Home లైఫ్ స్టైల్ ఒత్తిడితో డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు

ఒత్తిడితో డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు

lf

ఎవ్వరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఊహించరు. కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి, సాటి మనిషిగా మానవత్వం, సహృదయంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేయడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం. ఎల్లప్పుడూ ఫోన్‌లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లను ఫీడ్ చేసుకొని ఉంచుకోండి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. ప్రజల ప్రాణాలు బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఎదుట వచ్చే వారి ప్రాణాలకు హామీ నిద్దాం. అత్యవసర సమయాలలో సొంత డ్రైవింగ్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
ఒత్తిడితో డ్రైవింగ్, క్షణాల్లో గమ్యాన్ని చేరాలనే మితిమీరిన వేగం వ్యక్తుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ అమలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబ సభ్యులను ఆదుకున్నప్పటికీ మరణించిన వారి లోటును పూడ్చలేనిది. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల వయస్సు లోపు వారే. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు ప్రకటనలు జారీ చేసినా… పత్రికలలో పతాక శీర్షికలలో వార్తలు రాసినా… పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా… ఎన్ని జరిమానాలు విధించినా యువకుల వేడిరక్తం ముందు అవి ఏవీ పనిచేయడం లేదేమో. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ప్రయాణం చేసే సమయంలో వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పూర్తి స్థాయిలో పాటించాలి. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అని గుర్తించాలి.
కొడుకు కోరిందే తడవుగా అప్పు చేసైనా సరే డబ్బులు ఖర్చుపెట్టి మరీ వాహనాన్ని పిల్లవాడి చేతిలో పెడుతున్నారు. కుమారుడికి వాహనం ఎలా నడపాలి అనే మంచి విషయాలు చెప్పే సమయం తీరిక తల్లిదండ్రులకు లేదు. కొడుకు అడిగింది తెచ్చి ఇచ్చేస్తే తమ పనైపోయిందనే భావించే తల్లిదండ్రులు ఇంకొందరు. ఎంత సంపాదించి ఏం లాభం చేతికంది వచ్చి న తను కన్న కొడుకు లేడని భోరున విలపిస్తున్న తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపేదెవరూ… తల్లిదండ్రులనూ అనాథలుగా మిగుల్చుతున్న యువత. కొందరు మద్యం తాగి డ్రైవ్ చేసి మరణిస్తే… మరికొందరు మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోయారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ మరణిస్తున్న వారూ ఇంకొందరు. తల్లిదండ్రులకు, సన్నిహితులకు శోకాన్ని మిగులుస్తున్నారు.
రోడ్లపై తిరుగుతున్న కొత్త కొత్త వాహనాలతో పాటుగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. రోడ్డుపై వెళ్లే వారి నిర్లక్ష్యం కారణంగా కూడా అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లుగా సర్వే రిపోర్టులు తెలుపుతున్నాయి. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి విలవిల రక్తం మడుగులో కొట్టుకుంటే, వారిని తక్షణమే సమీపం ఆస్పత్రిలో చేర్పించాలని గాని, వారికి సాయం చేయడానికి రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమకెందుకులే అనే నిర్లక్ష్యం చూపుతుండటంతో మరణాల సంఖ్య అధికమవుతోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చూసి అయ్యో పాపం అనేవారే తప్ప వారికి సాయం చేద్దామనుకునే వాళ్లు తక్కువైపోతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు వదిలేస్తున్నారు.
మరేం చేయాలి : వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గించడానికి ప్రధానంగా ఆర్‌టిసిని బలోపేతం చేయాలి. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే రవాణా వాహనాలను అనుమతించాలి. రోడ్ల సామర్థ్యానికి తగ్గట్టుగానే వాహనాలను నడిపేలా చూడాలి. హైవేలపై వేగ నియంత్రణకు గన్ షూటర్స్‌ని ఏర్పాటుచేయాలి. యూటర్న్‌లు, లింక్ రోడ్స్ వద్ద సిగ్నల్ బోర్డులు, ఇండికేటర్లు ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు ఒత్తిడి తగ్గించడానికి నిర్ణీత పని గంటల మాత్రమే వుండాలి. రోజుల తరబడి ప్రయాణం చేసే లారీ డ్రైవర్స్ వి శ్రాంతి తీసుకొనే విధంగా అదనపు డ్రైవర్ ఉండేలా చర్యలు ఉండాలి.
పాదచారులు పాటించాల్సిన నియమాలు : రోడ్డు దాటేప్పుడు ముందు కుడివైపు తర్వాత ఎడమవైపు మళ్ళీ కుడివైపు చూసి దాటాలి. జీబ్రా గుర్తు ఉన్నచోట మాత్రమే రోడ్డు దాటాలి. ఎప్పుడూ ఫుట్ పాత్ మీదనే నడవాలి. ఆగి వున్న వాహనాల వెనుక నుండి ఎప్పుడూ పరిగెత్తి వెళ్ళొద్దు. కనపడని రోడ్డు మలుపులు దగ్గర దాటేప్పుడు ఎక్కువ జాగ్రత్తగా వుండాలి.
వాహన చోదకులు పాటించాల్సిన నియమాలు : ఒత్తిడితో ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకూడదు. మానసిక ప్రశాంతతో డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపరాదు. టూ వీలర్స్ నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడుపరాదు. నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేయరాదు. అధిక శబ్దంతో పాటలు వింటూ డ్రైవింగ్ చేయకూడదు. టూ వీలర్స్ పై ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణిస్తే ప్రమాదం.