Home కలం తొలితరం నవలాకారుడు-సోమరాజు

తొలితరం నవలాకారుడు-సోమరాజు

somaraju

వచ్చే నెలలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ వెలుగులు, వైతాళికులను ఈ సందర్భంగా స్మరించుకునేందుకు ప్రయివేటుగానూ, ప్రభుత్వ పరంగానూ పెద్ద ఎత్తున మోనోగ్రాఫ్‌లు, పరిచయ వ్యాసాలతో పుస్తకాలు రానున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, వారసత్వం అన్నీ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భాషా, సాహిత్యాభిమానులకి తెలియజెప్పేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం జేసి కూడా విస్మరణకు గురయిన వారెందరో ఉన్నారు. అట్లాంటి వారిలో ముందువరుసలో ఉన్నవాడు సోమరాజు రామానుజరావు. ఈయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, ప్రయోక్త, జాతీయోద్యమ నేత, గ్రంథాలయోద్యమకారుడు, గ్రంథమాల స్థాపకుడు, పుస్తకాల ప్రచురణ కర్త. ఇట్లా బహుముఖంగా పనిచేసిన సోమరాజు రామానుజరావు భద్రాచలం దేశ్‌పాండ్యా, జమిందార్ల కుటుంబంలో జన్మించిన ఈయన తిలక్, గాంధి, గోఖలేల ప్రభావంతో జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ ప్రభావంతోనే ‘స్వరాజ్య రథం’ అనే నాటకాన్ని రాసిండు. ఈ నాటకాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. అంతేగాదు రామానుజరావు అరెస్టుకు ఫర్మానా జారీ చేసింది. అయినప్పటికీ ఆయన రాయడం మానలేదు. 50కి పైగా నాటకాలు, 20కి పైగా నవలలు రాసిండు. ఈ వ్యాసంలో రామానుజరావు నవలల గురించి చర్చించుకుందాం.
రామానుజరావు తొలి నవల తన 18వ యేట అంటే 1914లో ‘మంజుమతి’ పేరిట రాసిండు. ఆనాటి నుంచి 1934లో 38వ యేట చనిపోయే నాటి వరకు 20కి పైగా నవలలు రాసిండు. అయితే ఇందులో ఇప్పుడు చాలా వరకు అలభ్యం. లభ్యమైన నవలల గురించి ఇక్కడ విశ్లేషించడమైంది. చారిత్రక అంశాల్ని తీసుకొని నాటకంగా, నవలలుగా మల్చడంలో ఈయన సిద్ధహస్తుడు. ‘మంజుమతి’ నవల కూడా అలాంటిదే. ఈ నవలను ఆయన తన తల్లిదండ్రులు చూడమాంబ, కోదండరామయ్యలకు అంకితమిచ్చిండు. రెండో నవల ‘జగన్మోహిని’. ఇది కూడా చారిత్రక విషయమున్న నవల. దీంట్లో ఆర్కాటు ముట్టడికి సంబంధించిన చరిత్ర ఉన్నది. ఈ నవల 1915లో ‘సుబోధిని గ్రంథమాల’ వారు ప్రచురించారు. నెల్లూరులో ప్రచురితమైన ఈ నవల ముద్రణకు ‘పోట్లపూడి’ గ్రామానికి చెందిన పొణకా పట్టాభి రామిరెడ్డి ఆర్థిక సహాయం చేయగా, యం.ఆర్. కృష్ణారావు అండ్ కంపెనీ వారు ప్రకటించారు. ఈ నవల ఆరంభంలో అంకిత పద్యమిలా ఉన్నది.
గీ.సరగ వాల్మీకి వ్యాసాది జనములకును
జన్మకారణమై తగు జనని యైన

యట్టి భారతి కడుపునఁ పుట్టినావు!
యాంధ్రభాషాసతీ! కృతి నందుకొమ్ము!

