Home వార్తలు ప్రయోగాల వేళ

ప్రయోగాల వేళ

నేడు విండీస్‌తో టీమిండియా సన్నాహక మ్యాచ్

నిలకడలేని బ్యాటింగ్ లైనప్.. బలహీన పేస్ బౌలింగ్.. మెరుపులు లేని ఫీల్డింగ్.. ఇది మూడు నెలల క్రితం టీమిండియా పరిస్థితి.

అవకాశం వస్తే పరుగులు వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్న బ్యాట్స్‌మెన్.. బంతితో నిప్పులు చెరిగే పేసర్లు. మైదానంలో సింహాల్లా కదిలే ఫీల్డర్లు..  ప్రస్తుత టీమిండియా పరిస్థితిది. 

ఈ మూడు నెలల కాలంలో తమ లోపాలను సరిదిద్దుకుని జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా పొట్టికప్పు ప్రారంభానికి ముందు సన్నాహక సమరానికి సిద్ధమైంది. జట్టులో లోపాలేమీ లేని ధోనీసేన ఇన్నాళ్లు రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లను సన్నాహకంలో పరీక్షించాలని చూస్తోంది. 

windies-and-indiaకోల్‌కతా : ఆస్ట్రేలియాగడ్డపై సిరీస్ క్లీన్‌స్వీప్.. సొంతగడ్డపై శ్రీలంకతో 2-1తో సిరీస్ గెలుపు.. ఆఖరిగా ఆసియాకప్‌లో ఆరోసారి ఛాంపియన్. ఈ ఏడాది ధోనీసేన సాధించిన విజయాలివి. అత్యంత నిలకడగా రాణిస్తు వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా నేడు టీ-20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్రపంచకప్‌లో పాల్గొనే తుది జట్టుపై అంచనాకు వచ్చిన జట్టు మేనేజ్‌మెంట్ గత సిరీస్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
షమి అవకాశం : ఏడాది క్రితం మోకాలి గాయంతో టీమిండియాకు దూరమైన ఏస్ పేసర్ మహమ్మద్ షమిని విండీస్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌లో పరీక్షించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో షమి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా మళ్లీ గాయం తిరగబెట్టడంతో మూడు నెలల పాటు మైదానానికి దూరమైన షమి బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు గంటపాటు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేస్తు కనిపించాడు. అతను యువ పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో కలిసి బంతి పంచుకోనున్నాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ రోహిత్‌శర్మ స్థానంలో రహానెకు అవకాశం దక్కనుంది. విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకో వడంతో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఆడిన రహానె అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయడు. ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాల స్థానంలో హర్భజన్, పవన్‌నేగి తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఉపయుక్తకరమైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు దక్కించుకున్న పవన్‌నేగి ఆసియాకప్‌లో యుఎఇతో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆకట్టుకున్నా.. టీ-20 ప్రపంచకప్‌నకు ముందు అతన్ని వార్మప్ మ్యాచ్‌ల్లో పరీక్షించే అవకాశం ఉంది.
కుదురుకోవాలని.. : గత నెల వరకు కూడా ప్రపంచకప్‌లో పాల్గొంటుందా లేదా అనే సందేహాలు రేకెత్తించిన వెస్టిండీస్ ప్రధాన టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్‌ల ద్వారా తుది జట్టుపై ఓ అంచనాకు రావాలని చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీ-20 లీగ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన విండీస్ ఆటగాళ్లకి కావాల్సినంత ప్రాక్టీస్ దొరికినా జట్టుగా ఆడింది మాత్రం చాలారోజులే అయింది. గతేడాది శ్రీలంకతో చివరిగా టీ-20 సిరీస్ ఆడిన వెస్టిండీస్ ఈ నెల ప్రారంభంలో యుఎఇలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు వర్విక్‌షైర్‌తో టీ-20 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది.