Home ఖమ్మం జన నివాసాల్లో డంపింగు యార్డు

జన నివాసాల్లో డంపింగు యార్డు

dump-yardపందులు, కోతులు, కుక్కలకు నిలయం
దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
పత్రామ్నా మార్గం కోసం స్థానికుల ఆందోళన
జిల్లా అధికారుకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం

ఖమ్మం: మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక ఖమ్మం నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. కార్పొరేట్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక నగరానికి అతిసమీపంలో ఉన్న అనేక గ్రామాలను విలీనం చేసిన నేపథ్యంలో ఆయా గ్రామాలకు, పలు ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వంతో పాటు నగరపాలకసంస్థ అధికారులు వైఫల్యం చెందారు. ప్రధానంగా డంపింగ్ యార్డు సమీపంలో బిసి కాలనీ, టిఎన్‌జిఒఎస్ కాలనీతో పాటు పలు ఏరియాల్లో సుమారుగా 10వేల మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో దశాబ్దకాలంగా ఈ ప్రాంత ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతూ జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా పరిష్కరించలేదన్నారు.

గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడంతో నగరానికి చెందిన చెత్త, చెదారాన్ని అంతా ఈ ప్రాంతానికి తరలించడంతో సమీప ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. గుట్టలు, గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో వర్షా కాలంలో ఈగలు, దోమలు వ్యాపించి పలు అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన చెత్తకు తోడు ఈ ప్రాంతంలో కుక్కలు, పందులు, కోతులు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చీకటి పడితే చాలు కుక్కలు, పందులతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, కుక్కలు రాత్రి వేళల్లో పాదాచారులను, వాహనదారుల వెంట పడి ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న డంపింగ్‌యార్డును మార్చాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సమస్య పరిష్కరించకపోతే ఆందోళనే: బిసి కాలనీ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉన్న కారణంగా ఈ ప్రాంత వాసులు నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని, తక్షణమే ఈ ప్రాంత వాసులకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని తెలంగాణ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోటు కళావతి, ఇన్సాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ సలాంలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. బిసి కాలనీ, టిఎన్‌జిఒఎస్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారు పరిశీలించారు. ప్రధానంగా ఆయా ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా నగర పాలక సంస్థ అధికారులు నిర్లక్షం చేయడంతోనే సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించని పక్షంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని అన్నారు. వీరి వెంట హుస్సెన్, నర్సింహారావు, బోడ వీరన్న, బోడ రమేష్, పోటు కృష్ణ, అజయ్, విజయలక్ష్మి, మదు, సూరి తదితరులు ఉన్నారు.