Home తాజా వార్తలు ఏర్పాట్లు చకచక

ఏర్పాట్లు చకచక

వారం రోజుల్లో అన్ని జిల్లాలకూ ఇవిఎం, వివిపాట్‌లు

మూడు జిల్లాలకు ఇప్పటికే చేరాయి

24 నుంచి ఆర్‌ఒ, ఎఆర్‌ఒలకు 4 రోజుల శిక్షణ

మొత్తం 44 వేల వివిపాట్‌లు

41 వేల కంట్రోల్ యూనిట్లు

52 వేల బ్యాలట్ యూనిట్లు

Elections

హైదరాబాద్ : ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని, కేంద్ర బృందం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని, ఇక ఎన్నికల తేదీలను ప్రకటించడమే తరువాయి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ వ్యా ఖ్యానించారు. ఇప్పటికే మూడు జిల్లాలకు ఇవిఎంలు, వివిపాట్‌లు అందాయని, ఈ నెల 18వ తేదీకల్లా మిగిలిన జిల్లాలకు అందుతాయని, ఏదేని రవాణాపరమైన సమస్యలు తలెత్తితే 20వ తేదీకల్లా అందుతాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 44 వేల వివిపాట్‌లు, 52 వేల బ్యాలట్ యూనిట్లు, 41 వేల కం ట్రోల్ యూనిట్లను వాడుతున్నామని, మొత్తం 32,574 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సచివాలయంలో శుక్రవా రం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఓటర్ల జాబితా పాత షెడ్యూలును రద్దుచేసి కొత్త షెడ్యూలును రూపొందించాల్సి వచ్చిందని, వీలైనంత వరకు 2018 జనవరి 1వ తేదీని పరిగణనలోకి తీసుకుని 18 ఏళ్ళు నిండినవారితో తుది జాబితాను రూపొందించేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను రూపొందించామని, అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించి అభిప్రాయాలను, అభ్యంతరాలను వ్యక్తం చేశాయని తెలిపారు. వచ్చే నెల 8వ తేదీకల్లా తుది జాబితాను రూపొందిస్తామని తెలిపారు. తేదీలను నిర్ణయించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమేనని తెలిపారు.
రిటర్నింగ్ అధికారులకు శిక్షణ : ఈ నెల 20వ తేదీకల్లా అన్ని జిల్లాలకూ ఇవిఎంలు, వివిపాట్‌లు చేరుతున్నందున వాటికి రాజకీయ పార్టీల సమక్షంలో తొలి విడత తనిఖీ ప్రక్రియను చేపడతామని, ఇందుకోసం ఈ నెల 24వ తేదీ నుంచి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు బ్యాచ్‌లవారీగా నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలింగ్ బూత్‌ల ఖరారు జరిగినప్పటికీ తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్యలో వచ్చే మార్పులకు అనుగుణంగా అవసరమైతే ‘ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాల’ను ఏర్పాటుచేస్తామని, అందుకోసమే అవసరానికి మించి కొంత ఎక్కువ సంఖ్యలోనే ఇవిఎంలు, వివిపాట్‌లను సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో వివిపాట్‌లను వినియోగిస్తున్నందువల్ల వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని దాదాపు పన్నెండు వేలను ఎక్కువగానే సమకూర్చుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదం (మావోయిస్టుల) సమస్య ఉన్నట్లు గుర్తించినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మేరకు ఎక్కువగానే ఉన్నట్లు రజత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇందుకోసం అవసరమైన అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నిఘా : ఇటీవలి కాలంలో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమ సంస్థలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయని, రాజకీయ పార్టీలు వాటిని బాగా వాడుకుంటున్నాయని, దీంతో ప్రచారానికి వాడే భాష, అభ్యంతరకర పదజాలం తదితరాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, ఇందుకోసం రాష్ట్ర సిఇఓ కార్యాలయంలో ప్రత్యేక ‘సెల్’ను నెలకొల్పామని తెలిపారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోయిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూనే ఉంటుందని, దీన్ని కట్టడి చేయడానికి ఆ సంస్థలే స్వచ్ఛందంగా ముందుకొచ్చాయని, అయినా తాము ప్రత్యేక నిఘాను పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసుల సహకారం తీసుకోనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మీడియా కన్సల్టెంట్‌ను కూడా నియమించుకున్నట్లు తెలిపారు.
ఓటర్లకు అవగాహన : ఎన్నికల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నామని, బూత్ స్థాయి సిబ్బంది ఆయా గ్రామాల్లో ప్రజల్లో అవగాహన కలిగిస్తారని రజత్‌కుమార్ తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నవారికి అర్థమయ్యేలా ‘సైన్ లాంగ్వేజీ’లోనూ ప్రచారాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాల స్థాయి లో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లపై తాను, కేంద్ర ఎన్నికల బృందం సంతృప్తిగానే ఉన్నామని, కేంద్ర బృందం కొన్ని సూచనలు కూడా చేసిందని పేర్కొన్నారు. బూత్‌స్థాయి సిబ్బందికి చేతినిండా పని ఉన్నందున కొంతమంది సహాయకులను నియమించుకోనున్నట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో శని, ఆదివారాల్లో ప్రత్యేక ‘సమగ్ర సమీక్ష’ ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో చాటింపు ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు.
ఆ ఏడు మండలాలపై నిర్ణయం ఇసిదే: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తదనంతర పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశామని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన మార్పులు చేర్పులపై నిర్ణయం తీసుకోవాల్సింది సంఘమేనని సిఇఓ రజత్‌కుమార్ తెలిపారు. ఏడు మండలాలను విలీనం చేసిన తర్వాత ఓటర్ల సంఖ్యలో మార్పులు వచ్చిన విషయాన్ని కూడా తెలియజేశామని, అయితే నియోజకవర్గం డీలిమిటేషన్ అవసమైతే దానిపై పూర్తి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర సంఘానిదేనన్నారు.