Search
Wednesday 21 November 2018
  • :
  • :

రింగు తిప్పుతున్న ‘రింగన పురుగులు’

   Employees  Duty of care and medical negligence

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : వైద్యారోగ్యశాఖలో రింగన పురుగులదే పై చేయిగా మారింది. అధికారులు వారి జేబులో కీలు బొమ్మలుగా మారారు. అందుకే సక్రమంగా విధులు నిర్వహించినా… నిర్వహించకపోయినా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ నగరంలోనే తిష్టవేసిన కొందరు ఉద్యోగులు వారి సొంత పనులపై దృష్టి పెట్టినంతగా ఉద్యోగ విధులలో పెట్టకపోవడం పట్ల పై స్థాయి అధికారులు ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో పలు పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఏజెన్సీ మండలాలలోని పిహెచ్‌సిలైతే చాలు ఇక అడిగే నాథుడే లేడన్నట్లుగా కొంత మంది ఉద్యోగులు వ్యవహరించడం గమనార్హం. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి దగ్గరలోని పిహెచ్‌సిలలోనే సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారో లేదో చూడలేని అధికారులు ఇక భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలోని అజాంనగర్ లాంటి ప్రాంతాలలో ఉద్యోగులు ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించడం గగనమేనని పలువురు భావిస్తున్నారు. అయితే నిత్యం వైద్యారోగ్యశాఖలోని లొసుగులు చర్చానీయాంశంగా మారుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
చర్యలు చేపట్టకపోవడం వెనుక కారణాలేంటి…?
వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించడం లేరనే ఆరోపణలు చర్చానీయాంశంగా మారుతున్నాప్పటికీ జిల్లా స్థాయి అధికారులు తగు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విధులు సక్రమంగా నిర్వహించకుండా జిల్లా స్థాయి అధికారులనే ప్రభావితం చేస్తూ కొంత మంది రింగన పురుగులు వైద్యారోగ్యశాఖను శాసిస్తున్నట్లుగా ఆ శాఖలోనే అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. అయితే ఏజెన్సీ పిహెచ్‌సిలలో పని చేస్తున్న ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అంతర్యం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు సైతం విధులు డుమ్మాకొట్టే ఉద్యోగులతో మిలాఖత్ అయ్యాయనే ఆరోపణలు వినిపించడం గమనార్హం. ఇప్పటికైనా వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగుల పని తీరును పర్యవేక్షించాల్సిన అవసరముందని పలువురు భావిస్తున్నారు.
రింగు తిప్పడంలో అందే వేసిన చేయి ‘రింగన పురుగులదే…’
జిల్లా స్థాయి అధికారులను మచ్చిగ చేసుకొని రింగు తిప్పడంలో రింగన పురుగులు అందే వేసిన చేయిగా ఉండటం గమనార్హం. పలు ప్రాంతాలలో ప్రయివేటు క్లినిక్‌ల నిర్వహణకు పర్మిషన్ ఇప్పించడం, లేదా కింద స్థాయి ఉద్యోగుల వేతనాల బిల్లులు చేయడం లాంటి పనులు చేతిలో ఉండే ఉద్యోగులకైతే మరింత పండుగేనని దీంతో అటు కింది స్థాయి ఉద్యోగులను, ఇటు జిల్లా స్థాయి ఉద్యోగులకు మధ్యవర్తిత్వం వహించడంతో పాటు వైద్యారోగ్యశాఖలో పలు పనుల నిర్వహణకు ఈ రింగన పురుగులే రింగు తిప్పుతుండటం గమనార్హం.
జిల్లా అధికారులు ఏం చేస్తున్నట్లు…?
వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తుంటే జిల్లా స్థాయి ఉద్యోగులు పర్యవేక్షణ చేయకుండా ఏం చేస్తున్నట్లనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలోని పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగులు సక్రమంగా వెళ్తున్నారా…లేరా… అని పరిశీలించకపోవడం పట్ల అసహనం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్థిష్టమైన చర్యలు చేపట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

comments