Home ఆఫ్ బీట్ సదువుకున్నోళ్లు లంగలా?

సదువుకున్నోళ్లు లంగలా?

తాతా! నీకు ఎదురైన అనుభవాలన్ని సేదుమే ఉన్నట్టున్నయిగని అందరు గట్లనే ఉంటరనుడు తప్పు. సదువుకున్నోల్లు ఎంతమంది మంచోల్లు లేరు? మనూల్లెనే సూడలెవ్వు. నీకు గప్పటి పట్వార్లు, పటేండ్ల కాలం నాటి సంగతులే బాగ నాటుకున్నట్టున్నయి.

Taatalu-Cheppina-Kathaluగిది సానేండ్ల కింద జరిగిన కత. గప్పున్నేను కన్నాగురెంల బి.యస్సీ సదువుతున్న. సెలవులకని ఇంటికచ్చిన. ఇంట్ల పొద్దువోత లేదు. ఉప్పుడువిండి టిఫిన్ జేసింది మా అవ్వ. గప్పుడు టిఫిన్లెక్కడియి. గయి నేను కన్నాగురంల సదువుకోవడ్తి. సదువుకున్న పొల్లగానికి ఇంతంత ఇంట్లగల్లది పల్లారం సెయ్యాన్నని నేనచ్చినప్పుడు సేసేది మా అవ్వ. గప్పుడు అటుకులన్న, పండుగయితె పూరీలు, ఇగో గీ ఉప్పుడువిండి జేసేటోల్లు. గీ ఉప్పుడువిండి ఎట్ల జేత్తరంటే గడుక ఇసురంగ ఎల్లిన పిండి ఉంటది గద. గదానితోని. గది కమ్మగానే అనిపిచ్చు. గీ ఉప్పుడువిండిని కోమట్లయితే రోజు తిందురు. ఎటువెయినా గిదే సద్దిగొంచవోదురు. మరిగిన నీళ్ళల్ల గీపిండేసి అండ్ల ఉప్పుకారం, ఉల్లాకు కొత్తిమీరాకు ఏసెటోల్లు. అయ్యో గిప్పటి ఉక్మన్నట్టు. గసోంటి ఉప్పుడువిండి, దంచినటుకులు, గంజుపిండి, కుముములు, పులిసిన కలితోని సేసినంబలి, సల్లబొట్టు, గుడాలు గివ్వే టిఫిన్లన్నట్టు. గవ్వితింటేనే ఎక్వ. మల్ల ఒక్క పూట గడ్క ఇంకోపూట మెతుకుల బువ్వ. గివ్వి దొరుకుతె గదే పదివేలన్నట్టుండె. రొండు పూటల మెతుకుల బువ్వ తినెటోల్లయితె తక్వనే ఉందురు. గా దొరలో దాతలో గాల్లే తిందురు. ఇగ గిప్పుడు గప్పుడే ఊల్లె సా దాగుడు గూడ అలువాటయింది. గా చాయచ్చి కొంచెం మంచిగనే సేసింది ఎందుకంటె పొద్దుగాల్లేత్తెనే కల్లు దాగెటోల్లు కొందరు. గీ చాయ దాగుటానికి అలువాటుపడ్డరు. మా నాయిన్న ఊళ్ళె కొంచెం పెద్దమనిషిగద. మల్ల నేను కాలేజీ సదువవడ్తి. గందుకే టిపిన్ ఉన్నా లేకున్నా సా తాగేటోల్లం. పెద్దపెద్ద గిలాసలల్ల లోటెడంత సా దాగుదురప్పుడు. మా నాయిన్నవకు సావోత్తె గింత ఉడుకుది తాగుతార్ర అని అండ్ల సెంబెడునీల్లు వోసుకోని తాగింది. గది జూసి మేం పక్కడపక్కడ నవ్వినం. గసోంటి కాలంల గీ కత జరిగింది. నేనుప్పుడువిండి తిని, సాబొట్టుదాగి కచ్చీరు మొకానవోతి. గక్కడ గద్దెమీద తంతెల బండలమీన కూసోని మస్తుమంది పరాశికాలాడుకుంట ముచ్చెట్లు వెట్టుకుందురు. శాత్రాలేసుకుంటరు. పొడుపుకతలు సేసుకుంటరు. శాత్రాలిప్పుకుంటరు. గమ్మతు గమ్మతుగ థిలిశాలు సేసుకుంటరు. ఇగ కతలు గూడ జెప్పుతరు. నేంబోయె వారకక్కడ సానమందే కూసున్నరు. నేంగూడబోయి కూసుంటి. గంతల్నే మచ్చయ్య తాత గూడచ్చె. గయినెకూసుండె. మాటమీద మాటచ్చె. ఎపో సదువుకున్నోల్లంత లంగలు పో అనె మచ్చెయ్య తాత. అరె నీయవ్వ మచ్చెయ్యతాత గిట్లనవట్టేంది అని పిచ్చెనాకు. మరినేంగూడ సదువుకుంటున్న గద. నేంగూడ లంగనేనే అని నాకు కోపమచ్చె. ఏంది తాత గట్లనవడ్తివి. సదువుకున్నోళ్లంత లంగలే అంటెట్ల? విద్యతోని వినయంబు కలుగు అన్నరు పెద్దోల్లు. విద్యకు సాటిధనంలేదన్నడు భర్తృహరి నువ్వు గిట్లంటవేంది ఎవ్వల గురించంటన్నవు నువ్వు అన్న నేను.
