Home Default నామినేటెడ్ సభ్యుడిగా ఎల్విస్ స్టీఫెన్‌సన్

నామినేటెడ్ సభ్యుడిగా ఎల్విస్ స్టీఫెన్‌సన్

 

గవర్నర్ ఆమోదం
గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర సిఇఓ
ఎంఎల్‌ఎలతో పాటే ప్రమాణ స్వీకారం
గంగా జమునా తహజీబ్‌కు తెలంగాణ ప్రతీక

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్ కేటగిరీ తరఫున నామినేటెడ్ ఎంఎల్‌ఏగా ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గత శాసనసభలో నామినేటెడ్ ఎంఎల్‌ఏగా కొనసాగిన స్టీఫెన్‌సన్‌ను రెండవ శాసనసభలోనూ నిమించాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం జరిగిన మంత్రివర్గ తొలి సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు హోం మంత్రి మహమూద్ ఆలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నామినేటెడ్ శాసనసభ్యుడి నియామకంపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం శాసనసభలో ఆంగ్లోఇండియన్ సభ్యులెవరూ లేనందువల్ల స్టీఫెన్‌సన్‌ను రాజ్యాంగంలోని 333వ అధికరణం ప్రకారం నియమిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ గెజిట్‌ను కూడా విడుదల చేశారు. కొత్తగా కొలువుదీరిన శాసనసభలో స్టీఫెన్‌సన్ నామినేటెడ్ ఎంఎల్‌ఏగా కొనసాగనున్నారు.
సభ్యులతో పాటే ప్రమాణ స్వీకారం :
“సాధారణంగా నామినేటెడ్ సభ్యుడి నియామకంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల నామినేటెడ్ సభ్యులు ఇతర సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం సాధ్యపడదు. ఫలితంగా వారు విలువైన పదవీ కాలాన్ని కోల్పోతారు. ఈ సమస్యను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం తన మొదటి కేబినెట్ సమావేశంలోనే అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకంపై నిర్ణయం తీసుకుంది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర సభ్యులతో పాటుగానే ప్రమాణ స్వీకారం చేయడానికి వీలుగా అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకం జరపాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది” అని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనింది.
గంగా జమునా తహజీబ్‌కు ప్రతీక :
తెలంగాణలో గంగా జమునా తహజీబ్ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నదని, అందులో భాగమే ప్రోటెమ్ స్పీకర్‌గా ముస్లిం వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియామకం, అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్ సన్ నియామకం అని ప్రభుత్వం పేర్కొనింది. మంత్రివర్గం కూడా గంగా జమునా తహజీబ్‌కు అనుగుణంగా స్టీఫెన్‌సన్ పేరును ఖరారు చేసిందని, దీనికి సంబంధించి గవర్నర్‌కు ప్రతిపాదనలు కూడా పంపిందని పేర్కొనింది. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ నిబంధన మేరకు తెలంగాణ అసెంబ్లీలో ఈ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఎన్నికల సంఘానికి అభినందన :
గతేడాది డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ర్ట శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గ సమావేశం అభినందించింది. తెలంగాణ రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది. గత నెల 7వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సంఘం తొలి నుంచీ పకడ్బందీ నిర్వహణా ఏర్పాట్లు చేయడంతో ఒక్క చోట కూడా రీపోలింగ్‌కు, రీ కౌంటింగ్‌కు ఆస్కారం లేకుండా, హింసాత్మక చర్యలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
మూడు భాషల్లో రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులు :
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగం ప్రతులను తెలుగు, ఇంగ్లీషూ, ఉర్దూ భాషల్లో అందజేయడానికి శాసనసభ కార్యదర్శి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ నియమ నిబంధనలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని, పుస్తకాలను కూడా మూడు భాషల్లో ముద్రించి అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ సూచన మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఈ చర్యలు తీసుకున్నారు. శాసనసభ, శాసనమండలిలో వివిధ అంశాలకు సంబంధించిన నిబంధనలు, పుస్తకాలు, బుక్‌లెట్లు, ఇతర సమాచారం ఇకపైన సభ్యులకు మూడు భాషల్లో అందనుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహచార్యులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి చూపించారు.

Elvis Stephenson  Re Nominated to Telangana Assembly