Home వార్తలు ప్రతి సృష్టి జన్యు మార్పిడి మానవులు

ప్రతి సృష్టి జన్యు మార్పిడి మానవులు

 మనిషి గమనంతో, ఆలోచనతో, శరీరంతో, ఆరోగ్యంతో, నైపుణ్యంతో, ఎత్తుతో, లావుతో అన్నిటితో జీన్స్(జన్యు కణాలు)కు సంబంధం ఉంది. ఒక జన్యువుని, జన్యు సముదాయాన్ని మార్చేస్తే మనిషిని రోగం లేని ఆరోగ్యవంతుడిగా చేయచ్చు. మనకి నచ్చినట్టుగా శరీరానికి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. అవసరం లేనిదాన్ని తీసేయచ్చు. ల్యాబరేటరీల్లో ప్రతీదీ సాధ్యమే. కొన్ని ప్రయోగాలు విజయవంతం అయితే, ఇంకొన్ని ఆదారిలో ఉన్నాయి. ఏదైతేనేం మానవ జన్యు మార్పిడి మనిషి గతిని మార్చుతున్న, మార్చబోతున్న సైంటిఫిక్ విప్లవం.

జీన్ థెరపీ
గుండె స్థానంలో గుండెను అమరుస్తున్నారు. అలానే ప్రభావితమైన జీన్ స్థానంలో ఇంకో జీన్ అమర్చడం అసంభవం కాదు. అదే జీన్ థెరపీ. ఇది విజయవంతం అయితే హానిచేసే ప్రోటీన్‌ను నిరోధించి సాధారణంగా పనిచేసే ప్రోటీన్ ఆ స్థానంలో ఉంచి ఆ కొత్త ప్రొటీన్ సింగిల్ ప్రొటీన్‌లా పనిచేసేట్టు చేయడమే.

అథ్లెట్‌లది నిజమైన నైపుణ్యమా…
కండలు పెరగడానికి ఒక ప్రత్యేక జీన్ ఉంటుంది. దాని వలన కండలు సులువుగా, తొందరగా పెరిగిపోతాయి. అలాటి జీన్ స్వతహాగా లేకపోతే బయటనుంచి ఎక్కించేసుకోవచ్చా? అంటే అవునట. దాదాపు అన్ని కేసుల్లో అథ్లెట్‌లు ఆ జీన్‌ల వల్లనే ఉన్నతిని సాధించగలుగుతున్నారు. రైఫిల్ 100 మీటర్లు దాటి షూట్ చేసినా, ఈతగాళ్లు అలుపు సొలుపు లేకుండా అవలీలగా ఈది మెడల్స్ సాధించినా జీన్‌ల మహిమే. ప్రపంచ స్థాయి ఆటల పోటీలంటే ప్రపంచ స్థాయి ప్రతిభావంతమైన జీన్‌లను చూస్తున్నట్టే. కాని అలా అనుకోవడం కూడా పూర్తి నిజం కావని చరిత్రలో కొన్ని సందర్భాలు చెప్పాయి. అథ్లెట్లలో కృత్రిమ జీన్‌ల అంశ కనపడింది. చట్ట వ్యతిరేకమైన పదార్థాల వాడకంతో జరిగే ఆ మాయను కనుక్కోవడం చాలా క్లిష్టంగా మారింది.

డిజైనర్ పిల్లలు రాబోతున్నారు!
geneticమొదటిసారి చైనాలో గర్భస్థ పిండంలో డిఎన్‌ఎను సరిచేశారు. ఈ పద్ధతిని యూరోప్ బ్యాన్ చేసింది. పిల్లల్లో వచ్చే త్రీవ్ర జీన్ డిజార్డర్ తలసీమియా. గర్భస్థ శిశువుకు జీన్ థెరపీ చేసి తలసీమియా జీన్‌ను తీసేస్తున్నారు. అదే కాదు ఇప్పుడు పిల్లలు ఎలా కావాలంటే అలా పుట్టే విధంగా జీన్ థెరపీ చేస్తోంది చైనా. ఒకరకంగా డిజైనర్ పిల్లలన్నమాట. జెనెటిక్ పరిశోధనలు విపరీతంగా చేస్తున్న చైనా మీద విమర్శలు పోటెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జిఎమ్ డిజైన్డ్ బేబీలను తయారు చేయడం మీద బ్యాన్ విధించాలని హ్యూమన్ జెనెటిక్స్ అలర్ట్ డైరెక్టర్, డా.డేవిడ్ కింగ్ బలమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. దాని వలన చాలా దురుపయోగాలున్నాయి. డబ్బున్నవాళ్లు వారి బిడ్డను జెనెటిక్ అడ్వాంటేజెస్ ఉపయోగించుకుని నచ్చినవిధంగా బిడ్డను కంటారు. ఇది మానవీయ విలువలను దెబ్బతీస్తుందనేది వాదన.

కండలు పెంచేయచ్చు
కండలు పెరగడానికి కొంతమేరకు మాత్రమే మజిల్ మిక్స్ పనిచేస్తుంది. కండల పెరుగుదలను శరీరం చాలా జాగ్రత్తగా నిదానంగా నియంత్రిస్తుంది. ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్(ఐజిఎఫ్-1), ఇది జీన్‌ని, ప్రోటీన్‌ని అందిస్తుంది. చిన్నప్పటి నుంచి ఇది ఇస్తే కండరాల పెరుగుదల జరుగుతుంది. వీరు పెరిగి పెద్దయిన తర్వాత ఐజిఎఫ్-1 కండరాల పెరుగుదలను మైయోస్టైన్ జీన్ మైయోస్టైన్ ప్రొటీన్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి సంబంధించి పరిశోధనలు జరిగాయి. ఒక ఎలకలో పిపిఎఆర్-డెల్టా అనే జీన్‌ని ఇంజెక్ట్ చేసి చూశారు. అది దాని సాధారణ చలనం కన్నా ఇంకా రెండింతలు వేగంగా పరిగెడుతోంది.

మొట్టమొదటి జీన్ థెరపీ ప్రయత్నం 1990, సెప్టెంబర్ 14న జరిగింది. పేషెంట్ ఒక నాలుగేళ్ల పాప. ఎడినోసిన్ డేమినేస్ డెఫీషియన్సీ అనే జన్యులోపంతో బాధపడేది. ఆమెకు వ్యాధినిరోధక శక్తి నశించిపోయింది. ఆ సమస్యకు చికిత్సగా మొదటిసారి జీన్‌థెరఫీ చేశారు. ఆమె శరీరంలో నుంచి తెల్ల రక్తకణాలను తీసి అందులోకి అడినోసిన్ డెమినేస్ అనే సాధారణ జీన్‌ని ఎక్కించారు. అది విజయవంతం అవడంతో ఇప్పటికీ ఆ పద్ధతిలో అప్పుడే పుట్టిన పసిపిల్లలకు వారి బొడ్డు పేగు నుంచి సాధారణ ఎడినోసిన్ జీన్స్‌ని పంపిస్తారు. దానివలన దీర్ఘకాలిక లబ్ధి జరుగుతుంది. అటువంటి థెరపీ తీసుకున్న పిల్లలు అందరిలాగా స్కూలుకు వెళ్లి చదువుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అదే జీన్ థెరపీ గొప్పదనం.

కవల పిల్లలు కొంతమంది ఒకేలా ఉంటారు. గుర్తు పట్టడం కూడా కష్టం అవుతుంది చూసేవాళ్లకి. అంతలా ఒకేలా ఉండేవాళ్లు కవలలు మాత్రమే. వారికి ఒకే విధమైన జన్యువులు ఉంటాయి. అది సృష్టి. కాని ప్రతిసృష్టి చేసి ఒకే జన్యువు ఉన్న వ్యక్తులను సృష్టించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అట్లా ఒకేరకమైన జన్యువులు ఉండటాన్ని క్లోనింగ్ అంటారు. అంటే ఒకరి డిఎన్‌ఎ ఇంకొకరితో పూర్తిస్థాయిలో పోలి ఉంటుంది. కవలల జననంలో తల్లి గర్భంలో అండంతో వీర్యకణాలు కలిసిన మొదటిరోజునే పిండం రెండుగా విచ్ఛిన్నం అవుతుంది. ఒకే అండంతో తయారయ్యేవి కాబట్టి ఇద్దరు వ్యక్తులు జన్యుపరంగా ఒకేవిధమైన వ్యక్తులుగా ఎదుగుతారు. మానవ జన్యు మార్పిడి వలన కృత్రిమంగా కవలలు ల్యాబరేటరీలో తయారవుతారు పెట్రి డిష్‌లో. పిండాన్ని తొలిదశలోనే విడి విడి కణాలుగా విభజిస్తారు. చాలా కొద్దికాలం కోసం పెట్రిడిష్‌లో వాటిని ఎదగనిస్తారు. తర్వాత వాటిని అద్దెగర్భంలోకి పంపిస్తారు. అంటే కృత్రిమంగా ఒకేవిధమైన జన్యువులున్న మనుషులు తయారవుతారు. అలా కృత్రిమ కవల పిల్లలను సృష్టించేదే కాకుండా ఇంకో పద్ధతి, సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్. దీనితో అదే తరహా వ్యక్తులను సృష్టిస్తారు.
