Home రాష్ట్ర వార్తలు ఆగస్టు 26 నుంచి పోలీసు కొలువుల అర్హత పరీక్ష

ఆగస్టు 26 నుంచి పోలీసు కొలువుల అర్హత పరీక్ష

Policeహైదరాబాద్ : పోలీసు శాఖలో భర్తీ చేయనున్న 18,428 పోస్టులకు వచ్చే నెల 26 నుంచి అర్హత నిమిత్తం రాతపరీక్షలు జరగనున్నాయి. సబ్ ఇన్‌స్పెక్టర్, సహాయ ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయిలకు జరగనున్న పరీక్షలకు వేర్వేరు తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు షెడ్యూలును విడుదల చేసింది. సాధారణ ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, ఎస్‌ఐ (ఐటి కమ్యూనికేషన్స్) విభాగం పోస్టుకు సెప్టెంబర్ 2న ఉదయంపూట, మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఎఎస్‌ఐ పోస్టుకు నియామక అర్హత నిర్వహించనున్నట్లు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి ఛైర్మన్ వివి శ్రీనివాసరావు ఆ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30న కానిస్టేబుళ్ల నియామక ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 10 ముఖ్యమైన ప్రాంతాల్లో జరపాలని బోర్డు నిర్ణయించింది. కమ్యూనికేషన్స్ ఎస్‌ఐ, ఫింగర్ ప్రింట్ ఎఎస్‌ఐ పరీక్ష మాత్రం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉంటుందని శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వ్యక్తిగత వివరాల్లో మార్పులను ఈ నెల 14 వరకు support@tsprb.inకు మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.ఎస్‌ఐ సివిల్ పోస్టు కోసం 1,88,715 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఎస్‌ఐ (ఐటి) పోస్టు కోసం 13,944 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ ఎఎస్‌ఐ పోస్టు కోసం 7,700మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 4,79,166 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు శ్రీనివాస్‌రావు తెలిపారు