Home కలం అంతరించిపోతున్న జానపద కళలు

అంతరించిపోతున్న జానపద కళలు

Folk-arts

సువిశాల భారతంలో కోట్లాది జనాభాకుతోడు భిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాల కలబోతతో వైవిధ్యాన్ని కలిగి ఉంది. అలాంటి భారత్‌లో భిన్న కళారూపాలు, ప్రదర్శింపబడుతూ ఆయా ప్రాంతాల ప్రజలకు వినోదాన్ని కలిగిస్తూ ఉండేవి. కానీ క్రమేపి కళారూపాలు అంతరించిపోతూ అవసానదశకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వాలు కళారూపాల పునరుజ్జీవనానికి కంకణబద్ధులై అనునిత్యం శ్రమిస్తున్నా ఆధునిక యుగంలో ఆదరించేవారు సైతం కరువవుతున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయల సీమ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో జానపద కళారూపాలు జనానికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ, కళలను వ్యక్త పరిచే కళాకారులకు జీవన మార్గాన్ని సూచిస్తూ, సాంస్కృతిక వికాసాన్ని పంచేవి. కానీ నట్టింట్లోకి వచ్చేసిన టెలివిజన్ మాయలో పడిన జనులకు జానపదకళలు మరింత దూరం కాసాగాయి. క్రమేణా గ్రామాల్లోకి సైతం టెలివిజన్ ప్రసారాలు రావడంతో జానపద రూపాలను తిలకించే వారి సంఖ్య కుంచించుకుపోయింది. తెలంగాణ ప్రాంతంలో వైవిధ్యమైన జానపదకళలు ప్రదర్శింపబడి గ్రామీణులకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ మానసిక ప్రశాంతతను చేకూర్చే కళలు కనుమరుగయిపోతున్నాయి. నేటికీ కొన్ని ఉన్నా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పనికి, పాటకు అవినాభావ సంబంధమున్నది. పనితోటే పాట పుట్టింది. పనిలోని అలసటను తెలియకుండా పాటతో మమేకమై పనిచేయడం వలన పని సులువుగా జరగడమే కాకుండా వేగవంతమవుతుంది.

ఇలా పని, పాట సమ్మిళతమైన గ్రామీణ శ్రమ జీవులకు జీవనంలో భాగమయ్యింది. నాటు వేసేటప్పుడు పాట, కోత కోసేటప్పుడు పాట ఇలా మహిళలు పనిలోని శ్రమను తేలికపాటి చేసుకుంటూ తమ వ్యవసాయ పనులను కొనసాగించేవారు. ఆధునిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పల్లెల్లో వీధి భాగవతములు, బుర్ర కథలు, నాటకాలు, డ్యాన్సులు, చిందు యక్షగానాలు శ్రమ జీవుల అలసటను దూరం చేసి ప్రశాంతతను చేకూర్చేవి. ఇలా సహజ సిద్ధముగా ఉండే కళా రూపాలకు ఆధునిక వసతులు తోడవడంతో టెలివిజన్ రాకతో మూడు సినిమాలు, ఆరు సీరియల్స్‌గా మారి కళలు కనుమరుగవుతున్నాయి. కానీ నాటి సహజత్వములోపించి శ్రమైక జీవన సౌందర్యాన్ని మరింతగా పెంచే కళలు లేకపోవడంతో రంగుల లోకంలో విహరించే కళలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ఇలా జానపద కళలతో పాటు గ్రామీణ జీవనంలో మమేకమైన అనేక ఆటపాటలు, కళారూపాలు కానరాక పల్లె సహజత్వము పలుచబడుతోంది.

జానపద కళారూపాలు అంటే జానపదంలో నివసించే జనులు పాడుకునే కళారూపాలకు జానపదమని పేరు. జానపదులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారని వారు ఆడుకునే ఆటలు, పాడుకునే పాటలు, ఇతర కళలను జానపద కళలు అని పిలుస్తారు. అలనాటి ఆచార, సంప్రదాయాల కలబోతతో కూడిన కాలములో పల్లెల్లో తమ మానసిక ప్రశాంతత కోసం జానపద కళారూపాలు ఎంతగానో తోడ్పడే వి.రాజుల కాలములోనూ ఇలాంటి కళలను ప్రోత్సహించి పల్లె జీవనాన్ని మరింత ప్రశాంతమయం చేసే వారు. ముఖ్యంగా పండుగల సమయంలో రాత్రి వేళల యందు ప్రదర్శించే వారు. గ్రామ పెద్దలు, ప్రముఖులు, కుల పెద్దలు తమకు తోచిన సాయం చేసి వారికి జీవనోపాధి కల్పించేవారు. అంతేకాకుండా గ్రామాల్లో మరణాలు సంభవించి పెద్ద కర్మ చేసిన అనంతరం కథలు చెప్పించడం నేటికీ ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వలన ఆయా కుటుంబంలో వ్యక్తి మరణించినాడన్న మనోవేదన మాసిపోయి పూర్వ స్థితికి రావడానికి కథలు చెప్పడం వలన జరుగుతుంది అని నమ్ముతారు. అంతేకాకుండా ఆయా గ్రామంలోని వారందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచే అవకాశముంటుంది.

