Home దునియా పోరాడి గెలుస్తున్న పొట్టివారు

పోరాడి గెలుస్తున్న పొట్టివారు

Dwarfs

దేశంలో పొట్టివారు సైతం తమ హక్కులకోసం, తమ సంక్షేమంకోసం పోరాడుతున్నారు. తమ లక్ష్యసాధనకు శరీర ఆకృతి అడ్డుకాదని నిరూపిస్తున్నారు. ఇది అసోంలో సంగతి. సుమారు 70 మంది మరుగుజ్జులు చేతులు కలిపి, తమకంటూ సొంతంగా ఇళ్ళు కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక అడుగు నుంచి మూడడుగుల ఎత్తువరకు ఉన్న ఈ మరుగుజ్జులు తమకు వీలైన ఎత్తు వెడల్పులతో తమకు కావాల్సిన సౌకర్యాలతో ఇళ్ళను నిర్మించుకుంటున్నారు. వీరంతా ఒక్కతాటిమీదకు రావడానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డి) అధ్యాపకుడు పవిత్ర రాభా చేయూతను అందించారు. అసోంలోని ఉదల్‌గురి జిల్లాలో ఉన్న జలా గ్రామంలో వీళ్ళంతా ఇళ్ళు కట్టుకుంటున్నారు.

అందరిలాగా వీళ్ళకు పెద్ద ఇళ్ళు పనికిరావు. అలా అని మరీ ఎత్తు తక్కువ ఇళ్ళు కూడా ఉపయోగపడవు. వీళ్ళ ఇళ్ళ డిజైన్ కూడా మామూలు ఇళ్ళకు భిన్నంగా ఉంటుంది. నాలుగు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ళు ఏడాది పూర్తి కావచ్చు. ఈ ఇళ్ళు ఉన్న ప్రాంతానికి అమార్‌గావ్ అంటే మా గ్రామం అని పేరు పెట్టారు. పొట్టి వాళ్ళకు ఇళ్ళను నిర్మించడానికి రాష్ర్ట ప్రభుత్వం ఈ స్థలాన్ని మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేసింది. “వాళ్ళ శారీరక పరిస్థితి కారణంగా వాళ్ళు అందరిలాగా పెద్ద ఇళ్ళలో నివసించడం సాధ్యం కాదు. వాళ్ళ ఆకృతికి తగ్గట్టుగా ఇళ్ళు నిర్మిస్తే దాని ప్రభావం వారి మానసిక స్థితి మీద పడుతుంది” అని పవిత్ర చెప్పారు.

జీనత్ బీ రికార్డు
భోపాల్‌కు చెందిన జీనత్‌బి అనే మరుగుజ్జు 113 ఏళ్ళ జీవితంతో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కింది. 94 ఏళ్లతో ఇంతవరకు గిన్నెస్ రికార్డుల్లో ఉన్న అమెరికా మరుగుజ్జు లోవెల్ డిఫారెస్ట్ మేసన్ ఇప్పుడు రెండవ స్థానానికి దిగిపోయాడు. మూడడుగుల పొడవున్న జీనత్ బీకి మరికొంతకాలం బతకాలని ఉంది. ఆమెకు బాలీవుడ్‌లో హీరో సల్మాన్‌ఖాన్ అంటే చాలా ఇష్టం. ఒకసారైనా అతనితో ఫోటో తీయించుకోవాలని ఆమె కోరిక. అలాగే మక్కా వెళ్లాలన్నది మరో కోరిక. ఈ రెండు కోరికలూ తీరకుండా చనిపోకూడదని ఆమె రోజూ దేవుడిని వేడుకుంటుంటుంది.

పొట్టి సూపర్‌స్టార్
కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ ఓ పొట్టి సూపర్‌స్టార్. ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాల్లో నటిస్తుంటాడు. అతను నటించిన ‘అద్భుత ద్వీపు’ అనే మలయాళ చిత్రాన్ని తమిళంలోకి కూడా అనువదించారు. కేరళలోనే కాక, మలయాళీలు ఎక్కువగా ఉన్న గల్ఫ్ దేశాల్లో కూడా ఈ సినిమా చూడని మలయాళీలు లేరు. ఈ చిత్రం అనేక అవార్డులను చేజిక్కించుకుంది. అతను ఈ చిత్రంలో స్టంట్‌లు కూడా చేస్తాడు. ప్రస్తుతం 30 ఏళ్ళ వయస్సు ఉన్న అజయ్ కుమార్ ఎత్తు రెండడుగల అయిదంగుళాలు. 28 కిలోల బరువు ఉంటాడు. అతను నటించిన 18 మలయాళ చిత్రాలూ సూపర్ హిట్ చిత్రాలే. నాలుగు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ప్రస్తుతం అతనికి హాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. అజయ్ కుమార్ ఓ మామూలు అమ్మాయినే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ దంపతులకు పొడుగాటి కుమార్తె పుట్టింది.

జీవితంలో పైకి వచ్చిన కుమార్ తన తోటివారిని మరిచిపోలేదు. రాష్ట్రంలోని ఓ 300 మంది పొట్టివారిని సమీకరించి, కేరళ మరుగుజ్జుల సంఘం స్థాపించాడు. వాళ్లందరికీ చదువు చెప్పిస్తుంటాడు. ఉపాధుల్లో శిక్షణ ఇప్పిస్తుంటాడు. అతను తను ఓ హీరోననో, స్టార్‌ననో చెప్పుకోడు కానీ, అతన్ని అందరూ మాత్రం పొట్టి సూపర్‌స్టార్ అని పిలుస్తుంటారు. అతను నటించిన మరో చిత్రం ‘మై బిగ్ ఫాదర్’ ఆ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఆడిందో, ఎన్ని అవార్డులు దక్కించుకుందో లెక్కే లేదు. అందులో అతను జయరామ్‌కి తండ్రిగా నటించాడు. ఆ చిత్రంలో అతను పండించిన హావభావాలను నిజంగా పెద్ద నటులు కూడా పండించలేరంటూ సమీక్షలు వచ్చాయి. అతనికి అందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడి అవార్డు కూడా లభించింది.

