Home ఎడిటోరియల్ తినేది అన్నం, నగదు కాదు

తినేది అన్నం, నగదు కాదు

సెప్టెంబర్ 30 సంపాదకీయం

                      Ration-Shop

సబ్సిడీ ధరలతో ఆహార పదార్థాలను అందించే పథకాలను నగదు బదిలీ, లేదా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వంటి కార్యక్రమాలతో మార్చాలని వివిధ ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ‘విశ్వజనీన మౌలిక ఆదాయం’ అన్న అధ్యాయంలో 2016-17 ఆర్థిక సర్వే మొదటి సంపుటంలో ఈ విషయాన్నే పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఇటీవల జాతీయ పోషకాహార వ్యూహం అన్న నివేదికలో ఇంటికి రేషన్ తీసుకెళ్లడానికి బదులు సమీకృత శిశు అభివృద్ధి పథకం లో (ఐ.సి.డి.ఎస్.) భాగంగా నగదు బదిలీ చేయాలని సూచించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి కేంద్రమంత్రిత్వ శాఖ ఈ సూచనను ఆమోదించింది. ఇంటికి రేషన్ సరుకులు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయం రూపొందించింది. అంగన్‌వాడీలలో ఉండే మూడేళ్ల లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు వస్తురూపంలో అందించే సహాయానికి బదులు వారి తల్లుల జన ధన్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. బాలల పోషకాహార లోప సమస్య ఎక్కువగా ఉన్న చోట ముందు ఈ పద్ధతి అనుసరించి తర్వాత ఓ సంవత్సరానికి అన్ని చోట్లా అమలు చేయాలని ప్రతిపాదించారు.

పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో నగదు బదిలీ పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అదే జన ధన్, ఆధార్, మొబైల్ పథకం. మొట్టమొదట రేషన్ దుకాణాల ద్వారా అందజేసే సరుకులకు వర్తింప చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నగదు బదిలీ 67 శాతం జనాభా కు అమలు అవుతుంది. అన్ని రాష్ట్రాలు రేషన్ సరుకుల పంపిణీలో ప్రత్యక్ష బదిలీ పద్ధతి అనుసరించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. పుదుచ్చేరి, దాద్రా-నగర్ హవేలీ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలలో మొదట ఈ పథకాన్ని అమలు చేస్తారు. రేషన్ దుకాణాలు, సమీకృత శిశు అభివృద్ధి పథకంలో సరుకులు పక్కదారి పట్టకుండా, నాసిరకం ఆహార పదార్థాలు సరఫరా కాకుండా, అవినీతికి తావులేకుండా ఈ పథకం చేపట్టారు. అయితే ఈ పథకాలలో పరిపాలనా సంబంధమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు రాజకీయ సంకల్పం ఉంటేనే ప్రయోజనం ఉంటుంది.

ఉదాహరణకు 2004-05, 2011-12లో ప్రభుత్వ పంపిణీ విధానం కింద సరుకులు కొనడం 117శాతం పెరిగిందని ఆర్థిక సర్వే తెలియజేసింది. అంటే ఎక్కువమంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని, సరుకులు దారి మళ్లడం 54శాతం నుంచి 35 శాతానికి తగ్గింది. 2016వ సంవత్సరానికి చూస్తే ఇది 20.08 శాతం తగ్గవచ్చు. అయితే సాంకేతికత మెరుగు పడడం, మరింత మందికి ఈ పథకాలు వర్తింపచేయడం లాంటివి ఇందులో చేరవు. అవన్నీ గత మూడు సంవత్సరాల కాలంలో జరిగినవే. రేషన్ దుకాణా ల ద్వారా సరఫరా చేసే సరుకులకు బదులు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో లాగా నగదు బదిలీ అమలు చేస్తున్నారు. అయితే ఆ నగదు లబ్దిదారులకు చేరిందో లేదో తెలియదు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 35శాతం మంది బ్యాంకు ఖాతాలలో నగదు జమ కాలేదు. అంటే సహాయం అందజేయడానికి నగదు ఇవ్వడం సర్వరోగ నివారిణి ఏమీ కాదు. ఎందుకంటే నగదు అందజేయడంలో కూడా డబ్బు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది.