అదిగాదు పిలగా నీ అసోంటోల్ల గురించి కాదు నేననేది. కనిపోరగండ్లు సదువుకొనేం జేత్తండ్రు. నౌకర్లయినంక పెండ్లాలను సంకలేసుకొని ఆల్‌దెగ వోతండ్రు. అవ్వయ్యలను పట్టించుకుంటలేరు. గయినె ఒగయినె పట్నంల సదువుతండు గద! గయినెదగ్గెరికి తండ్రివోతె రుమాలు, చెవుల చుట్టతోనున్న తండ్రిని మా పాలేరని సెప్పిండట. ఆపీసులల్ల పన్జేసే పోరగాండ్లేం జేత్తండు. బేంకులోని కనిపోతే లంచాలకని తిప్పితిప్పి సంపుడు. మొసాలు జెయ్యవట్టిరి. ఇంక ఎన్నని జెప్పాలె. సదువుతోని తెలివి రావాలెగని లింగ తెలివత్తంది అన్నడు మచ్చయ్య. గదాన్నే సానమంది గక్కడున్నోల్లు బలపరిసిండ్రు. గిప్పుడు మనూల్లె సదువుకున్నోల్లు ఎక్కువయిండ్రు. మునుపంటె మీకాలంల గా పట్వారి, పోలీసు పటేలు, మాలి పటేలు గీల్లే సదువుకొన్రి. ఒక్కలిద్దరు దొరలు. మరి గాల్లందరు గూడ లంగలే నంటవా? అన్నడు విజేందర్‌రెడ్డి. విజ్జన్న నాకు జిగ్రీ దోస్త్. నన్ను అన్నిట్ల సమర్థిస్తడు.
అందరుంటరని కాదుగని నాకయితె ఎనుకటికెల్లి గూడ గిట్లనే సూత్తన్న. కొంచెమంత అక్షరపొడ అచ్చినోడు సదువురానోల్లను మోసం జేసెటోడు. అందుకే గిట్లంటన్న. గప్పుడు సదువుకున్నోల్ల లంగతనాలు ఓతీరుగుంటె గిప్పుడో తీరుగున్నయి అన్నమోలె తాత గా సంగతులు జెప్పలేవు. గా కత సెప్పు అన్నమోలె ఇగ సదువుకున్నోల్లెందుకు లంగలో ఎట్లనో సెప్పవట్టిండు మచ్చయ్య తాత.
గిప్పుడంటె కొంతమంది సదువుకుంటండ్రుగని మా కాలంల సదువుకున్నోల్లెవ్వలున్నరు బిడ్డ. ఊళ్ళె కారటు సదువచ్చినోల్లుంటె గదే ఎక్కువ. ముత్తెమంత అక్షరపొడ ఉన్నోల్లు గా పట్వారి, పోలీసు పటేలు, మాలిపటేలు గాల్లేనయిరి. ఊల్లేకేమన్న సర్కారు నుంచెమన్నత్తె గది సదివెటోల్లు గాల్లే. కారటచ్చినా గాల్లే. ఊళ్ళేదన్న సాటింపు జెయ్యన్నంటె పెద్ద మాదిగను పిల్సి డప్పుసాటింపు జేసెటోల్లు. తాడీలు గట్టన్నన్నా ఊళ్ళె నిజాం మనుషులచ్చినా, సర్కారు మనుషులచ్చినా డప్పుసాటింపు జేసెటోల్లు. మరి గాల్లు సదువచ్చినోల్లు గద. తాసీలు గడితె తీసుకునేది ఎక్కువయితె కాయిదం మీద రాసేది తక్వే నాయె. అందరు అంగూటి చాపులేనాయె. అప్పు కాయిదాలు రాసెటోల్లు వాళ్లే. వడ్డికి వడ్డీ లెక్కలు గట్టెటోల్లు వాళ్ళే. గండ్ల మస్తు మోసాలు జరిగేటియి. మల్ల గాల్లేది జెప్పుతే గదే నాయె. భూమి గొలిసెటోల్లు గాల్లే. ఎకవ్వలు తక్వలు పెడ్దురు. అయినోనికి ఆకుల్ల కానోనికి పేగుల్ల అన్నట్టు జేసెటోల్లు. ఎవ్వల భూమి ఎవ్వలకు రాత్తున్నరో తెలువక పోవు. మల్ల గాల్లే పంచాయితులు జేత్తురు. ఏది నాయమో, ఏదన్నాయమో గాల్లు జెప్పిందే నాయెం. గట్ల మస్తు మోసాలయ్యేటియి. గట్లముత్తెమంత రాతపూత లచ్చినోల్లు తాకీలు గటిట్నోల్ల బూములాగవట్టుకున్నరు. జబుదార్లయిండ్రు. ఏదో కొంత సదువుకున్నోల్లు సదువురానోల్లను తెలివికి తేవాలెగద. కని గా సదువును దోపుకానికే వాడుకున్నరు. అటెనుక కొంతమంది సదువుకోని పైరవి కార్లయిరి. తెల్లబట్టలేసుకొని తిరిగిరి. మరి గీల్లన్న మంచిగున్నరా అంటె మోసం జేసెటోల్లే ఎక్కువ. గిట్ట సదువుకున్నయినె ఒగయినె సర్పంచయిండు. గయినె ఎల్‌ఎమ్‌బి లోన్లిప్పిత్తనని బేంకులోండ్లిప్పిత్తనని సానమందిని మోసం జేసిండు. బేంకు మేనేజర్ దగ్గరికి పోయి రైతులకు లోన్లియ్యన్నంటె సర్పంచినో, పట్వారినో పట్టుకరమ్మని సెప్పమనె. గా బేంకు మేనేజరు మంచోడయి ఇత్తనన్నా ఇయ్యనియ్యక గీల్లతోని పోతేనే లోన్లు వత్తయన్నట్టు జేసె. గీల్లు దానికి గింత ఖర్సు, గంత ఖర్సని మస్తు కమీషన్లు గొట్టిరి. గవ్వన్ని కలుపుకుంటె ఊళ్ళె షావుకారప్పు మిత్తి కంటె ఎక్వనే ఆయె. ఇగేం జేసుడు సెప్పు. గిది గాల్లు జేసే పని. ఒగయినె గొల్లోల్లకు గొర్లనిప్పత్తనని పైరవి జేసిండు. పాపం ఎడ్డిగొల్లోల్లు అయినెను నమ్మిండ్రు. ఎక్కడ ఒత్తుమంటె అక్కడ ఏలిముద్ర లేసిండ్రు. ఇరువైమంది పేరుమీద లోన్లచ్చినయి. గా పైసలన్నివట్టుకొని సెంగోబిల్లన్నడు. బొంబైకో ఎక్కడికో పెయిండు. గొల్లోల్ల మీన బాకీలు పడ్డయి. గాల్లకు నోటీసులచ్చినయి. గాల్లు బాకీలు గట్టవలసచ్చినయి. పైసలు దొబ్బిందేమొ గా సదువుకున్న లఫంగి గాడు. బాకీలు గట్టిందేమొ గొల్లోల్లు. గిట్టుంటయి కతలు. మరి సదువుకొని నౌకర్లు జేసినోల్లు మాత్తురమేం తక్వ ఉన్నరు. ఆపీసులల్ల ఎడ్డోల్లను, సదువుకోనోల్లను ఎన్ని తిప్పలు వెడ్తరు? ఎంత గోసపెడ్తరు. సుట్టు తిప్పించుకుంటరు. సదువుకున్నోల్లు నౌకరయినంక పెండ్లాన్ని పట్టుకొని ఆల్దెగవెయిరి. ఇగ నాయమేడుంది? అవ్వయ్యలను ఎవ్వలు జూడాలె. గిట్లున్నయి సదువుల సంగతి. సదువుకున్నోల్ల సంగతి. గందుకే సదువుకున్నోల్లు లంగలంటరు నాఅసోంటి ముసలోల్లు అని కత జెప్పుడాపిండు మచ్చెయ్య.
తాతా! నీకు ఎదురైన అనుభవాలన్ని సేదుమే ఉన్నట్టున్నయిగని అందరు గట్లనే ఉంటరనుడు తప్పు. సదువుకున్నోల్లు ఎంతమంది మంచోల్లు లేరు? మనూల్లెనే సూడలెవ్వు. నీకు గప్పటి పట్వార్లు, పటేండ్ల కాలం నాటి సంగతులే బాగ నాటుకున్నట్టున్నయి. గాల్లు పెయిండ్రు గద! సరెగని మరి సదువద్దంటవా? సదువుతె లంగలు గావట్రి అనడిగిండు విజేందర్‌రెడ్డి.
నేను గట్లెందుకంట. సదువుతోనే తెలివి. లోకం తెలుత్తది. సదువుకున్నోల్లకు నాలుగు కండ్లంటరు. ఇంక రొండు జ్ఞాననేత్రాలు. గందుకే నా మనువలను మస్తు సదివిత్తున్న. సదువుకున్నోల్లు లంగలు కావద్దనే గీ కత జెప్పిన. విద్యతోని వినయం గలుగాలె అన్నడు తాత. అవుతాత అన్ననేను.

డా ॥కాలువ మల్లయ్య
98493 77578