Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

తినే పరిమాణం తగ్గితే… బరువూ తగ్గుతుంది

foodరుచికరమైన కూరలు, సాం బారు, పచ్చడి… పెరుగు ఉంటే మరో నాలుగు ముద్దలు ఎక్కువ అన్నం తినడం సహజం. ముద్దనోట్లో పెట్టామంటే… మృదువుగా జారిపోయే పాలిష్ బియ్యంతో చేసిన అన్నం మరో నాలుగు ముద్దలు ఎక్కువ కడుపులోకి వెళ్ళిపోతాయి. ఇలా రోజూ లాగించేస్తే బరువు పెరగక ఏమౌతుంది చెప్పండి. జిహ్వచాపల్యం తగ్గించాలంటే మన రోజువారి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలు తినమంటారు. చపాతీలు రెండుకంటే ఎక్కువ తినలేం. అన్నం పరిమా ణంలో గోధుమ అన్నం తినలేం… అందుకే గోధుమ రొట్టె, జొన్న రొట్టె తినమంటుంటారు డాక్టర్లు. బియ్యమయినా అంతే… సన్నబియ్యం స్థానం దంపుడు బియ్యం ఎక్కువగా తినలేం… అందుకే ఎక్కువగా తినలేని ఆహారం ఎంచుకుంటే బరువు దానంతటదే తగ్గిపోతుంది. ప్రయత్నించి చూడండి…
అటుకుల కిచిడి: అటుకులు ఉప్మా లేదా కిచిడీలా చేసుకుని తింటే ఎక్కువ మొత్తంలో తీసుకోలేరు. కొద్దిగా తిన్నా కడుపునిండినట్టు అనిపిస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది కూడా. అటుకులు రక్తహీనతను తగ్గిస్తాయి. ఐరన్ కూడా లభిస్తుంది. అటుకుల ఉప్మాలేదా కిచిడీలో కూరగాయలు ఉడికించి కలిపితే పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయి.
దంపుడు బియ్యం: ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. దంపుడు బియ్యం అన్నంలో కూరలు కలుపుకుని తినొచ్చు లేదా ఆకుకూరలు, గాయగూరలు కలిపి కిచిడీలా చేసుకుంటే చాలా మంచిది. దంపుడు బియ్యం రక్తంలో చక్కెరలను అదుపులో ఉంచుతాయి. చక్కెర వ్యాధి ఉన్న వారు దంపుడు బియ్యం తరచుగా తీసుకోవడం చాలా మంచిది.
తృణధాన్యాలు: సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు, గోధుమలు, మొక్కజొన్నలు వంటివి సన్నగా రవ్వ పట్టించుకొని ఉంచుకోవాలి. ఒక కప్పు రవ్వ నానబెట్టి ఉడికించాలి. ఇందులోని జొన్నలు, మొక్కజొన్నలు వంటివి త్వరగా ఉడకవు. స్టౌమీద ఓ పావుగంట సేపు నీళ్ళు పోస్తూ ఉడికించి ఆ తరువాత కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి. కొద్దిగా ఉప్పువేసి వేడి వేడిగా కాస్త వెన్న వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వెనకటి రోజుల్లో గట్క అనే వారు. ఇది అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిది. దీన్ని మజ్జిగతో కలిపి అంబలిలా తిన్నా త్వరగా ఆకలి వేయదు.
కిచిడీ: కూరగాయ ముక్కలు ముప్పావు, పావు బియ్యం కలిపి కిచిడీ చేసుకుని తినండి. ఈ అన్నం ఎంత రుచిగా చేసుకున్నా ఎక్కువగా తినలేరు. ఇందులో అన్ని రకాల కూరగాయలు ఉన్నందువల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

Comments

comments