Home ఎడిటోరియల్ దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్

దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్

edit

జూన్ 2వ తేదీన షాంగ్రీలా డైలాగ్ ప్లీనరీ సెషనులో అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడ్డాడు. వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో సైనిక కార్యకలాపాల ద్వారా చైనా ఈ ప్రాంతంలో దేశాలను భయభీతులకు గురిచేస్తున్నదని విమర్శించాడు. అమెరికా పాటించే పారదర్శక విధానాలకు చైనా చర్యలు పూర్తిగా విరుద్ధమని కూడా తమ గురించి చెప్పుకున్నాడు. చైనా ఇదేవిధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు. అంతేకాదు, దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలాపాలకు నిరసనగా రిమ్ ఆఫ్ ది పసిఫిక్ నౌకాదళ విన్యాసాల్లో చైనాకు పంపిన ఆహ్వానాన్ని అమెరికా రద్దుచేసింది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలవి. అమెరికా, చైనాల మధ్య తాజా ఉద్రిక్తతల వెనుక కారణాలను పరిశీలించడం అవసరం. దక్షిణచైనా సముద్రంలో అమెరికా చైనా రెండు దేశాలకు ఉన్నప్రయోజనాలు, వ్యూహాత్మక సానుకూలతలను కూడా పరిశీలించడం అవసరం. గత కొంతకాలంగా దక్షిణ చైనా సముద్రంపై పూర్తి అదుపు సంపాదించడానికి చైనా ప్రయత్నిస్తోంది. మరోవైపు వియత్నాం, ఫిలిప్పిన్స్, తైవాన్ దేశాలు కూడా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి తమ తమ హక్కుల గురించి గొంతెత్తుతున్నాయి. చైనాకు వ్యతిరేకంగా వాదిస్తున్నాయి. కాని ఎవరేమన్నా చైనా పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ ఒత్తిడికి లొంగడంలేదు. ప్రతిఘటనలను లక్ష్యపెట్టడం లేదు. ఈ ప్రాంతంలోని పారాసెల్ దీవుల్లో చైనా సుదూర లక్షాలపై బాంబులు ప్రయోగించగల యుద్ధ విమానాలనుదింపింది. అలాగే స్పార్టీ దీవుల్లో నౌకలను, విమానాలను పేల్చివేయగల క్షిపణి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దక్షిణ చైనా సముద్రంలోపై చైనా విమానదళం విన్యాసాలు, గస్తీలు తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సైనికంగా దక్షిణ చైనా సముద్రంలో చైనాదే ప్రాబల్యం. దక్షిణ చైనా సముద్రంలో సైనిక కార్యకలాపాలు కేవలం చైనా ఒక్కటే చేపట్టలేదు. ఇతర దేశాలు కూడా కొద్దో గొప్పో సైనిక కార్యకలాపాలు చేపట్టాయి. కాని చైనా మాదిరిగా భారీ స్థాయిలో, అత్యంత వేగంగా ఇక్కడ సైనిక కార్యకలాపాలను మరెవ్వరూ చేపట్ట లేదు. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రం నిజానికి చైనా నౌకాదళం అదుపులో ఉన్నట్లు కనిపిస్తుంది.
దక్షిణ చైనా సముద్రం చాలా కీలకమైనది. వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం, సైనికంగా చాలా అవసరమైన ప్రాంతం, వాణిజ్యపరంగా కూడా దక్షిణ చైనా సముద్రంపై అదుపువల్ల చాలా లాభాలున్నాయి. పైగా సహజవనరులకు పెట్టింది పేరు. చాలా దేశాలు దక్షిణ చైనా సముద్రంపై తమకు హక్కుందని వాదిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం 2016లో 3.4 ట్రిలియన్ డాలర్లు అంటే 228 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం ఈ సముద్రం ద్వారా జరిగింది. ప్రపంచ వాణిజ్యంలో ఇది 21 శాతం. దీన్ని బట్టి దక్షిణ చైనా సముద్రం ఎంత ముఖ్యమైందో అర్ధం చేసుకోవచ్చు. చైనా దీన్ని అదుపు చేయాలనుకుంటుంది. తన నియంత్రణలో ఉంచాలనుకుంటోంది. చైనా చాలా తెలివిగా వ్యవహరిస్తూ వచ్చింది. దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేసింది. ఇక్కడ కృత్రిమ దీవులను, సివిల్, మిలిటరీ వసతులు నిర్మించింది. సైన్యాన్ని ఇక్కడ దించింది. యుద్ధనావలు, యుద్ధవిమానాలు ప్రవేశించాయి. చాలా వరకు చైనా నిశ్శబ్దంగా ఈ పనులు చేసేసింది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో చైనాదే పెత్తనంఅనే పరిస్థితి ఏర్పడింది. అమెరికా, ఫిలిప్పిన్స్, ఆస్ట్రేలియా దేశాలు చైనా చర్యలను తీవ్రంగా ఖండించడంలో బిజిగా ఉంటే, చైనా మాత్రం ఇక్కడ నియంత్రణ పటిష్టం చేసుకునే పనుల్లో గడిపింది. అమెరికా నౌకాదళం ఇండో పసిఫిక్ కమాండ్ ఆడ్మిరల్ ఫిలిప్ డేవడ్సన్ చెప్పిన దాని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో అన్నివిధాలుగా చైనా బలంగా ఉంది. చైనా చాలా తెలివిగా పనిచేసింది. దక్షిణ చైనా సముద్రంపై ఒకేసారి సైన్యాన్ని పంపలేదు. సుదీర్ఘకాలంగా ఒక పథకం ప్రకారం పనిచేసింది. