Home ఆదిలాబాద్ డీలర్ల సమ్మెబాట..

డీలర్ల సమ్మెబాట..

Due to the dilution of the July rice deadline

జూలై బియ్యానికి డీడీల చెల్లింపునకు ముగిసిన గడువు
రేషన్ సరకుల పంపిణీపై ప్రత్యామ్నాయ చర్యలేవి…!

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో: సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు సమ్మెకు దిగడంతో పేద ప్రజలు పస్తులుండే పరిస్థితి నెలకొనే ప్రమాదముందని అంటున్నారు. జూలై నెలకు సంబంధించి ప్రజాపంపిణీ బియ్యానికి డీడీల చెల్లింపునకు గడువు ముగియడంతో వచ్చే నెలలో రేషన్ సరుకులపై ప్రతిష్టంభన నెలకొంది. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి కిలో రూ. 1 చొప్పున ఆరు కిలోల బియ్యం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పట్టకూడదని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అనేక మార్పులు తీసుకొచ్చారు. కాగా కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టారు. న్యాయపరమైన డిమాండ్లు సాధించేందుకు నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చారు. జూలై నెలలో సరకులు పంపిణీ చేసేందుకు డీడీలు చెల్లించేందుకు నిరాకరించారు. బుధవారం డీడీల చెల్లింపు గడువు ముగియడంతో పేదలకు అందే నిత్యావసర సరకుల పంపిణీపై ప్రతిష్టంభన నెలకొంది. వచ్చే నెల వారికి సరకులు చేరుతాయా లేదా అనేది అనుమానంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్ బియ్యం ఇతర సరకులు పంపిణీ చేస్తున్నాయి. సాధారణంగా ప్రతి నెలా 1వ తేది నుంచి 15వ తేది వరకు వినియోగదారులకు డీలర్లు సరకులు పంపిణీ చేస్తున్నారు. పంపిణీ పూర్తయిన వెంటనే డీలర్ల వద్ద మిగిలి ఉన్న సరకుల వివరాలు అదికారులకు అందించాలి. అనంతరం అయిదు రోజుల లోపు అంటే ప్రతి నెలా 20వ తేదిలోపు ప్రభుత్వానికి సరకులకు సంబంధించిన డీడీలు కట్టాలి. నగదు చెల్లించిన డీలర్లకు పౌరసరఫరాల శాఖ వారు 21 నుంచి 30 లోపు గోదాముల నుంచి సరకులు సరఫరా చేస్తారు. ఈ ప్రకారం జూలై నెలకు సంబంధించి బుధవారంలోగా డీడీలు చెల్లించాల్సి ఉండగా సమ్మెలో ఉన్న డీలర్లు స్పందించలేదు. పౌరసరఫరాల శాఖలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. లబ్దిదారుల వేలిముద్రల ఆధారంగా సరకుల పంపిణీ సాగుతోంది. కాగా తమకు వచ్చే కమిషన్ సరిపోకపోవడంతో ప్రతి నెలా గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వంపై కొద్ది నెలలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం స్పందించపోవడంతో సమ్మెకు సిద్దమయ్యారు. ఆహార భద్రత పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.70 చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 చెల్లిస్తుందని డీలర్లు పేర్కొంటున్నారు. వీటీ బకాయిలు మంజూరు చేయాలని గతేడాది నవంబర్‌లో వారు సమ్మె చేయడంతో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నెలలు గడుస్తున్నా డిమాండ్ల సాధనపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గౌరవ వేతనంపై పునరాలోచన చేస్తామని ప్రకటించినా ఆచరణకు నోచుకోవడం లేదు. చెల్లిస్తున్న కమీషన్లకు అద్దె కూడా రావటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె వీడబోమని హెచ్చరిస్తున్నారు. రేషన్ డీలర్ల సమ్మెతో జూలైలో నిత్యావసర సరకుల పంపిణీపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవంగా డీడీలు చెల్లించేందుకు గడువు ముగియడంతో సరకులు పంపిణీ నిలిచిపోయే అవకావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్(మండల స్థాయి బియ్యం నిల్వలు) కేంద్రాలకు లబ్దిదారులకు సంబంధించిన బియ్యం కోటాను తరలించారు. ఇక్కడి నుంచి ఆయా గ్రామాల్లోకి తీసుకేళ్లేందుకు సిద్దంగా ఉంచారు. డీలర్లు డీడీలు కట్టకపోవడంతో సరకుల చేరివేత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో రేషన్ బియ్యంపై ఆధారపడి జీవించే కుటుంబాలు అనేకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1480 రేషన్ షాపులుండగా ఆయా షాపుల నుంచి పేదలకు బియ్యం పంపిణీ కొనసాగిస్తున్నారు.
డిమాండ్లు పరిష్కరించే వరకు చెల్లించం
ప్రభుత్వం అరకొర కమీషన్‌తో కుటుంబాల పోషణ భారమవుతోంది. ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి ఉంది. బకాయిలు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు. డీలర్లకు గౌరవ వేతనం చెల్లించాలి. మా డిమాండ్లను పరిష్కరించే వరకు డీడీలు కట్టం. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సమ్మె చేస్తున్నాం.
నాంపెల్లి వేణుగోపాల్, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు