Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

టోకు ద్రవ్యోల్బణానికి చమురు ఎఫెక్ట్

bs

 జూన్‌లో 5.77 శాతం నమోదు
 నాలుగేళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం సూచీ

న్యూఢిల్లీ : జూన్‌లో టోకు ధరల సూచి(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. కూరగాయలు ప్రియం కావడం, ఇంధన ధరల పెరుగుదలతో గత నెలలో 5.77 శాతం నమోదైంది. ఇది మే నెలలో 4.43 శాతంగానే ఉంది. గతేడాది జూన్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 0.99 శాతంగానే ఉండడం గమనార్హం. జూన్‌లో పెరిగిన ద్రవ్యోల్యణం కారణంగా ఆగస్ట్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం(సిఎస్‌ఒ) ఈ వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఆహార పదార్థాల్లో ద్రవ్యోల్బణం జూన్‌లో స్వల్పంగా 1.80 శాతానికి పెరగ్గా, అంతకుముందు మే నెలలో 1.60 శాతంగా ఉంది. కూరగాయల్లో ద్రవ్యోల్బణం జూన్‌లో భారీగా పెరిగింది. ఇది 8.12 శాతం కాగా, మే నెలలో 2.51 శాతంగానే ఉంది. ఇంధనం, విద్యుత్ విషయానికొస్తే ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల గత నెలలో దేశీయంగా పెట్రోలు, డీజిల్ పెరుగుతూ వచ్చాయి. ఇంధనం, విద్యుత్‌లో ద్రవ్యోల్బణం మేలో 11.22 శాతం నుంచి జూన్‌లో ఒక్కసారిగా 16.18 శాతానికి పెరిగింది. బంగాళాదుంప ద్రవ్యోల్బణం 81.93 శాతం నుంచి 99.02 శాతానికి పెరిగింది. ఉల్లి ద్రవ్యోల్బణం 13.20 శాతంతో పోలిస్తే 18.25 శాతానికి పెరిగింది. జూన్‌లో పప్పు ధాన్యాల్లో మైనస్ ద్రవ్యోల్బణం 20.23 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నెలకు గాను డబ్లుపిఐ ద్రవ్యోల్బణాన్ని 3.18 శాతం నుంచి 3.62 శాతంగా అంచనా వేశారు. గతవారం విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంతో 5 నెలల గరిష్ఠానికి చేరింది. ఇంధన ధరలు ప్రియం కావడమే రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమైంది. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ద్రవ్యపరపతి సమీక్షలో ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రమాణికంగా తీసుకుంటుంది. పెరిగిన ద్రవ్యోల్బణ గణాంకాలను చూస్తే ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బ్‌ఐ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను అక్టోబర్‌మార్చి 4.7 శాతంగా అంచనా వేయగా, అంతకుముందు 4.4 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బిఐ రెపో రేటును 0.25 శాతం మేరకు పెంచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌బిఐ ఈ వడ్డీ రేట్లను పెంచడం విశేషం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో అదే సమయంలో దేశీయంగా ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గుచూపుతోంది. ఏప్రిల్ నెలలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌రు 66 డాలర్లు ఉండగా.. ఇప్పుడు అది 74 డాలర్లకు పెరిగింది. దీంతో పెట్రో, డీజిల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. జూలై 30 నుంచి ఆగస్టు 1 మధ్య ఆర్‌బిఐ సమీక్ష ఉంటుంది. ఈ సమయంలో ప్యానెల్ సభ్యులు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటారు.

Comments

comments