Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మృత దేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ బోల్తాః డ్రైవర్ మృతి

accident2మంచిర్యాలః భద్రాచలంలోని అటవీ ప్రాంతంలో ఆకుల కల్లెంలో కూలీ పనులకు వలస వచ్చిన కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. నెల రోజుల నుండి అక్కడే అటవీ ప్రాంతంలో పని చేస్తున్నారు. మంగళవారం అ వలుస కూలీ బృందంలోని బండారి (50) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తోటి కూలీలు బండారి మృత దేహంను భద్రాచలం నుండి ఓ అంబులెన్స్‌లో తీసుకుని మంచిర్యాల మీదుగా మహారాష్ట్ర బండార జిల్లాలోని మాచడ్ గ్రామానికి వెళ్తున్నారు. మృత దేహంతో పాటు అంబులెన్స్ డ్రైవర్, రిలీవర్ డ్రైవర్‌తోపాటు మొత్తం 8 మంది అంబులెన్స్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో భద్రాచలం నుండి బయలు దేరిన అంబులెన్స్ మండలంలోని హాజీపూర్ వద్దకు చేరుకుంది. హాజీపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా అంబులెన్స్ వాహనం ఒక్క సారిగా వాహనం అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ పాషా అక్కడికక్కడే మృతి చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారందరిని 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయాలపాలైన వారి వివరాలు
అంబులెన్స్ బోల్తాపడిన ఘటనలో వాహనంలో ఉన్న మృత దేహం బండారితోపాటు అంబులెన్స్ డ్రైవర్ పాషా(భద్రచలం) సంఘటన స్థలంలో మృతి చెందాడు. గాయపడిన వారిలో అమ్మెల్ సొంటెంకి(మాచడ్, మహారాష్ట్ర), అంబులెన్స్ రిలీవర్ డ్రైవర్ ఆరోగ్య రెడ్డి ( భద్రాచలం), గజానంద్ (మాచడ్), గంభీర్( మాచడ్), వినోద్ మలాడీ(మాచడ్) లు ఉన్నారు. కాగా స్వల్ప గాయాలతో విష్ణు, సొంటెంకి, హన్స రాజు ఉన్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ
హాజీపూర్‌లో అంబులెన్స్ బోల్తాపడిన సంఘట స్థలాన్ని హాజీపూర్ ఎస్‌ఐ కటికె రవిప్రసాద్ పరిశీలించారు. గాయాలపాలైన వారిని అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లోని మృత దేహంతో పాటు అక్కడికక్కడే మృతి చెందిన అంబులెన్స్ డ్రైవర్ పాషా మృత దేహాలను ఎస్‌ఐ స్వయంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. మృతుడికుటుంబంతో పాటు గాయాలపాలైన కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి ప్రసాద్ తెలిపారు.

Comments

comments