Home నవ విజ్ఞానం ఏనుగుల సంరక్షణ కష్టసాధ్యమా?

ఏనుగుల సంరక్షణ కష్టసాధ్యమా?

Elephant care is difficult in the northern states of country

దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఏనుగుల సంరక్షణ కష్టసాధ్యమవుతోంది. అటవీ శాఖతోపాటు విద్యుత్ శాఖ, ఇతర సంబంధిత సంస్థల మధ్య సమన్వయం కొరవడడం, పర్యవేక్షణ లోపించడం ఏనుగుల ఉనికికి గండంగా మారింది. దేశంలో దాదాపు 101 ఏనుగుల కారిడార్లు ఉన్నాయి. ఈ కారిడార్ల పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాలని వాటికి రక్షణ కల్పించాలని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయినా, చాలా ప్రాంతాల్లో ఏనుగులకు, ఆయా ప్రాంతాల మధ్య సంఘర్షణ తప్పడం లేదు. ఇవి పంట పొలాలను పాడు చేస్తున్నాయనీ, గ్రామాల్లోకి చొరబడి కనబడిన వారిపై దాడి చేస్తున్నాయనే తదితర కారణాలతో కొందరు అక్రమంగా ముళ్ల కంచెలకు విద్యుత్ షాక్ ఇచ్చి ఏనుగుల ప్రాణాలను బలిగొంటున్నారు. వాటి చర్మం, దంతాలతో వ్యాపారం చేస్తున్నారు.

ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగల ఏర్పాటు ఎలా ఉందో అటవీ శాఖ గానీ, విద్యుత్ శాఖ గానీ సరిగా పరిశీలించడం లేదు. ఎక్కడ ఏనుగుల మార్గాలను నియంత్రించాలో, ఎక్కడ వాటి ప్రవేశానికి అనుకూలత కల్పించాలో కూడా సమీక్షించడం లేదనే విమర్శలున్నాయి. గత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 12 కన్నా ఎక్కువ సంఖ్యలో ఏనుగులు తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో కరెంట్ షాక్ వల్లనే చనిపోయాయి. ఒడిషాలోని ఢెంకనాల్ జిల్లాలో ఏడు ఏనుగులు మృతి చెందాయి. ప్రజలు, ఏనుగుల మధ్య సంఘర్షణ విధాన నిర్ణేతలకు, సంరక్షకులకు పెద్ద సవాలుగా మారింది. విద్యుదాఘాతం ఏనుగుల సంతతి పెరుగుదలకు ఆటంకంగా మారుతోంది. 2009 2017 మధ్య కాలంలో ఏటా 50 వంతున ఏనుగులు విద్యుదాఘాతం వల్ల చనిపోయాయి. అంటే, ఎనిమిదేళ్లలో 461 ఏనుగులు చనిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగుల మరణాలు ఎక్కువని చెప్పవచ్చు.

ఒడిషాలో విద్యుదాఘాతం కారణంగానే 90 ఏనుగులు మృతి చెందాయి. అసోంలో 70, పశ్చిమ బెంగాల్‌లో 48, చత్తీస్‌గఢ్‌లో 23 ఏనుగులు విద్యుదాఘాతంతో చనిపోయాయి. ఏనుగుల సంతతి అత్యధికంగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా విద్యుదాఘాతంతో 106 ఏనుగులు చనిపోయాయి. కేరళలో 17, తమిళనాడులో 50 ఏనుగులు మృతి చెందాయి. కారిడార్లలో ఏనుగుల సంతతిని రక్షించడంతోపాటు వాటి సంఖ్యను పెంపొందించడం ఎంత కష్టంగా ఉంటోందో వైల్డ్ ల్యాండ్స్ డివిజన్ అసిస్టెంట్ మేనేజర్ ఉపాసనా గంగూలీ వివరించారు. ఏనుగులు తమ ఇష్టానుసారం సంచరించడమే కాకుండా తమ పరిధిని పెంచుకోడానికి కూడా ప్రయత్నిస్తుంటాయి. ఈ సందర్భంగా అడవులను దాటి పంట పొలాల్లోకి ప్రవేశిస్తుంటాయి. అప్పుడే వాటికి రైతులు, స్థానికుల నుంచి నుంచి సంఘర్షణలు ఎదురవుతుంటాయి.

తూర్పు మధ్య భారతంలో ఏనుగులు తాము ఎప్పుడూ చూడని ప్రాంతాల్లో సంచరించడం విశేషం. ఉదాహరణకు కొన్ని దశాబ్దాలుగా చత్తీస్‌గఢ్‌లో ఏనుగులన్నవి ఉండేవి కావు. కానీ, ఇప్పుడు అక్కడ ఏనుగులకు ప్రజలకు మధ్య సంఘర్షణ తరచుగా ఎదురవుతోంది. అక్రమంగా ఎలక్ట్రికల్ కంచె వేయడాన్ని నివారించడంతోపాటు హైటెన్షన్ వైర్లను ఎత్తులో ఉండేలా సరైన చర్యలు తీసుకోవడం తదితర జోన్ల వారీ చర్యలతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అలాగే ఎక్కడ ఏనుగులను అనుమతించాలో ఎక్కడ వాటిని అదుపు చేయాలో ఇవన్నీ ప్రణాళికబద్ధంగా జరిగేలా చూస్తామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2017 లెక్కల ప్రకారం ఏనుగుల సంతతి ప్రస్తుతం 27,312 వరకు ఉండగా, కర్ణాటక రాష్ట్రం లోనే అత్యధికంగా 6,049 వరకు ఉంది. తరువాతి స్థానం అసోంలో 5719, కేరళలో 3,054 వరకు ఏనుగుల సంతతి కనిపిస్తోంది.
  – పరిశోధన విభాగం

Elephant care is difficult in the northern states of country

Telangana Latest News