Home తాజా వార్తలు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు…

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు…

elections commissioner rajath kumar press meet

హైదరాబాద్: ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలో రజత్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిందని చెప్పారు. నిబంధనల ఉల్లంఘన కిందికి వచ్చే అంశాలేంటో  ఇసి వెల్లడించింది. సర్కార్ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని ఆదేశించారు. 24 గంటల్లో రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని చెప్పారు. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి, గోడలకు పోస్టర్లు అతికించాలని సూచించారు.

అనుమతి లేకుంటే 72 గంటల్లో వాటిని తొలగించాలన్నారు. ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదని చెప్పారు. ప్రతి జిల్లాలో, సిఇఒ కార్యాలయంలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 7న 119 స్థానాలకు ఒకే సారి పోలింగ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 11న కౌంటింగ్ ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కొరకు 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. ఫిర్యాదులన్నింటిని ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. కొనసాగుతున్న పనుల వివరాలు 72 గంటల్లో కలెక్టర్లు, ఎన్నికల సంఘానికి తెలపాలని రజత్ కుమార్ ఆదేశించారు. ఇక కొత్త పనులు ప్రారంభించరాదని ఆయన ఆదేశించారు.