Home మంచిర్యాల వంతెనలు లేక.. రాకపోకలు సాగక..!

వంతెనలు లేక.. రాకపోకలు సాగక..!

Emergency boat ride during emergency

బాహ్యప్రపంచానికి దూరంగా 92 గ్రామాలు
అత్యవసర సమయాల్లో తప్పని పడవ ప్రయాణం
ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో ఇదే తంతు
ఎన్నికల హామీలను విస్మరిస్తున్న ప్రజాప్రతినిధులు
కలగానే మిగిలిన వంతెనల నిర్మాణాలు

మన తెలంగాణ/మంచిర్యాల: వాగులు, ఒర్రెలు ఉప్పొంగినట్లయితే రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. రెండు జిల్లాల్లో 92 గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా జీవనం గడుపుతారు. ఎన్నికల సమయంలో వాగులపై వంతెనలు నిర్మిస్తామని హామీలు ఇస్తూ గద్దెనెక్కిన తరువాత విస్మరించడం పరిపాటిగా మారింది. దశాబ్దాల కాలంగా వాగులపై వంతెనలు నిర్మించకపోవడంతో వర్షాకాలం మూడు నెలల పాటు రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించి పోయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో కొందరు ప్రాణాలకు తెగించి వరదలను దాటుతుండగా మరికొందరు నాటు పడవలు ఆశ్రయించి ఒడ్డుకు చేరుకుంటున్నారు. రహదారుల మధ్యలో వాగులపై వంతెనలు లేక వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో దాదాపు 92 గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోతున్నాయి. చెన్నూర్ మండలంలోని సుద్దాల వాగుపై వంతెన లేకపోవడంతో తుర్కపల్లి, కమ్మరిపల్లి గ్రామాల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే వరదలు దాటి రావాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. అత్యవసర సమయాల్లో సాహసం చేసి వాగును దాటుతున్నారు. ఇటీవల తొలకరి జల్లులకే వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయి పడరానిపాట్లు పడ్డారు. అదే విధంగా మందమర్రి మండలంలోని బొక్కలగుట్టు, శంకర్‌పల్లి గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న వాగుపై వంతెన లేకపోవడంతో విద్యార్థులు వాగును దాటి ఇబ్బందులకు గురువుతున్నారు. కోటపల్లి మండలంలోని బబ్జెరచెల్క, కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగుపై కూడా వంతెన లేదు. వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి వాగుపై దశాబ్దాల తరబడి వంతెన నిర్మించకపోవడంతో వాగు ఉప్పొంగితే దాదాపు 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కాగా ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వంతెనను నిర్మిస్తుండగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. హాజీపూర్ మండలంలోని కొలాంగూడ నుంచి పెద్దంపేట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగుపై వంతెన లేక కోలాంగూడ ప్రజలు నరకయాతన పడుతున్నారు. అదే విధంగా కొమురంభీం జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రం సమీపంలోని కుష్ణపల్లి వాగుపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అదే విధంగా సిద్దాపూర్ ఒర్రె ఉప్పొంగడంతో మూగు గ్రామాలు తీగల ఒర్రె ఉప్పొంగడంతో 13 గ్రామాలు రాకపోకలు నిలిచిపోతాయి. వర్షాకాలంలో తీగల ఒర్రె వద్ద వరద ప్రవాహం సుమారు ఆరు గంటల వరకు ఉంటుంది. గతంలో ఈ ఒర్రె వద్ద వరద ప్రవాహంలో ఆర్‌టిసి బస్సు కొట్టుకుపోగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయినప్పటికీ దశాబ్దాల కాలంగా వాగులపై వంతెనలు నిర్మించాలని మారుమూల ప్రాంతాల వాసులు కోరుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో వాగులు దాటుతూ ఎంతో మంది మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. బెల్లంపల్లి,మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో ప్రదానంగా వాగులపై వంతెనలు నిర్మించలేదు. తాత్కాలికంగా రోడ్లు వేసినప్పటికీ తొలకరి జల్లులకే రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో రాకపోకలకు కోసం నరకయాతనలు అనుభవిస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.