Home తాజా వార్తలు ఓటెత్తని 13లక్షల మంది

ఓటెత్తని 13లక్షల మంది

EC to Publish Telangana Final Voters List Today

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత ఉండి ఓటు హక్కు నమోదు చేసుకోని వారి సంఖ్య అక్షరాల 13 లక్షల 67 వేల 39. ఈ లెక్క రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తుది జాబితా ప్రకటన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన సమగ్ర నివేదిక ప్రకారం తేలింది. రాష్ట్రంలో 2018 సంవత్సరానికి ఎంత జనాభా ఉంటుందో (ప్రొజెక్టెడ్ పాపులేషన్) అంచనాలతో కూడిన వివరాలను ఇసికి నివేదించారు. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం జానాభా 3.80 కోట్లు కాగా ఇందులో 18 ఏళ్ల పైబడిన వారు అంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ను నమోదు చేసుకునేందుకు అర్హులైన వారి సం ఖ్య 2.86 కోట్లుగా ఉంది. సిఇఒ ప్రకటించిన తుది జాబితా ప్రకారం 2.73 కోట్లమంది ఓటర్లు ఉన్నా రు. అంటే ఇంకా 13.67 లక్షల మంది ఓటర్లు అర్హత ఉండి ఓటును నమోదు చేసుకోలేదని స్పష్టమౌతోంది.

ఈ వివరాలపై రాష్ట్ర ఎన్నికల అధికారులను సంప్రదించగా పలు ఆసక్తిర విషయాలు వెల్లడయ్యాయి. వారి వివరాల ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఓటు హక్కు నమో దు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కొంత మంది ఓటు హక్కు పొందేందుకు ఇష్టంగా లేరని పేర్కొన్నారు. అలాంటి వారి సంఖ్య వేలల్లోనే ఉంటుందని అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం, అప్పటికే 2019 జనవరి 1 కటాప్ తేదీని మార్చుకుని మరో ప్రత్యేక సవరణ ముసాయిదా జాబితాను ప్రకటించారు. దీంతో కొత్త తరం ఓటర్లు కొన్ని లక్షలు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే వీటికి గడువు కూడా 15 రోజులు మాత్రమే ఇచ్చారు అదే సమయంలో వరుసగా వినాయక చవితి, మొహర్రం వంటి పండుగలు, సెలవులు వచ్చాయి. దీంతో చాలా మంది ప్రజలకు ఓటు హక్కు నమోదు, సవరణ కార్యక్రమం నడుస్తుందన్న విషయమే తెలియలేదు. ఈ ప్రక్రియలో కేవలం 16 లక్షల వరకే దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని, మిగతావన్ని సెప్టెంబర్ 9వ తేదీ కంటే ముందే వచ్చినవి ఉన్నాయని ఒక అధికారి వివరించారు. అంతా ఏదో హడావుడిగా ముగిసింది. నమోదు కార్యక్రమాలు నిర్వహించడంలో ఎన్నికల అధికారులు కూడా వైఫల్యం చెందారనే విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు కొందరు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకుందామని క్షేత్రస్థాయిలో బూత్‌స్థాయి అధికారిని కలుద్దామంటే వారు అందుబాటులో లేకపోవడం, అసలు బిఎల్‌ఒ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా తెలియక అనేక ఇబ్బందులు పడి చివరకు చేసేదేమి లేక ప్రయత్నాన్ని విరమించుకున్న వారు లేకపోలేదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చదువుకున్న వాళ్లు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుందామని వెళితే వెబ్ పోర్టల్ చాలా నెమ్మదిగా పనిచేయడం ఆప్లికేషన్‌లను పూర్తిస్థాయిలో తీసుకోకపోవడం కూడా మరొక కారణామనే విశ్లేషణలు వస్తున్నాయి. ఓటర్ల సంఖ్య ఎంత పెరిగితే, అంతే స్థాయిలో ఓటు హక్కు వినియోగం జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అయితే రాష్ట్రంలో మాత్రం చాలా మంది ప్రజలు అర్హత ఉండి, విషయం తెలియక ఓటు హక్కును నమోదు చేసుకోకపోవడం అనేది ఎన్నికల అధికారుల నిర్లక్షమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 13 లక్షల మంది అనేది చిన్న విషయం కాదని ఇటువంటి వాటిని రానున్న రోజుల్లో ఎన్నికల అధికారులు గమనంలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

EC to Publish Telangana Final Voters List Today

Telangana news