Home తాజా వార్తలు విపక్షానికి ఊహించని దెబ్బ

విపక్షానికి ఊహించని దెబ్బ

elections war in telangana

పొత్తులపై లేని స్పష్టత
అన్నింటిలోనూ టిఆర్‌ఎస్‌దే ముందంజ
105 మంది అభ్యర్థుల ప్రకటనతో మిగతా పార్టీలకు షాక్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల వేడి రాజుకుంది. కెసిఆర్ ప్రతిపక్షాలకు ఊహించని విధంగా దెబ్బకొట్టారు. అసెంబ్లీ రద్దుతో పాటు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా ఎన్నికల కదనరంగంలోకి దూకారు. ముందస్తుకు సై అంటూ ప్రజలు ఇచ్చిన తీర్పును కెసిఆర్ వమ్ము చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తే, వాటిని సమర్థవంతంగా కెసిఆర్ తిప్పికొడుతూ ఎన్నికల బరిలోకి రండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామం టూ, నాలుగు సంవత్సరాల కాలంలో టిఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలే తమకు శ్రీరామరక్షగా ఆయన వారికి చురకలంటిస్తున్నారు. శుక్రవారం ఎన్నికల మొట్టమొదటి సభను నిర్వహిస్తున్నాం.. ఇక నుంచి ప్రతి రోజు రెండు సభల్లో పాల్గొంటానని కెసిఆర్ ప్రకటించడంతో అభ్యర్థులు కూడా అం దుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా ఉత్సాహంగా తమ నియోజకవర్గాలకు బయలుదేరి వెళ్లారు. ఈసారి 35 మందిని మార్చే అవకాశముందన్న వార్తలను ఊహాజనితమేనని తేలింది. 105 స్థానాల్లో సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని రోజులుగా వారు పడిన టెన్షన్‌ను మరిచిపోయి మరోసారి ఎన్నికల్లో గెలుపుకోసం కంకణబద్ధులై తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు.

అసెంబ్లీ రద్దు చేస్తారని ముందే ప్రతిపక్షాలు ఊహించినా అభ్యర్థుల విషయమై కొంత సమయం తీసుకుంటారని వారు నింపాదిగా ఉన్నారు. గురువారం కెసిఆర్ చేసిన ప్రకటనతో వారంతా అవాక్కయ్యారు. ఇంతవరకు వారు ఎవరూ ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ అభ్యర్థికి న్యాయం చేయాలి, సొంత గూటికి వచ్చిన పాత కాపులకు సీట్లను ఎలా కేటాయించాలన్న విషయంలో వారు సందిగ్ధంలో ఉండగా ఏకంగా కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించడం వారికి మింగుడుపడని విషయంగానే చెప్పవచ్చు. ఎంతసేపు కెసిఆర్ తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది. అభ్యర్థుల ఎంపికను పక్కనబెట్టి సిఎం అభ్యర్థి ఎవరూ అన్న విషయంపైనే వారు చర్చించుకుంటున్నారు. అసలు గెలుస్తామా లేదా అన్న విషయం ఆలోచించకుండా సిఎం ఎవరూ అన్న విషయమై చర్చ జరపడం విడ్డూరంగా ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. టిడిపితో కాంగ్రెస్ పొత్తు విషయమై ఇప్పటికే సీనియర్ నాయకులు అధిష్టానానికి వద్దని విన్నవించినట్టు సమాచారం. ఇలాంటి సమయంలో పొత్తుల కోసమే సమయం తీసుకుంటే అభ్యర్థుల ఖరారు తదితర విషయమై మరింత సమయం పట్టవచ్చని దీంతో టిఆర్‌ఎస్ అప్పటికే ఎన్నికల బరిలో ముందుకు దూసుకుపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బిజేపి విషయాని కొస్తే ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అసలు బిజేపి రాష్ట్రంలో ఉన్న క్యాడర్ ఎంత అన్న విషయాలను లెక్కలు వేసుకునే పరిస్థితుల్లోనే ఉంది. ఇలాంటి సమయంలో అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా చాలా సమయం పట్టవచ్చని సమాచారం.

మొత్తంగా చూసుకుంటే అన్ని విషయాల్లోనూ టిఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఇక చిన్న పార్టీల విషయం ఏమీ చెప్పలేమని ఆ పార్టీలు ఏదో పార్టీతో పొత్తుకు సై అనాల్సిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకటి అరా సీట్లతో కాలం వెళ్లదీసే పరిస్థితి ఉందని అంతకుమించి వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదన్నది వాస్తవమని విశ్లేషకుల భావన. చివరకు పొత్తులు, ఎత్తులు, జిత్తుల్లో ఎవరిది పైచేయి అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఎన్నికల్లో వారు వేసే ఓటు తేలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న దానిని బట్టి చూస్తే ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌దే పై చేయిగా వారు అభివర్ణిస్తున్నారు.