Home తాజా వార్తలు మార్కెట్ మోసాలకు ఇక చెల్లుచీటి

మార్కెట్ మోసాలకు ఇక చెల్లుచీటి

కమిషన్ ఏజెంట్ ఆగడాలకు అడ్డుకునేందుకు ఈపాస్ విధానం
అధునాతన వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్న అధికారులు

vegetable-market222..మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరో వైపు ఆకాశాన్నంటే నిత్యావసర ధరలతో సామాన్య మానవుడు ఇబ్బందుల పాలవుతున్నాడు. వీటిని నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలకు పూనుకుంది. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్‌లలో అధునాతన పద్ధతులను అమల్లోకి అధికారులు తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెరువులను అభివృద్ధి చేసింది. అదేవిధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు రావడానికి మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రైతులు తమ పంటలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మార్కెట్ యార్డులు, రైతులు బజార్లకు తీసుకెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడే కమిషన్ ఏజెంట్ రైతుకు నమ్మకమైన ధర చెబుతూ నమ్మబలుకుతూ తీరా అవి మార్కెట్ చేసే సరికి దాని ధర పూర్తిగా సగానికి సగం పడిపోతున్నది. దీంతో మార్కెట్‌కు తీసుకెళ్ళిన సరుకును వెనక్కి తీసుకురాలేక, గిట్టుబాటు ధర లభించక, చేసేది ఏమీ లేక రవాణా వ్యయాన్ని సైతం భరించి తక్కువ ధరకే పంటలను అమ్ముకుంటూ నష్టపోతున్నాడు. ఈ విధంగా రైతు గత పాలకుల నిర్లక్షంతో ఈ విధంగా అడ్డుగోలుగా దోపిడీకి గురయ్యేవాడు. ఇటువంటి పరిస్థితులకు స్వస్తి పలకాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మార్కెంగ్ శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రైతులు పండించిన పంటలను అమ్ముకనేందుకు అనువైన మార్గాలను ఎంచుకునేందుకు సీఎం ఆదేశాల ప్రకారం ఆయన ముందుకు వెళుతున్నారు. కమిషన్ ఏజెంట్లతోనే రైతులు అధికంగా నష్టపోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంతో ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ సేల్ పద్ధతి అమలు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఈపాస్ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో ప్రతి కమిషన్ ఏజెంట్ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అదే విధంగా వెయింగ్ మిషన్‌కు జీపీఎస్ ఉండటంతో రైతు మార్కెట్‌కు ఎంత సరుకు తీసుకువచ్చాడో ఆటోమెటిక్‌గా అది రీడ్ అవుతుంది. ఇది కంప్యూటర్‌లో అప్‌లోడ్ కావడంతో అదే పరిణామాన్ని కమిషన్ ఏజెంట్ పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.
అదే విధంగా కమిషన్ ఏజెంట్ ఏ రైతు వద్ద ఎన్ని క్వింటాళ్ళు, ఎంతకు కొనుగోలు చేశాడో అదే వస్తువును ఏ వ్యాపారికి ఎంతకు విక్రయించాడో స్పష్టంగా స్మార్ట్ ఫోన్ సహాయంతో ఈపాస్ విధానంలో పొందుప రచాల్సివుంటుంది. అప్పుడు కమిషన్ ఏజెంట్ ప్రభుత్వానికి ఎంత ధర చెల్లించాడో కూడా స్పష్టంగా తెలుస్తుంది.దాని వల్ల రైతులు నష్టపోకుండా ఉంటుంది. అప్పుడు రైతుకు గిట్టుబాటు ధర అందడంతో పాటు ప్రభు త్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. త్వరలో నగరంలోని బోయిన్ పల్లి మార్కెట్‌లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు సమా చారం. అదే విధంగా మరో విధానానికి కూడా రూపకల్పన చేయాలనే ఆలో చనలో మార్కెటింగ్ శాఖ అధికారులున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం ఈ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు సమాచారం.