Home ఆఫ్ బీట్ స్వీయ తప్పిదాలతోనే విద్యుత్ ప్రమాదాలు

స్వీయ తప్పిదాలతోనే విద్యుత్ ప్రమాదాలు

డ్రై ట్రాన్స్‌ఫార్మర్లతోనే
నివారణ సాధ్యం
వాటిపై అవగాహన లేని వినియోగదారులు
పట్టించుకోని అధికారులు

Power-Station

మన తెలంగాణ/సిటీబ్యూరో : విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో విద్యుత్ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ ప్రమాదాలు తగ్గించేందుకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికి వాటిని వినియోగించడం లేదు. అయితే అధునిక పరికరాల పట్ల విద్యుత్ వినియోగదారులకు అవగాహన లేక పోవడం, అధికారులు వాటిని అమర్చేవిధంగా చర్యలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణం అవుతోంది. నాణ్యతలేని పరికరాలు వాడటం, కేబుల్స్‌లో నాణ్యత పాటించకపోవడంతో పాటు బోర్డు ప్యానెల్ విధానం సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్యానల్ ఎక్కడో మూలకు చీకట్లో కాకుండా విశాలమైన ప్రదేశంలో గాలి, వెలుతురు, సమృద్ధిగా ఉండే చోట బిగించాలి. కానీ అలా కాకుండా స్థలం లేకపోవడంతో ఎక్కడో అండర్ గ్రౌండ్‌లో ప్యానల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాటికి సరైన గాలి, వెలుతురు తగలకపోవడంతో కేబుల్స్ వేడెక్కుతూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

మరి కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలకు ప్యానల్ ఉన్న ప్రాంతంలో నీరు చేరడం వంటి కారణాల వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లో ఒక హోటల్ వద్ద జరిగిన ప్రమదానికి ఇదే కారణమని అధికారులు అంటున్నారు. ఇటీవల జీడిమెట్ల, పటాన్ చెరు ప్రాంతాల్లో పరిశ్రమల్లో వరుస ప్రమాదాలతో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు భద్రతావారోత్సవాలను నామ మాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడడంతో ఇటుంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తే సగానికి పైగా విద్యుత్ ప్రమాదాలు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్ ప్రమాదాలను నివారించే డ్రై ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేసుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. డ్రై ట్రాన్స్ ఫార్మర్ వల్ల ఎక్కడ చిన్న లోపం వచ్చినా వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ట్రిప్పయి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.

దీంతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. బహుళ అంతస్థులు భవనాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వాణిజ్య వ్యాపార నిర్వాహకులు, అధికారులు వీటి ఏర్పాటులో విఫలం అవుతున్నారు. కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా నగరంలో అనేక హోటల్స్, మాల్స్, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్‌లు వంటి విద్యుత్ ప్రమాద అంచుల్లో ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అక్కడక్కడ డ్రై ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం సమీపంలో సహారా కాంప్లెక్స్, హైటెక్స్ తదితర ప్రాంతాల్లో డ్రై ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాణిజ్య సముదాయాలలతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న బహుళ అంతస్థుల భవనాలు, వ్యాపార వాణిజ్య కాంప్లెక్స్‌లో డ్రై ట్రాన్స్‌ఫార్మర్ల వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే డ్రై ట్రాన్స్‌ఫార్మర్ల వినియోగం పట్ల దృష్టి సారించి తద్వారా విద్యుత్ ప్రమాదాలను అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు.