Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పరీక్షల ఒత్తిడిని ఓడిద్దాం!

Exams-image

తల్లిదండ్రుల బలవంతంతో ఇష్టంలేని గ్రూప్ తీసుకున్నా.. అందమైన ఆకర్షణల మధ్య సర్దుకున్నాడు రాజేశ్. ప్రణాళిక లేకుండా చదవడంతో రివిజన్ విషయం పట్టించు కోలేదు. అన్నీ వచ్చేసినట్లే ఉన్నా ఏదీ గుర్తుకు రావడం లేదని ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి దాటినా నిద్రపట్టదు. పగలు కునుకులేస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. ఇవన్నీ ఒత్తిడి లక్షణాలు. వీటిని సరైన సమయంలో గుర్తించి సానుకూల దృక్పథంతో వ్యవహరించకపోతే పరిస్థితి ప్రతికూలంగా మారిపోతుంది.

శ్రద్ధగానే చదువుతున్నా విద్యార్థులందరిలోనూ అలాంటి పరిస్థితే ఎంతోకొంత కనిపిస్తుంటుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలూ, ఎంసెట్, నీట్, జేఈఈ, ఇంకా డీమ్‌డ్ యూనివర్సిటీల ప్రవేశపరీక్షల కోసం సిద్ధమయ్యేవారూ, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులూ ఓ పక్క ప్రిపరేషన్లో మునిగిపోతూ మరో పక్క పరీక్షల ఆలోచనల ఒత్తిడితో సతమతమవుతుంటారు. ఈ ఒత్తిడి మితిమీరకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. పరీక్షలు బాగా రాసి, ఆశించిన మార్కులు తెచ్చుకోవాలంటే ఇది తప్పనిసరి.
తలనొప్పి, ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతి అయ్యేలా ఉండటం, ఎక్కువ తినెయ్యటం, నిద్రలేమి, అలసట..ఇవన్నీ ఒత్తిడిని సూచించే లక్షణాలు. మానసికంగా చూస్తే… కోపం, అసహనం, నిరాశ, ఆత్మవిశ్వాసం లేకపోవటం, మూడ్ తరచూ మారిపోతుండటం లాంటివి గమనించవచ్చు. పరీక్షల ఒత్తిడి, దానివల్ల ఏర్పడే భయాలకు కొన్ని మూల కారణాలుంటాయి.

వాటిని మొదట అర్థం చేసుకోవాలి. ఆపై కొన్ని సులభమార్గాలతో అధిగమించవచ్చు. జ్ఞాపకశక్తి లోపం చాలామంది విద్యార్థులు ఎంత చదివినా, చదివిందేదీ గుర్తుండటం లేదని బాధపడుతుంటారు. నిజానికి వీళ్లు పరీక్షలు బాగానే రాస్తారు. కానీ ఎంత చదివినా గుర్తు ఉండకపోవడమనేది పరీక్షల ముందు రోజుల్లో ఎదురయ్యే భయం. పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుని ‘నేర్చుకునే పద్ధతి’ (లెర్నింగ్ మోడ్)లో చదివితే మర్చిపోవడం కష్టం. అర్థమైన విషయాన్ని ఎవరూ మర్చిపోరు. సబ్జెక్టు మీద ఇష్టంతో, ఆసక్తితో చదివినపుడు పాఠ్యాంశాన్ని మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇష్టమైన సినిమాలో ప్రతి దృశ్యాన్నీ ఎలా గుర్తు పెట్టుకోగలుగుతున్నాం? దానికి పెద్దగా ప్రయత్నం కూడా చేయడం లేదే? ఇది కూడా అంతే!

కాస్త వ్యాయామం… సానుకూలత
* కొద్దిసేపు సైక్లింగ్, చిన్నపాటి శారీరక వ్యాయామం చేయటం ఒత్తిడిని తగ్గిస్తాయి.
* బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోవడం, ధ్యానం, అవసరమైతే వైద్యులను సంప్రదించి కొద్దిపాటి మందులు

వాడుతూ ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
* కొన్నిసార్లు విటమిన్ల లోపం కూడా ఒత్తిడికి కారణం కావొచ్చు. ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
* చుట్టూ ఉన్న పరిసరాల్లోని చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కలిగించి ఒత్తిడిని దూరం చేసేవి చాలా ఉంటాయి. ఉదయిస్తున్న సూర్యుడు, వికసిస్తున్న పూలు, ఆడుకుంటున్న పిల్లలను చూడటం, చల్లగాలిని ఆస్వాదించడం, శ్రేయోభిలాషులతో కాసేపు మాట్లాడటం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేసేవే.
* సానుకూల దృక్పథంతో ఉండాలి. ఆ దిశగా ఆలోచనలను మళ్లించాలి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి అన్నింటికంటే బాగా పనిచేసే మందు.
ఏకబిగిన గంటలతరబడి చదవకుండా 40-45 నిమిషాలకోసారి 5-10 నిమిషాల విరామం ఇస్తూ చదవటం వల్ల సబ్జెక్టును చక్కగా ఆకళింపు చేసుకోవచ్చు. బాగా గుర్తుంటుంది కూడా! బట్టీ పద్ధతిలో చదివితే ఒక పాయింట్ మధ్యలో గుర్తుకు రాకపోతే ఇక మిగిలిన పాయింట్లన్నీ కూడా దాని వెనకే మాయమైపోతాయి. విద్యార్థి అయోమయంలో పడతాడు. అందుకే, ప్రతి పాఠ్యాంశాన్నీ శ్రద్ధగా ఆకళింపు చేసుకుంటే చదివినదాన్ని మర్చిపోయే సమస్య రాదు.
నిద్రలేమి : చాలామంది అర్ధరాత్రి దాటాక కూడా చదువుతూ పగలు కునికిపాట్లు పడుతుంటారు. అలాగే వివిధ పోటీపరీక్షలకు సైతం అమితంగా శ్రమించడం వల్ల తరచూ నిద్రలేమికి గురవుతుంటారు.
అటువంటి సమయంలో అలసటకు లోనై ఆలోచనలు బలహీనపడతాయి. పరీక్షలు సరిగా రాయలేమేమో అని భయం కలుగుతుంది.
ఎక్కువ సమయాన్ని చదువుకోసం కేటాయించడం వల్ల నిద్రలేమి సమస్య బాధిస్తుండటం సహజమే! మరికొంత మంది ఒత్తిడి వల్ల ఎక్కువ నిద్రపోలేరు. దీనికి కనీస సమయమైనా నిద్రపోవడం తప్ప వేరే మార్గం లేదు.
నిద్రలేమి ప్రభావం మానసిక, శారీరక ఆరోగ్యాల మీద తప్పకుండా పడుతుంది. కాబట్టి విద్యార్థులు వారి వయసునిబట్టి తగినన్ని గంటలపాటు నిద్రపోవాలి. ఒత్తిడితో, ఆందోళనతో నిద్ర పట్టనివారు ఒత్తిడిని జయించే కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల దీన్ని అధిగమించవచ్చు.

Comments

comments