మనుషుల జీనోమ్‌లో అసాధారణతే జన్యు అవకరం(జెనెటిక్ డిజార్డర్). ఆ డిజార్డర్ అతి చిన్నది కావచ్చు. చాలా త్రీవ్రమైంది కావచ్చు. కొన్ని జెనెటిక్ డిజార్డర్లు అంతకుముందే ఉన్న జీన్స్ బృందం లేదా ఒక జీన్‌లో ఉన్న తేడా వలన సంభవించవచ్చు లేదా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చిన డిజార్డర్లు కావచ్చు. ఒక్క జీన్‌లోపం వల్ల 6000 రకాల జెనెటిక్ డిజార్డర్లు కలుగుతాయి. ప్రతి 200 మంది పిల్లల్లో ఒక్కరికి ఈ సింగిల్ జన్యువు లోపం వలన డిజార్డర్లు ఉంటాయి. దాన్ని మోనోజెనెటిక్ డిజార్డర్ అంటారు.
జెనెటిక్ టెస్టింగ్
జన్యువుల వలన కలిగే ప్రమాదాలను కనిపెట్టడానికి ఒక అద్భుత అవకాశం జీన్ టెస్టింగ్. కాని, అన్ని జెనెటిక్ టెస్ట్‌లు, అప్పటికి ఆ పరిస్థితికి కారణం అయిన జీన్స్‌ను కనిపెట్టలేవు. ఒకవేళ కనిపెట్టినా అందులో సందిగ్ధత ఉంటుంది. వ్యక్తులు, కుటుంబాలు కోరుకున్న సమాచారాన్ని జెనెటిక్ టెస్ట్‌లు ఇవ్వలేవు. ఉదాహరణకు, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జెనెటిక్ డిజార్డర్ దంపతులిద్దరిలో ఉన్నట్టు జీన్‌టెస్ట్ చెప్పిందనుకోండి. అది పుట్టబోయే బిడ్డకు కూడా సంక్రమిస్తుందనే భయం సాధారణం. అలాటప్పుడు తల్లి గర్భంలో ఉండగానే జీన్ టెస్ట్ చేయించుకుని ఒకవేళ బిడ్డకు కూడా అదే డిజార్డర్ ఉంటే అబార్షన్ చేయించుకోవాలని తల్లిదండ్రులు సంకల్పిస్తే వారికి పూర్తి స్పష్టమైన సమాచారం దొరక్కపోవచ్చు. జీన్ టెస్ట్ చేయిస్తే పుట్టబోయే బిడ్డ ఆ డిజార్డర్‌ను రెండింతలు క్యారీ చేయచ్చు లేదా అసలు డిజార్డరే ఉండకపోవచ్చు. ఆ గర్భాన్ని ఉంచుకోవాలా లేదా అన్నది ఆ తల్లిదండ్రుల డైలమా.
కుటుంబం మొత్తానికి సంబంధం
మిగిలిన మెడికల్ టెస్ట్‌లు చేయించుకుని రోగ సమాచారం తెలుసుకోడానికి, జెనెటిక్ టెస్ట్ చేయించుకుని తెలుసుకునే సమాచారానికి తేడా ఉంటుంది. జెనెటిక్ సమాచారానికి, మానవ విలువలకి ముడిపడి ఉంది. ఈ టెస్ట్‌లు ఎక్కడంటే అక్కడ జరగవు. వాస్తవానికి జెనెటిక్ పరిస్థితులు ఒక వ్యక్తికి సంబంధించినవి అయి ఉండవు. కుటుంబం మొత్తానికి ఆ సమస్యతో సంబంధం ఉంటుంది. హెల్త్ ప్రొఫెషనల్స్ తప్పనిసరిగా కొన్ని విలువలు పాటించే బాధ్యత తీసుకుని ఇతరుల ఆరోగ్యాలను పణంగా పెట్టకుండా ఉండాలి. జెనెటిక్ టెస్ట్‌లు చేయించుకోడానికి వెళ్లేవారు వారి సొంత ఆరోగ్యమే కాకుండా ఇంట్లో వాళ్లు, బంధువుల ఆరోగ్య సమాచారాన్ని కూడా బయటపెడుతున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. జెనెటిక్ టెస్ట్ చేయించుకునే ముందు తర్వాత జెనెటిక్ కౌన్సెలింగ్ అవసరం పడుతుంది. కొన్ని కేసులలో జెనెటిక్ టెస్ట్‌లకు సంబంధించి నమ్మదగిన, పూర్తి సరయిన సమాచారం దొరుకుతుంది. ఇంకొన్ని కేసుల్లో సరైన ఫలితం దొరకదు.
ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి
ప్రతి మనిషి ఎన్నో జన్యుకణాల సముదాయం. ఫలానా జీన్ వలన ఆ వ్యక్తి ప్రస్తుత స్వభావం, ఆ వ్యక్తి పరిస్థితి, అతనికి రాబోయే ఆరోగ్య హాని ఫలానా అని అన్నీ తెలుస్తాయి. ఇంకా అరుదుగా, పరిస్థితి ఎంత త్రీవ్రతరం కావచ్చు, పైగా అది ఏ వయసులో కావచ్చు అనే విషయాన్ని కూడా లక్షణాలతో సహా చెప్పేస్తుంది. అలా వ్యక్తి జెనెటిక్ మేకప్‌ను జీనోటైప్ అంటారు. అది తెలుసుకోవాలంటే టెస్ట్ అవసరం. కాని చేయబోయే టెస్ట్‌కి ముందస్తు అంగీకారం తీసుకుంటారు. ఎందుకంటే, రీసెర్చర్ అత్యుత్సాహం ప్రదర్శించి కుటుంబంలో మిగతావారిని కూడా టెస్ట్ చేయాల్సి రావచ్చు అది వారికి అసౌకర్యం కలిగించవచ్చు. ఫలితం మంచిది కావచ్చు, నచ్చనిది కావచ్చు. తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. అన్నిటికీ వారు సిద్ధంగా ఉండాలి.
ఫోరెన్సిక్ డిఎన్‌ఎ డేటా బ్యాంకులు
వేలిముద్రల ఆధారంగా నేరాలను పసిగట్టే విధానం 1890 నుంచి ఉంది. దానికి వంద సంవత్సరాల తర్వాత డిఎన్‌ఎ ఫింగర్‌ప్రింటింగ్ వాడకంలోకి వచ్చింది. పరిష్కారం కాని నేరాలను కనుక్కోవాలంటే జెనెటిక్ శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తారు.
ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి
హంటింగ్టన్ డిసీజ్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది దాదాపు 30 నుంచి 50 ఏళ్ల వయసున్నవారికి వస్తుంది. ఈ పరిస్థితికి చికిత్స లేదు. చివరికి మరణం కూడా సంభవించవచ్చు. మిస్టర్ హెచ్ అనే ఒక 25 ఏళ్ల వ్యక్తి తాత అంతకు పదేళ్ల ముందు ఆ వ్యాధితో చనిపోయాడు. అతని తల్లికి ఆ వ్యాధి సంక్రమించే అవకాశం 50 శాతం ఉంది. అందుకే ఆమె జెనెటిక్ టెస్ట్ చేయించి ఆ లోపం ఉన్న జీన్‌ని తెలుసుకోవాలనుకుంది. టెస్ట్‌లలో ఆమెకు తప్పకుండా కొన్నేళ్లకు ఆ వ్యాధి వస్తుంది. ఇంకా మిస్టర్ హెచ్ కూడా 50 శాతం రిస్క్‌లో ఉన్నాడు. అతను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేస్తాడు. తన ఉద్యోగం చాలాప్రియం అతనికి. చాలా ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా చేయాలనుంది. అతనికి ఆ లోపం ఉన్న జీన్ ఉందో లేదో తెలీదు. కాని అతనికి ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలనీ లేదు. ఇప్పుడు డైలమా ఏంటంటే, అతను టెస్ట్ చేయించుకోవాలా వద్దా? ఒకవేళ చేయించుకోవాలనుకుంటే అది ఏ వయసులో? ఇవన్నీప్రశ్నలే. ఇటువంటి సందర్భాలు, సంఘటనలు మన జీవితాల్లో సాధారణం.
తెలివి పెంచే జీన్స్ ఎక్కించుకోవచ్చా?
