Home తాజా వార్తలు సర్కార్ బడి తల్లిదండ్రులు ఎగబడి

సర్కార్ బడి తల్లిదండ్రులు ఎగబడి

raj-bhawan-school

మనతెలంగాణ/సోమాజిగూడ : ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు చూసే తల్లిదండ్రులు ఓ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు ఎగబడ్డారు. అదేమన్నా కార్పొరేట్ కళాశాలనా…! కాదు ప్రభుత్వం నిర్మించిన ప్రభు త్వ పాఠశాల. శుక్రవారం వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలని పాఠశాలలో చేర్పించుకోవాలని పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు అదే పాఠశాలో సీట్లు కావాలంటూ పట్టుబట్టారు. ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలో సీట్లు భర్తీ అయ్యాయని ప్రధానోపాధ్యాయుడు చెప్పినా వినలేదు. పాఠశాల నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఇంతకీ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేస్తున్న పాఠశాల..అదే మన రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల. ఇప్పటికే 1200 మంది విద్యార్థ్దులతో కొనసాగుతున్న ఈ పాఠశాలలో కొత్త విద్యార్థ్దులు చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సకల సదుపాయాలు సమకూరిస్తే చదివేందుకు విద్యార్థ్దులు మొగ్గు చూపుతారనేదానికి తార్కాణమే మన రాజ్‌భవన్ పాఠశాల.
ఆరు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పాఠశాల : రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల గత ఆరు దశాబ్దాల నుంచి పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన పలువురు విద్యార్థ్దులు వైద్యులు, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. అంతటి చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి ప్రస్తుతం ఢిల్లీలో ఐఎఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తుండటం విశేషం. ఈ పాఠశాలలో నాటి నుంచి నేటి వరకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.
కార్పొరేట్ కళాశాలకు ధీటుగా రాజ్‌భవన్ పాఠశాల : శిథిలావస్థలో ఉన్న రాజ్‌భవన్ పాఠశాలను ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చొరవతో దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల ఖర్చుతో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులను నిర్మించారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థ్దుల కోసం 30 గదులను ఇందులో నిర్మించారు. ప్లే గ్రౌండ్‌తో పాటు మినరల్ వాటర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
డిజిటల్ లైబ్రేరీలతో కంప్యూటర్ విద్యా బోధన : రాజ్‌భవన్ ప్రభత్వ పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు విద్యను అందించేందుకు సైయెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో 40 కంప్యూటర్లతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. మరో 15 కంప్యూటర్లతో ఈ లైబ్రేరీని ఏర్పాటు చేశారు. వీటి ద్యారా పాఠశాల విద్యార్థులకు ఈజీగా డిజిటల్ విద్యతోపాటు కంప్యూటర్ బోధన చేస్తున్నారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థ్దులు మంచి ఫలితాలను సాదించారు.
పాఠశాలలో విద్యార్థ్దులకు అన్నీ ఉచిత సౌకర్యాలే : పాఠశాలలో చేరే విద్యార్థులకు యూనిఫామ్, టెక్ట్, నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నారు. వీటితో పాటు విద్యా ర్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి తన ట్రస్ట్ ద్వారా పిల్లలకు సైకిల్స్, స్కూల్ బ్యాగు, షూష్‌లను అందిస్తుండటంతో విద్యార్థులు ఎంతో సంతోషంగా రాజ్‌భవన్ పాఠశాలలో చదివేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి పూర్తైన సీట్లు : డిప్యూటీ ఇఒ
అన్ని హంగులతో గత జూన్ 14న గవర్నర్ చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభిం చినట్లు ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ ఈఓ, పాఠశాల ప్రధానోపాథ్యాయుడు సామ్యేల్ రాజ్ తెలిపారు. పాఠశాలలో మొత్తం ప్రతి తరగతిలో మూడు సెక్షన్లలో 1200పైగా విద్యార్థులు చేరారని తెలిపారు. ఈ సంవత్సరం సీట్ల కోసం విద్యార్థ్దుల తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని, ఈ విద్యా సంవత్సరానికి సీట్లు పూర్త్తి అయినట్లు తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా రాజ్‌భవన్ పాఠశాలలో విద్యను అందిస్తుండటంతో విద్యార్థ్దుల తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలిపారు.