Home సినిమా డబ్బున్న వాళ్లకే విద్య, వైద్యం

డబ్బున్న వాళ్లకే విద్య, వైద్యం

Mera-bharat-Mahaanప్రత ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో వరంగల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా.పల్లవి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మేరా భారత్ మహాన్’. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తిక్, ప్రియాంక శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్‌కాపీ సిద్ధమైన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి సీడీని వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను కూడా ఒక అద్భుతమైన పాత్ర చేశాను. భరత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. పాటలు, ట్రైలర్లు చూశాక సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకముంది”అని అన్నారు. దర్శకుడు భరత్ మాట్లాడుతూ “ఏ సమస్య పరిష్కారమైనా మన చేతుల్లోనే ఉంది. మొదట వినేలా చెప్పాలి… వినకుంటే చెంప చెళ్లుమనిపించి అయినా చెప్పాలి అనేది మా చిత్ర కథాంశం. విద్య, వైద్యం సామాన్యునికి అందడం లేదు. డబ్బున్న వాళ్లకే సరైన విద్య, వైద్యం అందుతున్నాయి. మరి లేని వారి పరిస్థితి ఏంటి? వ్యవస్థలో ఉన్న కొన్ని సమస్యలే దీనికి కారణం. వాటిని సవరించాలి అని చెప్పే ప్రయత్నమే తప్ప ఎవరికీ వ్యతిరేకంగా సినిమా ఉండదు”అని తెలిపారు. హీరో అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ “భరత్‌తో పనిచేశాక తెలుగు పరిశ్రమకు ఆయన మరో శంకర్‌లా అనిపించారు. ఈ సినిమా చేయడం గొప్ప అనుభూతినిచ్చింది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా.తాళ్ల రవి, పల్లవి రెడ్డి, పెద్దాడమూర్తి, డా.శ్రీధర్ రాజ్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.