ఈ నవలలోని విషయంతో పాటు భాష కూడా సరళంగా ఉండింది. అందుకే ఆనాడు విద్యావంతులందరి చేత ఈ నవలలు చదివించగలిగాయి. నవలకారుడిగా ఒక్క సుబోధిని గ్రంథమాల వారికే ఆరుకు పైగా నవలలు ఒకే సంవత్సరం అచ్చుకు ఇచ్చిన రామానుజరావు రాసిన నవలలనిన్నీ అందుబాటులో లేవు. వాటన్నింటినీ సేకరిం చాల్సిన అవసరమున్నది. స్వర్గస్థురాలయిన తన పెదతల్లి కాళ్ళకూరి వేంకట నరసమాంబకు అంకితంగా‘హైమవతి’ నవలను 1916లో రాసిండు. ఈ నవల ఆంధ్ర ప్రచారిణీ ముద్రాక్షరశాల నిడదవోలులో 1916లో ప్రచురితమయింది. దీనికి సంపాద కుడుగా అయ్యగారి నారాయణ మూర్తి వ్యవహరించారు. “అది గ్రీష్మము. నాడు మధ్యాహ్నము ఎండ నిప్పులఁ జెరగు చుండెను. గాడ్పులు మహాభయంకరముగ వీచు చుండెను. మధ్యాహ్న మార్తాండుడు మండల మధ్యవర్తియె వెలుంగుచుండెను” అంటూ నవల ప్రారంభమయింది. ఇది సాంఘిక నవల. నవల ముగింపు ఇలా ఉన్నది. “హా హైమవతీ! నీవింకను జీవించి యుంటివా? నేను నిద్రించుచుంటినా? మేల్కనియుంటినా?” “అని పలుకుచు నాతడామెను బిగ్గరగాగౌగిలించుకొనియెను. చిరకాలమునకు గలిగిన సందర్శనముచే నాప్రేమమయమూర్తులు అగాధమగునెంతటి సంతోష సాగరమున మునిగి యుండిరో, అసభవముగల(?) నూతన దంపతు లూహించుకొందురు గాక! వారి సంతోషమును, సౌఖ్యమును వర్ణింపఁ దలంచినచో నీ చిన్ని పొత్తము చాలదు.కావున, దానిని మా పాఠకులే యూహించుకొందురుగాక యని వదలివేయుచున్నారము” అని పేర్కొన్నాడు. సోమరాజు రామానుజరావు రాసిన మరో నవల ‘దోమాడ యుద్ధము’. ఈ నవల 1921లో ప్రచురితమయింది. “ఇది నీలాద్రి రాయణింగారికిని, పెదమహీపతి రాయణింగారికిని పిఠాపురపు రాజ్యంబుకొఱకు దోమాడ వద్ధ జరిగిన యుద్ధము. చరిత్రాత్మకమైన పద్మనాయక (దోమాడ యుద్ధ) కథ. ఇయ్యతి బొబ్బిలి యుద్ధా నంతరమున అయిదారు సంవత్సరములలో (క్రీ.శ.1763) జరిగినట్లు దెలియుచున్నది. ఇందు పద్మనాయక సేనానాయకుల ప్రభు భక్తి విశ్వాసంబులును, వారల యవక్రవ విక్రమ పరాక్రమాదులును వెల్లడియగుచున్నవి. ఈ గడచిన కొన్నాళ్ళకు ఆంధ్రదేశంబున బ్రచండంబగు మఱియొక యుద్ధంబు పద్మనాయకుల మధ్య దోమాడ యను గ్రామంబున సంభవించె. ఇద్దానిని గుఱించే యీ గ్రంథంబున పేర్కొనబడియుండె.” (సోమరాజు రామానుజరావు; 1921) అని నవలా రచయిత ఉపక్రమణికలో పేర్కొన్నాడు. వీటితో పాటుగా రామానుజరావు శిశుహత్య, వనదుర్గము, తపోవనము, జపమాలిక, రక్తజ్వాల, కరుణ (ఆంధ్ర వాఙ్మయ సూచిక; కాశీనాథుని నాగేశ్వరరావు; 1919/1994) మొదలగు 21 నవలలు రాసిండు.
బహుశా తెలుగులో అపరాధ పరిశోధక నవలలు రాసిన వారిలో సోమరాజు రామానుజరావే మొదటివాడయ్యుంటాడు. ఈ విషయమై అక్కిరాజు రమాపతిరావు ఇలా రాసిండు. “…ఉత్కంఠ, కుతూహలం రేకిత్తించే అపరాధ పరిశోధన నవలలు వ్రాసిన వారు సోమరాజు రామానుజరావు” (అక్కిరాజు రమాపతిరావు; 1975.) ఈయన రాసిన నీవేనా కథ ‘తొలి తరం తెలుగు కథలు’ సంకలనంలో చోటు చేసుకుంది. అలాగే చల్ మోహనరంగ (పాట), కొడుకా పిచ్చోడా (పాట), సిరిసిరి మువ్వ (పాట) ఆనాడు బహుళ ప్రజాదరణ పొందాయి. 1896 జూన్ 18న భద్రాచలం తాలూకా దుమ్ముగూడెంలో చూడమాంబ, కోదండరామయ్య దంపతులకు జన్మించిన సోమరాజు రామానుజరావు “తిలక్, గోఖలే వంటి దేశభక్త్తులను ఆదర్శంగా తీసుకున్నాడు. దుమ్ముగూడెంలో శ్రీవేంకటేశ్వర గ్రంథమండలి పేరుతో ఒక ప్రెస్‌ను నెలకొల్పి 1921 నాటికి 21 పుస్తకాలు ప్రచురించారు. ఆయన స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన తోలుబొమ్మలు 1970లో లంకపల్లిలో అగ్నిప్రమాదంలో కాలిపోయాయి.” అని సోమరాజు రామానుజరావు నాటకం ‘స్వతంత్ర రథం’ నిషేధానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చిన తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవలందించిన సోమరాజు రామానుజరావు ఈ తరం వారికి అంతగా తెలియదు.
ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన గురించి అందరికీ తెలియ జెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరమున్నది. 1934 నవంబర్ 14న కేవలం 38 ఏండ్ల వయసులోనే ఆయన మరణించారు. 20 ఏండ్ల పాటు నిరంతరాయంగా రాస్తూ, నాటకాలు వేస్తూ తెలుగు సాహిత్యానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సోమరాజు రామానుజరావు గ్రంథాలయోద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు.
నవంబర్ 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ వారోత్సవాలలో ఆయనను స్మరించుకోవడమే గాకుండా, ఆయన వర్ధంతిని కూడా నిర్వహించి భవిష్యత్తరాల వారికి సోమరాజు రామానుజరావు స్ఫూర్తిని అందించాల్సిన అవసరమున్నది.