తద్వారా సమిష్టితత్వము బలపడి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా గ్రామంలోని పిల్లలు ఆడుకునే కోతి కొమ్మచ్చి, గోళీలాట, వంగుడు దుంకుడు, చిర్రగోన, బొమ్మలాట లాంటివి సహజంగానే వ్యాయామాన్ని కలిగిస్తూ సృజనాత్మకతను పెంపొందిస్తాయి. కానీ మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న ఆధునిక యుగంలో సెల్‌ఫోన్‌లోనే ఆటలను తిలకిస్తూ శారీరక శ్రమ లేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలా భవిష్యత్తు భారత్‌ను బంగారుమయంగా మార్చాల్సిన భావి పౌరులే ఇలా మారితే ఆరోగ్యదాయకమైన సమాజ నిర్మితమవుతుందా అన్నదే వేధిస్తున్న ప్రశ్న. దానికి తోడు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్నపిల్లలను ఆటలాడించేవారు కరువయ్యారు.

తల్లిదండ్రుల ఉద్యోగానికి ఆటంకముగా మారుతున్నారని సెల్‌ఫోన్ చేతికిచ్చి ఆడుకొమ్మని చెప్పే తల్లిదండ్రుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. అంతేకాకుండా గత్యంతరం లేక టెలివిజన్ ఆన్‌చేసి పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లే వారు కూడా అధికమవుతున్నారు. అంగట్లో సరుకును ఆకర్షణీయంగా చూపించి సొమ్ము చేసుకునే సంస్కృతి అధికంగా గల టెలివిజన్ ప్రసారాలతో భవిష్యత్తు జాతి నిర్మాతలైన భావి పౌరులు ఆకర్షితులవుతున్నారు. విష సంస్కృతిని విరివిగా చూపించే ప్రసార మాధ్యమాలు చిరు మెదళ్లను కలుషితం చేస్తున్నాయి. వావి వరుస లేని కథనాలు అడ్డగోలు జీవితాలకు బాటలు పరుస్తున్నాయి. తాత్కాలిక సంతోషం కోసం విలువలు లేని పౌరులుగా మారడానికి దోహదపడుతున్నాయి. గ్రామాల్లో ప్రదర్శించే ఏ తరహా ప్రదర్శనలోనైనా ఏదో ఒక జీవిత సారం ముడిపడి ప్రేక్షకులను ఉత్తేజపరచడంతో పాటు జీవన విలువలను పెంపొందించే విధంగా విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించే విధంగా ఉండి గ్రామాల్లో బంధాలు, బంధుత్వాలు బలపడి మంచి వాతావరణం ఏర్పడేది.

వీధి భాగవతములు, బుర్ర కథలు, చిందు యక్షగానాలు, కోలాటం మరియు భజన తదితర ఆటల్లోనూ రాజుల గొప్పతనం గురించిగాని, విలువలు పెంపొందించే కథలు కాని, ఇతర ఆటవిక దురాచారాల గురించి కాని చెప్పి వాటిని పాటించడం వలన కలిగే వ్యయ, ప్రయాసలు వివరించి తద్వారా పల్లె ప్రజలందరు మంచిని పాటించే విధంగా తోడ్పడేవి. నిరక్షరాస్యులు అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇలాంటి కళా రూపాల ద్వారా సులువుగా అర్థమయ్యేవి. అందుకే ప్రభుత్వాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పథకాల ప్రచారం కోసం, సామాజిక దురాచారాలను రూపుమాపడానికి నేటికి కథల రూపంలో ప్రదర్శించడం జరుగుతున్నది. కాని అలనాటి ఆటలు, పాటలు, సాంస్కృతిక కళారూపాలు విశేషముగా జరుపుకునే ఆడపడుచులు సహజ సిద్ధమైన పూలతో చేసుకునే బతుకమ్మ పండుగ బోసిపోతున్న తరుణంలో తెలంగాణ ఉద్యమము ఊపందుకోవడం ఆ తదుపరి తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరడంతో బతుకమ్మ విగ్రహాలు గ్రామ గ్రామాన వెలిసి కన్నుల పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతున్నది.

అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటితరంపై అధికంగా ఉన్నది. ఆధునిక యుగంలోనూ జానపదకళలను అధునీకరించాల్సిన అవసరమున్నది. సహజత్వముతో ఉట్టిపడే జానపద కళారూపాలను సంరక్షించుకోవాలి. మానవ జీవన యానాన్ని మరింతగా మెరుగుపరిచే జానపద కళలు శ్రమ జీవన సౌందర్యాన్ని మరింతగా పెంపొందించే విధంగా చేయాలి. అలనాటి ఆటల మాధుర్యాన్ని రానున్న కాలానికి పదిలంగా అందిస్తేనే గ్రామీణ జీవన ముఖ చిత్రం సులువుగా అర్థమవుతుంది. గ్రామాల కలబోతతో కూడిన భారతావనిలో గ్రామీణ జనులకు జానపద కళారూపాలు మానసిక ప్రశాంతత ఎంతగానో చేకూరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళల కాణాచిగా పేరు గాంచిన భారత్‌లోని కళా సంపద రాబోవు తరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలి.

-వల్లపుదాసు ఉపేందర్ బాబు, 98496 88923