Home రాష్ట్ర వార్తలు చెక్కులపై బడాబాబుల మక్కువ!

చెక్కులపై బడాబాబుల మక్కువ!

‘పెట్టుబడి’ వదులుకునేందుకు ముందుకు రాని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు 

గ్రామ సభల్లో తీసుకోవడంపై ‘నామోషీ’ భావన    ఇంటికే తెప్పించుకోవాలని యోచన

Money

మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడి పథకాన్ని వదులుకునేందుకు ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మనస్సు రావడం లేదు. స్వయంగా సిఎం కె.చంద్రశేఖర్‌రావు తన పెట్టుబడి సొమ్మును వదులుకుని ఆర్థిక స్థోమత కలిగినవారు కూడా ఇదే తరహాలో స్వచ్ఛందంగా ముందుకురావాలని, అలా ఆదా అయిన సొమ్ము ‘రైతు సమన్వయ సమితి కార్పొరేషన్’ కార్పస్ ఫండ్‌లో జమచేస్తామని స్పష్టం చేశారు. అయితే మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, వివిధ కార్పొరేషన్, జిల్లా పరిషత్‌ల ఛైర్మన్‌లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంపన్నులు, అసలు ప్రభుత్వ ఆర్థిక సాయం అవసరం లేని బడా భూస్వాములు మాత్రం ‘రైతుబంధు’ సొమ్మును వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. వ్యవసాయం చేయకపోయినా ఎకరాకు రూ. 4 వేల చొప్పున వచ్చే సొమ్మును ఎందుకు వదులుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

గ్రామ సభల్లో చెక్కులు పంపిణీ చేసే సమయంలో గ్రామస్తులతో పాటు చెక్కును అందుకోవడం నామోషీగా ఉంటుందనే భావనతో పలు కారణాలను సాకుగా చూపి ఇంటికే చెక్కును తెప్పించుకునే యోచనలో ఉన్నారు. పెద్ద హోదాలో, సంపన్నులుగా ఉండి ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సొమ్మును తీసుకుంటే గ్రామంలోని ప్రజల ముందు పరువు పోతుందనే భావనే ఇందుకు కారణం. తనకు 40 ఎకరాల భూమి ఉందని, మొత్తం 1.60 లక్షల పెట్టుబడి సొమ్ము వస్తుందని అయితే చెక్కు తీసుకోవడానికి మాత్రం తాను గ్రామ సభకు వెళ్లనని, అవసరమైతే ఇంటికే తెప్పించుకుంటానని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు నిర్మొహమాటంగా పేర్కొనడం ఇందుకు నిదర్శనం.ఈ నెల 20వ తేదీ నుంచి రైతు బంధు చెక్కులను పంపిణీ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కచ్చితంగా సంబంధిత చెక్కునే ఆ రైతు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని, ‘నామినీ’ వచ్చి తీసుకునే వెసులుబాటు లేదని వ్యవసాయశాఖ ‘రైతు బంధు’ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొనింది. ఒకవేళ రైతు ఏదైనా అనారోగ్యంతో గ్రామసభకు రాలేని పరిస్థితి ఉంటే అధికారులే సంబంధిత రైతు ఇంటికి వెళ్లి చెక్కును ఇవ్వాలని స్పష్టంగా పేర్కొనింది.

ఇప్పుడు అనారోగ్యాన్నే సాకుగా చూపి చెక్కులను ఇంటికి తెప్పించుకోవాలని సంపన్నులు భావిస్తున్నారు. గ్రామసభల్లో రైతులందరికీ చెక్కుల పంపిణీ పూర్తయిన తరువాత ఇలాంటి ప్రజాప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటి దగ్గరే అధికారుల నుంచి తీసుకోవాలనుకుంటున్నారు. వాస్తవానికి ఎవరైనా పెట్టుబడి సొమ్మును వదులుకుంటే అది రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ‘కార్పస్ ఫండ్’ ఖాతాకు చేరుతుందని ఇప్పటికే సిఎం ప్రకటించారు. గ్రామ సభలో చెక్కులు వదులుకునేందుకు ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ పేర్కొన్నప్పటికీ ఇది ఖాళీ బాక్సుగానే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు 10 గుంటల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు బ్యాంకులకు వెళ్లి చెక్కులను నగదుగా మార్చుకునేది కూడా తక్కువేనని, ఈ రకంగా ప్రభుత్వానికి కొంత సొమ్ము మిగులుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.