బాలీవుడ్ జ్యోతి
బాలీవుడ్‌లో నటిగా స్థిరపడిన 19 ఏళ్ళ జ్యోతి ఆంగే ఎత్తు రెండు అడుగులు మాత్రమే. ‘బిగ్‌బాస్’ టీవీ షోలో తరచూ కనిపించే జ్యోతి ఆంగే ఇప్పటికే అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. అనేక టీవీ కార్యక్రమాల్లో, సీరియల్స్‌లో కూడా కనిపిస్తుంటుంది. “బాలీవుడ్‌లో స్థిరపడడం కోసమే టీవీ కార్యక్రమాల్లో నటిస్తుంటాను. ప్రస్తుతం కొన్ని ఉత్పత్తులకు మోడల్‌గా కూడా తీసుకుంటున్నారు” అని ఆమె చెప్పింది. ఏడాది శిశువులా కనిపించే ఆంగే నాగపూర్‌కు చెందిన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువతి. గేమ్ షోలు, మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె తరచూ కనిపిస్తుంటుంది. ఆమె కనిపిస్తే చాలు, ప్రతివారూ తప్పనిసరిగా ఆమె చూడకుండా పోరు. చిన్నపిల్లలా మాట్లాడుతుంటుంది.
ఆమె కూడా సల్మాన్ మీద మనసు పారేసుకుంది. “నాకు సల్మాన్ ఖాన్ అంటే ప్రేమ. అతన్ని పెళ్లి చేసుకోవడం ఎలాగూ జరిగే పని కాదు. కనీసం అతని సరసన నటించగలిగితే చాలనుకుంటున్నాను. రోజూ దేవుళ్లకు మొక్కుకుంటుంటాను” అని ఆమె చెప్పింది. “నేను కూడా పెళ్లి చేసుకుంటా. అందరిలాగే కుటుంబ జీవితం గడుపుతాను. నాకు ఆ నమ్మకం ఉంది” అని ఆమె చెప్పింది.

పొట్టి వీరయ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా ఫణిగిరిలో పుట్టిన గట్టు వీరయ్య తర్వాత కాలంలో పొట్టి వీరయ్యగా ప్రసిద్ధికెక్కాడు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో భార్య మల్లికతో కలిసి ఎస్‌టిడి బూత్‌ను నడిపేవారు. ఇతనికి ఇద్దరు పిల్లలు. పుట్టుకతో మరుగుజ్జు అయినప్పటికీ 500 సినిమాల్లో హాస్యనటుడిగా కీర్తినిగడించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించిన పొట్టి వీరయ్య విఠలాచారి జానపద సినిమాల ద్వారా చాలా ప్రసిద్ధికెక్కాడు. ఆయనలోని నటుడిని విఠలాచార్య చక్కగా తెరకెక్కించారు. వీరు నటించిన సినిమాల్లో అగ్గివీరుడు, తాతమనవడు, రాధమ్మ పెళ్లి, జగనోహిని, యోగందర్, గజదొంగ, గోలనాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జాన్ సుందరి చెప్పుకోదగ్గవి. 2008 జనవరిలో భార్య మల్లికను కోల్పోయిన పొట్టి వీరయ్య 2008 జనవరి 29న మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు.

దేశంలో పొట్టివాళ్ల జనాభా గణనీయంగా తగ్గుతోంది. ఒకప్పుడు జన్యు సంబంధమైన సమస్యగా కనిపించినా ఇటీవల పిల్లలు పుట్టినప్పుడు డాక్టర్లు ఆ శిశువు ఎత్తుకు సంబంధించిన లక్షణాలను కూడా పరిశీలించి, ఆ సమస్యను చక్కదిద్దగలుగుతున్నారు. కొన్ని గ్రంథుల లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల ఇటువంటి మరుగుజ్జుదనం రావడానికి అవకాశం ఉందని గుర్తించిన డాక్టర్లు ఈ లోపాలను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక దేశాలలో ఈ మరుగుజ్జుదనం రూపుమాసిపోయింది. అమెరికాలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కేవలం 20వేల మంది మాత్రమే మరుగుజ్జులున్నట్టు తేలింది. పోలియో మాదిరిగానే ఈ సమస్యను కూడా శాశ్వతంగా తొలగించడానికి ఆమెరికా, భారత్‌లతో సహా 14 దేశాలలో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ వ్యాధి నివారణకు, నిరోధానికి ప్రపంచ దేశాలన్నీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయి. వివాహం చేసుకుంటున్న మరుగుజ్జులకు మరుగుజ్జులే పుట్టే అవకాశాలు లేవని కూడా శాస్త్రవేత్తలు, డాక్టర్లు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ దంపతులైనా తమ పిల్లలను డాక్టర్లకు చూపిస్తూ ఇటువంటి లక్షణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటుండాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖ కూడా ప్రత్యేకంగా డాక్టర్లకు సూచనలు జారీ చేసింది.

-డాక్టర్ వడ్లమాని కనకదుర్గ, 9640986282