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఇక్కడ సైనిక చర్య చేపట్టే స్థితి కూడా లేదు. చైనాతో తలపడితే ఈ యుద్ధంలో ఆర్థిక ప్రాణ నష్టాలు చాలా భారీస్థాయిలో ఉంటాయి. చైనాతో తలపడడం మంచిది కాదు. దక్షిణ చైనా సముద్రంలో చైనాను కట్టడి చేయలేకపోవడం అమెరికా ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త మాటలు చెప్పడం మొదలెట్టింది. ఆసియాలో తిష్ఠవేయాలన్న ఆలోచనేదీ తమకు లేదని ప్రచారం ప్రారంభించింది. చైనాకు ఉత్తుత్తి బెదిరింపులు తప్ప ఆచరణలో చైనాను నిరోధించడానికి ఏమీ చేయలేకపోతోంది. అసలు ఏ విషయాన్ని అమెరికాగట్టిగా చెప్పలేకపోతుందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. దక్షిణ చైనా సముద్రంలో రెడ్ లైన్స్ ఏమిటి? ఎవరు ఏ నియమాలు, నిబంధనలు పాటించాలి? ఏ పరిధుల్లో ఉండాలి? వంటి మాటలేవీ అమెరికా చెప్పలేకపోతోంది. ఒకవేళ అమెరికా అలాంటి రెడ్ లైన్స్ ప్రకటించినా దక్షిణ చైనా సముద్రంలో వాటిని అమలు పరిచే బలం దానికి లేదు. ఈ ప్రాంతంలో మిత్రదేశాలేవో కూడా అమెరికా తేల్చుకోలేకపోతుందా అనిపిస్తోంది. పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిలిటరీని దించవలసిన అవసరం కూడా రావచ్చునేమో. క్షిపణి వ్యవస్థలను ఇతర రక్షణ ఏర్పాట్లను అమెరికా చేసుకోగలిగితే అప్పుడు చైనాతో సమ స్థాయి లో మాట్లాడే స్థితికి వస్తుంది. కాని ఈ చర్య వల్ల దక్షిణ చైనా సముద్రంలో అటు అమెరికా ఆయుధాలు, ఇటు చైనా ఆయుధాలతో ఇదంతా ఒక సైనిక క్షేత్రంగా మారిపోతుంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా నియంత్రణ, పెత్తనాలు పెరిగితే ప్రాంతీయంగా అనేక దేశాలకు చాలా ఇబ్బందులు తప్పవు. ఇక్కడ చాలా దేశాలకు అంతర్జాతీయ వాణిజ్యం దక్షిణ చైనా సముద్రం నుంచి వెళ్ళే జలమార్గాల నుంచే సాగుతుంది. ఈ వాణిజ్యమే ఈ దేశాలకు ప్రాణవాయువు వంటిది. అలాంటి దక్షిణ చైనా సముద్రంలో చైనా పెత్తనం మొదలైతే ఇక చైనా ఈ ప్రాంతంలోని దేశాలకు పెద్దన్నగా మారుతుంది. వివిధ దేశాలతో చైనాకు సరిహద్దు సమస్యలవంటివి ఉన్నాయి. ఆ సమస్యలన్నింటి పరిష్కారానికి చైనా ఈ ఆయుధాన్నే ఉపయోగిస్తుంది. దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం లభిస్తే ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ దేశాలు, ఓసియానియా ప్రాంతంలో ప్రాబల్యం పెరుగుతుంది. అప్పుడు అమెరికా, దాని మిత్రదేశాలు చైనాపై ఎలాంటి చర్య తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వస్తుంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా అంతర్జాతీయ అభ్యంతరాలను ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. మూర్ఖంగా మొండిగా వ్యవహరిస్తోంది. తన ప్రయోజనాలకు, తన ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్న అంతర్జాతీయ సూత్రాలను, చట్టాలను కూడా తుంగలో తొక్కుతోంది. ఇప్పుడు ఆసియాలో చైనా ఒక పెద్ద శక్తిగా మారింది. దీనివల్ల అమెరికా, పాశ్చాత్యదేశాల బలానికి కౌంటర్ అయ్యింది. ఈ ప్రాంతంలో అనేక మందికి చైనా వల్ల లాభం కలిగింది, కాని సరిహద్దు వివాదాల విషయంలో చైనా చాలా కఠినంగాను, మొండిగాను వ్యవహరిస్తుందన్నది పచ్చినిజం. సైనికచర్యలకు, దౌర్జన్యాలకు వెనుదీయని దేశం. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా బలవంతంగా తనమాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. తన బలాన్ని ఉపయోగించి, ప్రదర్శించి భయపెట్టి పెత్తనం చలాయిస్తోంది. ఇప్పుడు చైనాను నిలవరించడం కష్టమేమో కాని అసాధ్యమేమీ కాదు. దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దం కాబట్టి శిక్షగా ఆర్థిక ఆంక్షలు విధించవచ్చు. కాని చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించే స్థితిలో అమెరికా ఉన్నట్లు కనిపించడం లేదు. చైనాపైనే కాదు, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత కూడా ఇరాన్‌తో ఒప్పందాన్ని కొనసాగిస్తున్న పాశ్చాత్య దేశాలు, రష్యాలపై కూడా అమెరికా ఎలాంటి చర్య తీసుకునే స్థితిలో లేదు. సోవియట్ పతనం తర్వాత కొంతకాలం ఏకధ్రువ ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా ఒక వెలుగు వెలిగిన అమెరికా ప్రతిష్ఠ ఇప్పుడు కొడిగట్టే దశకు చేరిందా?

* కరుణ కుమార