Home సంగారెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు..సరఫరా మరిచారు

విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు..సరఫరా మరిచారు

Eectric sub station opening but power supply forget

మన తెలంగాణ/ఝరాసంగం : “అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని” అన్న చందంగా తయారయిం ది అన్నదాతల పరిస్థితి. విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించి మూడు మాసాలు అయిపో వస్తున్నా నేటికి రైతులకు విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న సంఘటన ఇది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే మండలంలోని జీర్లపల్లి గ్రామంలో 184.61 లక్షల టి ఆండ్ డి నిధులతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించారు. గ్రామంలో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా మండలంలోని జీర్లపల్లి, బోరేగాం, జొనగాం, గుంతమర్పల్లి, ఇస్లాంపూర్ గ్రామాలకు విద్యుత్‌ను సరఫరా చేయాలని సంకల్పించి స్టేషను నిర్మించారు. 21 ఫిబ్రవరి 2018న రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. మండలంలో ఈ పాటికే మండల కేంద్రమైన ఝరాసంగం, మండలంలోని మాచ్నూర్, చీలెపల్లి గ్రామాల శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ల నుంచి మండల రైతులకు విద్యుత్ సరఫరా అవుతోంది. విద్యుత్ లో-ఓల్టేజి నెలకొనడంతో మండల ప్రజల వినతి మేరకు మండలంలోని జీర్లపల్లి గ్రామంలో మరో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించి మం డలంలో లో-ఓల్టేజి సమస్య తీర్చాలని నిర్ణయించి అనుకున్నట్లే గ్రామంలో స్టేషన్ నిర్మించి ప్రారంభించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభానికి నోచుకున్నా రైతులకు మాత్రం విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారని చెప్పవచ్చు.
సబ్‌స్టేషన్ అంటే సంబరపడ్డాం : యువ రైతు పద్మశాలి శ్రీనివాస్
లో-ఓల్టేజి సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో జీర్లపల్లి గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించి ప్రారంభించడంతో సంబర పడ్డామని యువ రైతు పద్మశాలి శ్రీనివాస్ అన్నారు. గత మూడు నెలలుగా ఇదిగో విద్యుత్, అదిగో విద్యుత్ అంటూ సంబంధిత అధికారులు రైతులకు మాయమాటలు చెప్పడంలోనే సరిపోతున్నదని, విద్యుత్ సరఫరాను మాత్రం చేయడం లేదని రైతు విచారం వ్యక్తం చేశాడు. విద్యుత్ సరఫరాకు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు పూర్తికానందునే విద్యుత్‌ను సరఫరా చేయడం లేదని ఆ శాఖ అధికారులే గుసగుసలాడుకుంటున్నారని, పనులు పూర్తి కానిదే ఎందుకు ప్రారంభించారని, ఇది రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నాడు.
 సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయండి : రైతు మహ్మద్ అనీఫ్
మండలంలోని జీర్లపల్లి గ్రామంలో నిర్మించి ప్రారంభించిన విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ఆయా గ్రామాల రైతులకు వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని జీర్లపల్లి రైతు మహ్మద్ అనీష్ డిమాండ్ చేస్తున్నాడు. సబ్‌స్టేషన్ ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా విద్యుత్ సరఫరా కాకపోవడానికి కారణం ఆ శాఖ అధికారులా, విద్యుత్ సబ్ స్టేషన్ కాంట్రాక్లరా, పాలకులే ఉద్దేశపూర్వకంగా సరఫరా చేయరాదని అధికారులను ఆదేశించారా అని రైతు మధనపడుతున్నాడు. గ్రామంలో నిర్మించి ప్రారంభించిన విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతు మహ్మద్ అనీఫ్ వినతి చేస్తున్నాడు.