Home ఖమ్మం కమ్ముకుంటున్న కరువు మేఘాలు

కమ్ముకుంటున్న కరువు మేఘాలు

ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైనా ఫర్వాలేదనిపించాయి.. కాస్తా అటు, ఇటుగా సాగు ముందుకు సాగింది. రెండు నెలల పాటు కళకళలాడిన పంటలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతాంగం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఫర్వాలేదనిపించిన పత్తి తేలిపోతోంది. ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. క్రమేపీ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Cottonమన తెలంగాణ /ఖమ్మం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి.  చెరువులు, కుంటలు ఇంకిపోవడంతో వాటి కింద సాగు చేసిన పంటలు ఎం డిపోతున్నాయి. ఒకసారి సాగర్ ఆయకట్టు పరిధిలో చెరువులు, కుంటలు ఒకసారి నింపితే కొన్ని మండలాల్లో వరి పంట చేతికి వచ్చేది. సాగునీటి విడుదలలో సాగతీత రైతులకు శాపంగా మారుతోంది. వరి  పొట్ట దశలో ఉంది. కనీసం ఒక తడి వచ్చినా 50 శాతం దిగుబడి వస్తుందని లేకపోతే బస్తా దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కొన్ని చెరువులు, కుంటల కింద వరి పొలాల్లో పశువులను మేపుతున్నారు. జులై, ఆగస్టు మాసాల్లో కురిసిన వర్షాలకు జిల్లా రైతాంగం ఈ ఏడాది సాగుపై ఆశలు  పెంచుకుంది. ముఖ్యంగా పత్తి పంటపై ఆశలు పెంచు కున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సరైన రీతిలో పూత, కాత రాలేదు. గత సంవత్సరం జిల్లాలో సగటు దిగుబడి ఎనిమిది క్వింటాళ్లు కాగా, ఈ సంవత్సరం సగలు దిగుబడి రెండు, మూడు క్వింటాళ్లకు మించే పరిస్థితి లేదు. పత్తి ధర కూడా రైతాంగాన్ని కుంగ దీసింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే పెట్టుబడిని పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధర నిర్ణయించాలని, పత్తితీత కూలీ, రవాణా ఖర్చులు పోతే ఏమాత్రం మిగలడం లేదని రైతులు అంటున్నారు. గతంలో జనవరి చివరి వరకు దిగుబడిని ఇచ్చే భూములు ఈ సంవత్సరం ఇప్పటికే పచ్చదనాన్ని కోల్పోయి మోడ్లుగా మారాయి. మిర్చి సాగు రైతుకు చుక్కలు చూపుతోంది. విపరీతమైన ఎండలకు రెండు, మూడు దఫాలు నాటినా మొక్కలు బతకడం లేదని రైతులు వాపోతున్నారు. వీటికి తోడు కరెంటు కష్టాలు రైతుకు శాపంగా మారాయి. విద్యుత్ వాడకం పెరగడంతో లో ఓల్టేజీ సమస్య తీవ్రతరం అయింది. దీంతో మోటార్లు, ట్రాన్సుఫార్మర్లు కాలిపోతున్నాయి. విద్యుత్ ప్రసారంలో అంతరాయం కారణంగా తడులు తిరగడం లేదు. జిల్లాలో మిగిలిన పంటల పరిస్థితి సానుకూలంగా లేదు. వర్షాపాతం ఆధారంగా కరువుపై అధికా రులు కాకిలెక్కలు చూపుతున్నా వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో భూగర్బ జలమట్టం రోజు రోజుకు పడిపోతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోనీటి కరువు వచ్చింది. వాగులు, వంకలు ఎండిపోవడంతో పశువులు నీటి కోసం వెతుకులాట ప్రారంభించాయి. మొత్తం మీద జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టాలి. లేకపోతే కునారిల్లుతున్న రైతాంగం కోలుకునే పరిస్థితి లేదు.