Home ఎడిటోరియల్ గుడ్డులేని బడి భోజనం!

గుడ్డులేని బడి భోజనం!

edtసండే హో యా మండే రోజ్ ఖావో అండే… ఈ ప్రకటన చాలా మంది వినే ఉంటారు. విని విని బోరు కొట్టించిన ప్రకటన ఇది. ది నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన ప్రకటన ఇది. చాలా కాలం ఈ ప్రకటన టివిలో కనిపించింది. ఈ ప్రకటన ముఖ్యోద్దేశ్యం ఒక్కటే. ఆరోగ్యానికి గుడ్లు చాలా మంచివి. వాటిని రోజు తినాలి. కాని భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఈ ఆరోగ్యసూత్రం పనిచేయదు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి గమనిస్తే బిజెపికి కోడిగుడ్లకు మధ్య వైరం ఉన్నట్లనిపిస్తుంది.ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం, బిజెపి అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లోని 14 రాష్ట్రాల అంగన్ వాడీలలోను, స్కూళ్ళలోను పిల్లలకు కోడిగుడ్లు ఇవ్వడం లేదు.
ఆహార హక్కు ఉద్యమ కార్యకర్త, రిసెర్చ్ స్కాలర్ స్వాతీ నారాయణ్ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్కూళ్ళలోను, అంగన్ వాడీల్లోను కోడిగుడ్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారో వివరాలు సేకరించారు. మీడియా రిపోర్టులు, ప్రభుత్వ సమాచారం ఆధారంగా ఈ వివరాలు సేకరించారు. ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం మూడు ముఖ్యమైన విషయాలు మన ముందుకు వస్తున్నాయి. భారతదేశంలో పోషకాషార లోపం ఉన్న 10 రాష్ట్రాల్లో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే పిల్లలకు ఆహారంలో కోడిగుడ్లను ఇస్తున్నారు. ఆ రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, కర్నాటక. బిజెపి అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే పిల్లలకు ఆహారంలో కోడిగుడ్లు ఇస్తున్నారు. కొన్ని బిజెపి యేతర రాష్ట్రాల్లోను పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు ఇవ్వడం లేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో శాకాహార పట్టింపు కారణంగా బహుశా కోడిగుడ్లను నిరాకరిస్తున్నారు.
ఇప్పుడు ఆలోచించవలసిన విషయమేమంటే, బిజెపి శాకాహార ఎజెండాను అమలు చేస్తుందా? ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో చిత్రం శాకాహారం చాలా ఆరోగ్యకరమని చెబుతుంది. ఆ చిత్రంలో లావుగా అనారోగ్యకరంగా ఉన్న చిత్రంలో జంక్ ఫుడ్, మాంసాహారం వేసి, చక్కగా స్లిమ్ గా ఆరోగ్యకరంగా ఉన్న చిత్రంలో శాకాహారానికి చెందిన పండ్లు కూరగాయలు వేసి మాంసాహారం అనారోగ్యకరం, శాకాహారం ఆరోగ్యకరమన్న ప్రచారాన్ని ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్వయంగా గత ఏప్రిల్ లో చేసింది. కాని ఈ శాకాహారం కోసం ఇంత పట్టింపు ఎందుకు. భారతదేశంలో శాకాహారోద్యమం ఎందుకు? దేశంలో ప్రజలు చాలా మంది మాంసాహారులు. 2014లో ఆఫీస్ ఆఫ్ ది రిజిష్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ప్రచురించిన సర్వే ఫలితాల ప్రకారం 15 సంవత్సరాలకు పైబడిన భారతీయుల్లో 71 శాతం మంది మాంసాహారులు.
సామాజిక కార్యకర్త సూర్యకాంత్ వాఘ్మారే చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో శాకాహారం అనేది హిందువుల్లోనే మైనారిటీల ఒక నైతిక అధికార సాధనంగా కొనసాగుతోంది. మెజారిటీ హిందువులు, మాంసాహారులైనా ఈ నైతిక ఆధిక్యతను అంగీకరిస్తున్నారు. ఇది సామాజికంగా చోటు చేసుకున్న కొత్త ధోరణి. ఆధునిక కులవిశ్వాసాల్లో ఇది కొత్త ధోరణి. శాకాహారం ఒక ఆకర్షణీయమైన అంశంగానూ, అది చాలా స్వచ్ఛమైనదిగాను అందరి ఆమోదం పొందే వాతావరణం నెలకొంది.
న్యూట్రిషనిస్ట్ కవితా దేవగన్ ఆకుకూరలు ఎక్కువగా తినాలని చెబుతారు. అయితే కేవలం శాకాహారం వల్ల ఐరన్ దొరకడం కష్టం. మాంసాహారం వల్లనే అది తేలిగ్గా లభిస్తుంది. నిజానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆరోగ్యానికి సంబంధించి తప్పు సమాచారాన్ని ప్రచారంలో పెట్టింది. శాకాహారం అన్నది అంగన్ వాడీలు, స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించి అంత మంచి ఆలోచన కాదు. పబ్లిక్ హెల్త్ న్యూట్రీషనిస్ట్ మానసీ పాటిల్ చెప్పిన దాని ప్రకారం పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి కోడిగుడ్లు ఎంతో కీలకమైనవి. ఎందుకంటే వైజ్ఞానిక పరిశోధనల ప్రకారం జంతు ఆధారిత ప్రొటీన్లు, వృక్ష ఆధారిత ప్రోటీన్ల కన్నా మేలైనవి. గుడ్లలో ఎన్నో పోషకపదార్థాలున్నాయి. విటమిన్ బి2, విటమిన్ డి, బి6, బి12 మాత్రమే కాదు జింక్, ఐరన్, కాపర్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. గుడ్ల సొనలో అధిక కేలరీలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. కొలెస్టరాల్, కొవ్వులో కరిగే విటమిన్లు కె, డి, ఇ, కె వగైరా అందులో ఉన్నాయి. అంతేకాదు లేసితిన్ కూడా లభిస్తుంది. కాని కోడిగుడ్ల పట్ల వ్యతిరేకతకు హిందూత్వ శాకాహార ఎజెండాతో పాటు మరో కారణం కూడా ఉండొచ్చు. అది ధరకు సంబంధించినది. రిపోర్టుల ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో కోడిగుడ్లు ఖరీదైనవి. అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ కోడిగుడ్ల ధరలను పెంచేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2018- 19 ఉచిత మధ్యాహ్న భోజన పథకంలో ఆకుపచ్చని ఆకుకూరలు, పండ్లు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి కనీస ధరకు దొరుకుతాయి. భోజనంలో ఇవి ముఖ్యంగా ఉంటాయి. కాని కోడిగుడ్లు అందుబాటులో లేవు. పైగా ధర కూడా ఎక్కువ. కేంద్ర ప్రభుత్వంలో హెల్త్ సెక్రటరీగా పనిచేసిన సుజాతారావు కూడా మధ్యాహ్న భోజనంలో పిల్లలకు కోడిగుడ్లు ఇవ్వాలంటే ధర పెద్ద సమస్య అవుతుందని అన్నారు. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పోషకాహార విలువలు ఉన్న కోడిగుడ్లు ఇవ్వకపోడానికి కారణం ధరలు ఎక్కువగా ఉండడమో లేక శాకాహార ఎజెండానో ఏదైనా గాని బాలల పోషకాహార లోపాన్ని నివారించడానికి మాత్రం ఎవరు ఆలోచించడం లేదు.

* పథీకృత్ సన్యాల్  (డైలీ ఓ)