Home ఎడిటోరియల్ అశోక చక్రవర్తికి కొత్త దుస్తులిచ్చిన బిజెపి

అశోక చక్రవర్తికి కొత్త దుస్తులిచ్చిన బిజెపి

Ashoka-chakravarthiబీహార్ ఓటర్లు క్రోధావేశాలతో కూడిన ఎన్నికల ప్రచారాన్ని చూసిన తదుపరి, భారతీయ జనతాపార్టీ కూటమికి వ్యతిరేకంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. విభజన రాజకీయాలను విడనాడి, సామాజికంగా, ఆర్థికంగా సమ్మిళిత భావంతో, చిత్తశుద్ధితో కూడిన చర్చ అఖిలభారత స్థాయిలో చేపట్టటానికి అత్యున్నత రాజకీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తాను. ఇక్కడ బిజెపికి ఒక చరిత్ర పాఠంకూడా ఉందని ఆశిస్తాను. అది చేసిన అనేక తప్పుల్లో బీహార్ చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవడం కూడా ఒకటి. చరిత్రను తప్పుగా చిత్రించడం తమ ఎన్నికల గణితాన్ని సరిచేయలేకపోయిందని వారిప్పుడు పశ్చాత్తాపంతో గుర్తించవచ్చు.
పోస్టర్ చిత్రం
అశోక చక్రవర్తి జీవితంలో గొప్పగా కీర్తించా ల్సింది అన్నిటికన్నా ఆయన కులం అని బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా గుర్తించిన బిజెపి, దాన్ని ప్రచారంలో పెట్టటానికి శక్తివంచనలేకుండా పనిచేసింది. మే నెలలో పట్నా అంతటా పోస్టర్లు అంటించారు. ఉదాహరణకు, మీసాలతో కూడిన, కండలు తిరిగిన బలశాలిగా కనిపించే అశోకుని చిత్రంతో, బిజెపి నాయకుడు సుశీల్‌కుమార్ మోడీతో పాటు అనేకమంది కుష్‌వాహ్ కుల నాయకుల ఫోటో లను పోస్టర్‌పై ముద్రించారు. దానిలోని రాజకీయ సందేశం నగ్నంగా కనిపిస్తుంది. అశోక చక్రవర్తిని కుష్ వాహ్‌గా చిత్రించటం, బీహార్‌లోని కుష్‌వాహ్ కులస్థుల ఓట్లను ఆకర్షించే బిజెపి వ్యూహంలో భాగం.
అశోకుని జీవితం గూర్చి పరిజ్ఞానం ఉన్నవారికి, ఆయన స్వయంగా ప్రజలముందుంచిన ప్రతిమకు, ఈ పోస్టర్ చిత్రానికి పొంతనలేదని స్పష్టంగా తెలుస్తుంది. అశోకుని జీవితకాలపు సమకాలీన దాఖలాలేవీ ఆయన కులాన్ని ప్రస్తావించలేదు. వాస్తవానికి, అశోకుని జీవితకాలం గూర్చి మనకు తెలిపేవి భారతదేశంలో అనేకచోట్ల, విదేశాల్లో ఆయన స్వయంగా చెక్కించి ప్రతిష్టించిన శిలాశాస నాలే. వాటిలో ఆయన తన గూర్చి తన ప్రజలకు చెప్పారు. అశోకుని రాజశాసనాల్లో నిష్కాపట్యం, భావోద్వేగం, మరణం, సైనికుల వధ, నిజాయితీతో అపరాధాల అంగీకారాలు, ఆవశ్యకమైన అధికార ఉత్తర్వులు పుష్కలంగా కనిపిస్తాయి. అశోకుడు తన ప్రజలకు తన కులంగూర్చి చెప్పలేదు. బౌద్ధమతం లోకి మారినాక తను తన జీవితాన్ని ఎలా మలుచు కున్నాడో చెప్పాడు. ఎన్నికల సమయంలో పట్నాలో పోస్టర్లు కల్పిత చరిత్ర మాత్రమేగాక, అశోకుని చిత్రం చుట్టూ వాతావరణ దృశ్యాన్ని తప్పుగా చూపా రు. అశోకుడు మీసాలు కలిగిన దుందుడుకు స్వభావికాదు. ప్రాచీన శిల్పాల్లో స్త్రీలతో కనిపించే ఆయన రూపం సౌమ్యుడిగా లేదా విచారవదనంతో ఉంటుంది.
అశోకునిలో ఎన్నో మంచి గుణాలుండగా వాట న్నిటినీ విడిచిపెట్టి ఆయన కులగుర్తింపునే ఎన్నికల ముందు పైకితేవటం ఆ సమయంలో విచిత్రంగా తోచింది, బాధ కలిగించింది. ఉపకార బుద్ధిగల పరి పాలన గూర్చి తన విశిష్ట వాణి ద్వారా అశోకుడు తన ప్రజలకు చెప్పిన అనేక సందేశాలను బిజెపి ఎందుకు తీసుకోలేదు? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.
