Home జాతీయ వార్తలు ఎన్నికల సంఘంతో ముగిసిన ర‌జ‌త్ కుమార్‌ భేటీ

ఎన్నికల సంఘంతో ముగిసిన ర‌జ‌త్ కుమార్‌ భేటీ

EC CEO Rajat Kumar Meets CEC Over Telangana Early Elections

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ భేటీ ముగిసింది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోదన్నారు. ప్రస్తుత సమావేశం కేవలం ప్రాథమిక స్థాయిలోనే జరిగిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ కు రానున్నారు. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లపై చర్చించామని వెల్లడించారు. రేపు వచ్చే అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వాలో చర్చించామని తెలియజేశారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే తప్పనిసరిగా సవరిస్తామన్నారు. తెలంగాణలో ఎన్నికల కసరత్తు, సంసిద్ధత అంశాలను ఎన్నికల సంఘానికి వివరించామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా బృందం తెలంగాణలో పర్యటించిన అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. సుమారు 5గంటల పాటు కేంద్ర ఎన్నికల అధికారులతో రజత్ కుమార్ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.