సమీకృత శిశు అభివృద్ధి పథకానికి వనరులు తగినంతగా లేవు. అదనపు పోషక పదార్థాలు అందజేసే ప్రయత్నానిదీ అదే వరస. ప్రస్తుతం గర్భిణులకు 45 నెలల పాటు ఇంటికి సరుకులు తీసుకెళ్లే పథకం కింద 7,125 రూపాయల విలువగల సరుకులు అందుతున్నాయి. అంటే నెలకు రూ.158 విలువగల సరుకులు అందుతున్నాయి. ఈ అంచనాలు 2011-12 నాటి ధరల ఆధారంగా వేసినవి. అప్పటి నుంచి ఈ అంచనాలను సవరించలేదు. ఈ మొత్తాన్ని వినియోగదార్లూ ధరల సూచీతో అనుసంధానించి ప్రతి శిశువుకు రోజుకు 8రూపాయల చొప్పున 6 నుంచి 72 నెలల వరకు, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు అయితే రోజుకు రూ.9 చొప్పున లెక్క కట్టాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఈ అదనపు కేటాయింపు, ద్రవ్యోల్బణ అంచనాలను సవరించడం సాధ్యమైతే ఇంటికి రేషన్ సరుకులు తీసుకెళ్లడంలో సంస్కరణలకు శుభారంభం చేసినట్టు అవుతుంది. అయితే రేషన్ సరుకుల సేకరణ ప్రభుత్వ సబ్సిడీ ధరల ప్రకారం అయితేనే ఇది సాధ్యం. మార్కెట్ నుంచి సరుకులు కొనాలంటే ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదు. పైగా ప్రత్యక్ష నగదు బదిలీకి కూడా బ్యాంకు శాఖలకు వెళ్లడానికి అదనంగా కొంత ఖర్చు అవుతుంది.

సమీకృత శిశు అభివృద్ధి పథకం కింద అనేక రాష్ట్రాలలో మూడు నుంచి ఆరు సంవత్సరాల బాలలకు వండిన ఆహారం అందిస్తున్నారు. ఎందుకంటే ఇది రేషన్ సరుకులు ఇంటికి తీసుకెళ్లడం కన్నా మేలు. కొన్ని రాష్ట్రాలు మహిళా మండలులు, స్వయం సహాయక బృందాల ద్వారా వికేంద్రీకృత పద్ధతిలో ఈ పథకం అమలు చేస్తున్నారు. కాని చాలా వ్యవస్థలు విపరీతంగా కేంద్రీకృతం అయి, అవినీతి మయం అయి ఉన్నాయి. సరుకులు పక్కదారి పట్టడంలో కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కు అవడం వల్లే అవినీతి పెరిగిపోతోందని తెలిసినందువల్ల 2004లో సుప్రీంకోర్టు ఐ.సి.డి.ఎస్. కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్లను నిషేధించింది. అయినా అనేక రాష్ట్రాలు ప్రైవేటు కాంట్రాక్టర్లను వినియోగించుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వ పంపిణీ విధానంలో లాగే ఐ.సి.డి.ఎస్. కింద ఆహార పదార్థాల సరఫరాపై రాజకీయ తోడ్పాటు, అధికారుల శ్రద్ధ అవసరం.

ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు పోషకాహార లోపంతో ఉన్న దేశం లో ఆహార పదార్థాల స్థానంలో నగదుఇవ్వడం అంటే అవసరమైన వారికి పోషకాహారం అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఐ.సి. డి.ఎస్. బాలల్లో పోషకాహార లోపం సరిదిద్దడమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలగజేస్తుంది. అంగన్‌వాడీలు పోషకాహారం గురించి సలహాలు అందజేస్తాయి. ఎదుగుదలను గమనిస్తుంటాయి. ప్రసవానికి ముందు వైద్య చికిత్సకు సహాయపడతాయి. టీకాలు ఇప్పిస్తాయి. జాతీయ పోషకాహార పథకం ప్రారంభించారు కనక అది దేశంలో పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి అనేక రంగాల ప్రమేయం కనిపిస్తుంది. అందుకని ఐ.సి.డి.ఎస్.లను పటిష్ఠం చేయడానికి అవకాశం ఉంది. నగదు ఇవ్వడం వల్ల పోషకాహారం అవసరం ఉన్న బాలలకు అది అందదు. భవిష్యత్తులో విధానాలు రూపొందించేటప్పుడు ఈ వాస్తవాన్ని గమనించాలి.
* (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)