మనుషుల్ని తెలివైనవాళ్లు చేసేవి జీన్స్. స్వతహాగా తెలివి కలిగించే జీన్స్ ఉండచ్చు. అలాగే బ్రెయిన్‌ని బూస్ట్ చేయడానికి జీన్ మ్యానిప్యులేషన్ చేయచ్చు. పరిశోధకుల ప్రకారం తెలివి ఎక్కువగా చదవడం వలన వస్తుంది. 75 శాతం ఐక్యు వంశపారంపర్యంగా వస్తుంది. మిగిలినదానికి పరిస్థితులు కారణం అవుతాయి. అయితే ఇప్పటి వరకు ఏ జీన్స్ తెలివిని కలిగిస్తున్నాయో మాత్రం చెప్పలేకపోయారు. అది కనుక తెలిసిపోతే అందరినీ తెలివైనవారుగా మార్చేయచ్చు. తెలివినిచ్చే ఒక్క జీన్‌ని కనిపెట్టలేకపోతున్నారు కాని మనిషి తెలివికి జతకలిసిన జీన్ సముదాయాన్ని మార్చేయచ్చు అంటున్నారు. ఇంకా ఆవైపు అడుగులు పడలేదు. ప్రస్తుతం సిద్ధాంతపరంగానే ఉంది.
500 ఏళ్ల వరకు బతుకుతారా?
ముసలితనాన్ని ఎవరూ ఇష్టపడరు. కాని దాన్నుంచి తప్పించుకునే దారి కూడా లేదు. యవ్వనంలో ఉన్నవారికి, వృద్ధులకు జీన్స్ పనితీరులో తేడా ఉంటుంది. యవ్వనంలో ఉన్నప్పుడు శరీరంలో అన్ని ప్రక్రియలు బాగా జరుగుతాయి. కాని భవిష్యత్తులో కంప్యూటర్‌ని కంట్రోల్ చేసినట్టు జీన్స్‌ని కూడా చేస్తాం. దీని వలన మనుషులు ఇప్పటి కన్నా చాలా ఎక్కువ ఏళ్లు యవ్వనంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. యవ్వనంగా ఉండే జీన్‌ని ఉంచడం వల్ల కణాలు, టిష్యూలు, అవయవాలు అన్నీ ఆరోగ్యంగా పెరుగుతాయి. క్షీణించవు. ఇప్పటికే మనిషి తన జీవన ప్రమాణ స్థాయిని బట్టి జీన్ పనితీరును నియంత్రణ చేస్తున్నాడు. అంతేకాకుండా చేప నూనె, విటమిన్ డి, టెరోస్టిల్‌బెన్, రిస్వెరట్రోల్ లాటి సప్లిమెంట్లు తీసుకుని జీన్ పనితీరు మెరుగు పరుస్తున్నారు. మంచి ఆహారం, పోషకాలు, మందులు, మనిషిని ఆరోగ్యవంతం ఎందుకు చేస్తాయంటే అవి ఆరోగ్యాన్ని పెంపొందించే జీన్‌ని ప్రేరేపిస్తాయి. జబ్బులని ప్రేరేపించే జీన్‌లను తగ్గించేస్తాయి. హానికరమైన టాక్సిక్ ఆహారపదార్థాలు, కెమికల్స్ జబ్బులను పెంపొందించే జీన్‌లను ఉత్తేజితం చేస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందించే జీన్స్‌ను తగ్గించేస్తాయి. ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని పొడిగించడానికి జీన్స్‌ను మార్పిడి చేసే విధానం ఇంకా తొలిదశలో ఉంది. సైంటిస్టులు జెనెటిక్ ఇంజినీరింగ్, స్టెమ్ సెల్ థెరపీలను అభివృద్ధి చేశాక డాక్టర్లు మనుషుల వయసును వెనక్కి తీసుకెళ్లిపోయి వారు నిజానికి ఏ వయసులో ఉన్నారో తెలియని పరిస్థితి తీసుకువస్తారు.
వయసునాపేస్తారు
వయసు పెరిగే క్రమం ఒక జన్యు ప్రక్రియ. అది వయసు క్రమాన్ని నియంత్రిస్తుంది. ఇకముందు వయసును వెనక్కి తీసుకెళ్లిపోతారు. వయసుతో వచ్చే రోగాలను కూడా ఆలస్యం చేయచ్చు. అయితే ఇప్పటి వరకు ముసలితనం వైపు ప్రయాణానికి ఒక సమగ్ర నమూనా లేదు. కాని ఎలా వయసు పెరిగే క్రమం దానంతట అది జరుగుతుందో తెలుసు. అయితే దాన్ని రివర్స్ ఎలా చేయాలో తెలుసుకోవడంలో ఇంకా ఆరంభ క్రమంలోనే ఉన్నాం. ఇది విజయవంతం అయితే తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ ఒకే వయసులో ఉన్నట్టు ఉంటారు.