Home భద్రాద్రి కొత్తగూడెం ఒడిస్సా బోర్డర్‌లో నెత్తుటి బాకీ

ఒడిస్సా బోర్డర్‌లో నెత్తుటి బాకీ

పేలుడు ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య
మరొకరి పరిస్థితి అత్యంత విషమం
విశాఖ 7 హిల్స్‌లో క్షతగాత్రులకు చికిత్సలు
సరిహద్ద్దుల్లో కూంబింగ్ ముమ్మరం

Bomb-Blast

భద్రాచలం: ఆంధ్రా – ఒడిస్సా బోర్డర్‌లో బుధవారం మావోలు పోలీసులు వెళ్తున్న వాహనాన్ని మందుపాతరపెట్టి పేల్చిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఆ సంఘటనా స్థలంలోనే ఒడిస్సా సెక్యూరిటీ బోర్డర్ పోలీస్‌లు ఆరుగురు పోలీసులు చనిపోగా బుధవారం అర్థరాత్రి మరో ఇద్దరు విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలు వదిలారు. దీంతో మందు పాతర పేలిన ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. మొత్తం 13 మందిలో 8 మంది చనిపోగా ఐదుగురు విశాఖలోని 7 హిల్స్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతుండగా వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రా -ఒడిస్సా సరిహద్దుల్లో ఒడిస్సా రాష్టానికి చెందిన పోలీసులు 12 మంది పోలీసులు ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపూట్ జిలా హెడ్ క్వార్టర్ నుండి కటక్ జిల్లాకు వెళుతున్నారు. మోగర్‌గామా గ్రామా పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టంగి జిల్లా కోరాపూట్ సుంకీ – కోలార్ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. అతి బలమైన ఐఇడి బాంబును పేల్చడంతో పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు ఒక్క సారిగా పేలుడు ధాటికి 20 అడుగులకుపైగా ఎగిరి సమీపంలోని 40 అడుగుల లోయలో పడిపోయింది.

రహదారిపై సుమారు 10 అడుగులకుపైగా గొయ్యి పడింది. ఈఘటనలో మొదట ఆరుగురు, అదే రోజు అర్థరాత్రి మరో ఇద్దరు మృతి చెందారు. కాగా క్షతగాత్రుల ను విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. మరింత మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని 7 హీల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. అత్యంత విషమంగా ఉన్న ఓ పోలీస్‌కు బ్రెయిన్‌కు ఆపరేషన్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా 7 హీల్స్ ఆస్పత్రికి ఆంధ్రప్రదేశ్ విద్యా, మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎస్పి రాహుల్ దేవ్ శర్మ, డిఐజి చిరువోలు శ్రీకాంత్, ఒడిస్సా రాష్ట్ర అడిషనల్ ఎస్పి పివిఆర్ రావు చేరుకుని వైద్యులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

ప్రతీకారేచ్ఛతోనే…

మావోయిస్టులు నెత్తుటి బాకీ తీర్చుకునేందుకు తెగబడ్డారు. గత ఏడాది అక్టోబర్ 24వ తేదిన ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దుల్లో జరుగుతున్న మావోయిస్టుల ప్లీనరీని అత్యంత చాకచక్యంగా చుట్టుముట్టిన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే తప్పించుకోగా, ఆయన కుమారుడు మున్నా, అత్యంత సన్నిహితులు హతమయ్యారు. కాటఫ్ ఏరియాగా పిలువబడే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకోవడం మింగుడుపడని మావోయిస్టులు ప్రతికారం తీర్చుకుంటామని ఆ రోజుల్లో హెచ్చరికలు సైతం జారీ చేశారు.

గాయాలపాలైన ఆర్కే ఆ ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు అనుమానించిన పోలీసులు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సహచరులను పోగొట్టుకున్న మావోయిస్టులు పోలీసులను మట్టు పెట్టేందుకు మూడు నెలల పాటు ఎదురు చూసి అత్యంత చాకచక్యంగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి నెత్తుటి బాకీ చెల్లించినట్లు పలువురు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బాంబు ఇప్పుడు పెట్టిందా, గతంలో పెట్టిన బాంబు ప్రమాదవశాత్తు ఇప్పుడు పేలిందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనకు తామే బాధ్యులం అంటూ మావోయిస్టులుసైతం ఎలాంటి లేఖలు విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏఓబిలో ఎన్ కౌంటర్ అనంతరం పట్టుకోల్పోయిందనుకున్న మావోయిస్టు పార్టీ తాజాగా విరుచుకు పడటంతో అటు ఒడిస్సా, ఇటు ఏపి పోలీసులకు సైతం మింగుడు పడటం లేదు. ఈ ఘటనతో మళ్లీ ఏఓబితో పాటు ఛతీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఆయా గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సుంకీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అంతా ఉళ్లిక్కి పడ్డారు. ఆంధ్రా-ఒడిస్సా- ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు.