులంతా కలిసి ఈ ప్రాజెక్టు కోసం ఎంతో శ్రమించారు. ఆల్రెడీ అన్నపూర్ణ అంటూ రూ.5లకే భోజనం ఉందికదా అంటూ నిరుత్సాహ పరిచిన జీహెచ్‌ఎంసీని నీలిమ కన్విన్స్ చేశారు. “చాలా మంది హోటళ్ల యాజమాన్యం తమ దగ్గర మిగిలిపోయిన ఆహారాన్ని ఇవ్వడానికి మంచి మనసుతో అంగీకరించారు. ఈ సందర్భంగా నేను ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లాస్టిక్‌ను వాడకండి. మీరు ఇక్కడ పెట్టే ఆహారాన్ని ఎకో ఫ్రెండ్లీ కంటెయినర్లలో పెట్టండి. ప్లాస్టిక్‌లో పెట్టొద్దు. మా యూనిట్ వద్ద అలాంటి గిన్నెలు దొరుకుతాయి. ఫుడ్ ట్రక్‌లను తెచ్చే ఉద్దేశం కూడా ఉంది. ట్రక్కు ద్వారా వేస్ట్‌గా ఉన్న ఫుడ్‌ను సేకరిస్తాం. దాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతాం” అంటూ ప్రజలకు సూచిస్తోంది నీలిమ.ఇప్పటికే ఇక్కడ వాలంటీర్లు గా పనిచేసేందుకు కొంతమంది యువత సిద్ధమయింది. ఇక్కడ పెట్టే ఆహారాన్ని శుభ్రంగా, శుచిగా పెట్టండి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రజల బాధ్యత మనందరిదని అంటున్నారు వెస్ట్‌జోన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ హరిచందన.

Dr. Neelima Arya launched Feed The Need at Shilparamam