సహనానికి విజ్ఞప్తి
మత సహనాన్ని ఆచరించాలని ఉద్బోధించిన ఆయన శాసనాలను చూసి తన చరిత్ర అవగాహనను బిజెపి సరిచేసుకోవచ్చు. తన రాజ్యంలో ప్రతిచోట అన్ని మత తెగలు నివసించాలని చక్రవర్తి ఆకాం క్షించినట్లు ఏడవ శిలాశాసనం చెబుతున్నది. అన్ని మత, తాత్విక తెగలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ తన ప్రాచీన లౌకిక భావనను తన 12వ శిలాశాసనం లో ఆయన మళ్లీ ఉగ్గడించారు. ప్రతిఒక్క తెగ ప్రతి ఒక్క ఇతర తెగను గౌరవించే ప్రజా సంస్కృతి ఉండా లన్నది (ఒకరు మరొకరి ధర్మం గూర్చి తెలుసు కోవాలి, గౌరవించాలి) అందులోని ప్రధానాంశం.
దీన్ని ఆచరించటం ఎలా?
“మాట్లాడటంలో సంయమనం (అనగా) అనవ సర సందర్భాల్లో ఒకరు తన సొంత తెగ గూర్చి గొప్ప లు చెప్పుకోరాదు, ఇతర తెగలను చులకన చేయ రాదు. అనువైన సందర్భాల్లో సైతం అది నమ్రతగా ఉండాలి. అన్నివిధాలా (అన్ని సందర్భాల్లో) ఇతర తెగలను తగువిధంగా గౌరవించాలి.
“ఆ విధంగా (వ్యక్తి) వ్యవహరించినట్లయితే అది (అతను) తన సొంత తెగను పెంపొందించు కోవటమేగాక ఇతర తెగలకు కూడా మేలు చేస్తుంది.
“కేవలం తన అనుబంధం (తెగతో) కారణంగా ఎవరైనా తన సొంత తెగను మహిమాన్వితం చేసే దృష్టితో తన తెగను పొగడుతూ, ఇతర తెగలను తెగి డితే, ఆ విధంగా వ్యవహరిస్తే అది నిజంగా తన సొంత తెగకు చాలా తీవ్రమైన హాని చేస్తుంది.
“అందువల్ల సర్వమైత్రి ప్రశంసనీయం”.
గుజరాత్‌లోని గిర్నార్ సమీపంలో (భారతదేశం లో ఇతర చోట్ల, పాకిస్థాన్‌లో) ఈ ప్రవచనాలు చెక్క బడి ఉన్నాయి. ప్రధానమంత్రి గుజరాత్‌కు చెందిన వాడై నందున, ఆయనకు ఇందులో పాఠం ఉంది. సహనం అనేది ఇతరులను మర్యాదగా అగౌరవపరిచే అకర్మక విశేషలక్షణం కాదు; పరస్పరం మేలు చేసే దిగా గుర్తించబడిన సర్వమైత్రికి సానుకూల ప్రయత్నం.
ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రచారాన్ని చూశాక, విభజన వాద రాజకీయ సందేశంలో అశోకుని ప్రాచీ న సెక్యులర్ ముద్రను ఎందుకు విస్మరించారో అర్థం చేసుకోవటం కష్టం కాదు. బహుశా ఈ రాజకీయ నాయకులు కుల, మత గణాంకాలతోనే ఎన్నికలు గెలవవచ్చని విశ్వసించారు. ప్రాచీన కాలానికి చెందిన అశోకచక్రవర్తి – బీహార్‌లో పుట్టి, పెరిగి నందున – ఆయన వాస్తవంగా ప్రచారం చేసినదాన్ని అవగాహన చేసుకోవటం కన్నా ఆయన కుల గుర్తింపు గూర్చిన కట్టుకథ మరింత ప్రయోజనకర మని భావించి దాన్ని బయటకు తీశారు. అశోకునికి, స్వప్రయోజనపరులైన అవకాశవాద రాజకీయ నాయకులకు మధ్య భిన్నత్వం కొట్టొచ్చినట్లు కనిపి స్తుంది. అందరితో ఒకే గొంతుతో మాట్లాడేటటు వంటి, నైతిక విశ్వసనీయత కలిగినటువంటి ఆ చక్ర వర్తి చారిత్రక ముద్రను ఓట్లు సంపాదించి పెట్ట గలిగిన ప్రతీకగా వారు భావించలేదు. అందుకు బదు లుగా ఆయన్ను కుల, గుర్తింపు రాజకీయాల్లోకి లాగారు.
ఈ ఎన్నికలనుంచి ఒకపాఠం తప్పనిసరిగా ఇలా వుంటుందిః చరిత్రను వక్రీకరించటం రాజ కీయ నాయకులకు ఎంత సంతృప్తినిచ్చినా, అది రాజకీయ పంట పండించే అవకాశం లేదు.
రచయిత ః ఢిల్లీ యూనివర్శిటీలో చరిత్ర శాఖలో ప్రొఫెసర్. అశోక ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథ రచయిత.
(ది హిందూ సౌజన్యంతో)