Home తాజా వార్తలు సైనాకు పసిడి

సైనాకు పసిడి

రజతాలతో సరిపెట్టుకున్న శ్రీకాంత్, సింధు, 

గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలకు ఆదివారం తెరపడింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ క్రీడలు ఆదివారం ఘనంగా ముగిసాయి. ఆదివారం క్రీడల చివరి రోజు భారత్ మరో స్వర్ణం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజం సైనా నెహ్వాల్ స్వర్ణం గెలుచుకొంది. కిదాంబి శ్రీకాంత్, పి.వి.సింధులు రజతాలు సాధించారు. ఈ క్రీడల్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, మరో 20 కాంస్య పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో బాక్సింగ్ దిగ్గజం భారత బృందానికి సారథ్యం వహించింది. కిందటిసారి జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 15 స్వర్ణాలు మాత్రమే సాధించిన భారత్ ఈసారి ఏకంగా 26 పసిడి పతకాలు గెలుచుకొని సత్తా చాటింది. బాక్సింగ్, టిటి, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ విభాగాల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. అయితే హాకీలో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. పురుషులు, మహిళల జట్లు కనీసం కాంస్య పతకం కూడా సాధించకుండానే వెనుదిరిగాయి.

సింధుకు సైనా షాక్…

saina

మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి పివి.సింధుకు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన తుది పోరులో భారత్‌కే చెందిన మరో తెలుగుతేజం సైనా నెహ్వాల్ చేతిలో సింధు కంగుతింది. స్వర్ణం కోసం జరిగిన సమరంలో సైనా 2118, 2321 తేడాతో సింధును ఓడించింది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరువురు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. ఒక దశలో సైనాపై సింధు ఆధిపత్యం కనబరిచింది. అయితే కీలక దశలో ఒత్తిడికి గురైంది. ఫైనల్లో తన బలహీనతలను మరోసారి బహిర్గతం చేసిన సింధు చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. మరోవైపు సైనా తన మార్క్ ఆటతో చెలరేగి పోయింది. ఒత్తిడిని సైతం తట్టుకుంటూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో తన ఖాతాలో సెట్‌ను కూడా జమ చేసుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ప్రారంభం నుంచే పోరు యుద్ధాన్ని తలపించింది. తమకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ఇద్దరు అలరించారు. చివరికి ఈ సెట్‌లోనూ సైనా పైచేయి సాధించింది. గేమ్‌ను గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. సింధుకు రజతం మాత్రమే దక్కింది.
శ్రీకాంత్‌కు రజతం

srikanth

పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే మిగిలింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో శ్రీకాంత్ మలేసియా ఆటగాడు లీ చాంగ్ వీ చేతిలో ఓటమి పాలయ్యాడు. మూడు సెట్ల సమరంలో శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. అద్భుత ఆటతో చెలరేగిన చాంగ్ 1921, 2114, 2114 తేడాతో శ్రీకాంత్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో శ్రీకాంత్ పైచేయి సాధించాడు. చూడచక్కని చాంగ్‌ను హడలెత్తించాడు. మరోవైపు చాంగ్ కూడా పట్టు సడలించకుండా పోరు కొనసాగించాడు. ఇద్దరు సర్వం ఒడ్డడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరికి సెట్ శ్రీకాంత్‌ను వరించింది. అయితే తర్వాతి రెండు సెట్లలో చాంగ్ ఆధిపత్యం కొనసాగించాడు. వరుసగా రెండు గేమ్‌లను గెలిచి తన ఖాతాలో స్వర్ణాన్ని జమ చేసుకున్నాడు. ఇదిలావుండగా మహిళల స్కాష్ డబుల్స్‌లో జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ జంటకు రజతం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. పురుషుల టిటిలో శరత్ కమల్‌కు కాంస్యం దక్కింది.

భారత్‌కు మూడో స్థానం

cgms

గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం ముగిసిన క్రీడల్లో భారత్ మొత్తం 66 పతకాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. కిందటి క్రీడలతో పోల్చితే ఈసారి భారత్‌కు రెండు పతకాలు తక్కువగా లభించాయి. అయితే కిందటి గేమ్స్‌లో భారత్ కేవలం 15 స్వర్ణాలు మాత్రమే సాధించింది. అయితే ఈసారి మాత్రం 26 పసిడి పతకాలు గెలుచుకొని ప్రకంపనలు సృష్టించింది. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, టిటి, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణాల పంట పండింది. మహిళా క్రీడాకారిణిలు సైనా, మేరీకోమ్, మను బాకర్, హీనా సిద్ధు, సంజిత, మీరాబాయి చాను, మనిక బాత్రా, వినేష్ ఫొగట్, తేజస్విని సావంత్, శ్రేయాసి సింగ్, పూనమ్ యాదవ్ తదితరులు స్వర్ణాలు గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో వికాస్ కృష్ణన్, జీతు రాయ్, అనిష్, సుశీల్ కుమార్, సంజీవ్ రాజ్‌పుత్, నీరజ్ చోప్రా, గౌరవ్ సోలంకి, అనిష్ భన్వాలా, వెంకట్ రాహుల్ రాగాల, సతీష్ కుమార్ శివలింగం, రాహుల్ అవారేలకు స్వర్ణ పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో, పురుషుల టిటిలో భారత్‌కు పసిడి పతకాలు లభించాయి. ఈ క్రీడల్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలతో మొత్తం 66 పతకాలను గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యలతో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 45 స్వర్ణాలు, 45 రజతాలు, 46 కాంస్యలతో 136 పతకాలు గెలిచి రెండో స్థానాన్ని దక్కించుకుంది. కెనడా 82 పతకాలతో నాలుగో, న్యూజిలాండ్ 46 పతకాలతో ఐదో స్థానంలో నిలిచాయి. కెనడా కంటే భారత్ 11 స్వర్ణాలు అధికంగా సాధించడంతో మూడో స్థానం లభించింది.

ఘనంగా ముగింపు వేడుకలు

ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి క్రీడల ప్రధాన స్టేడియంలో ముగింపోత్స వేడుకలను కనుల పండవగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అభిమానులను కట్టి పడేశాయి. పోటీల్లో పాల్గొన్న దేశాల క్రీడాకారులు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత బృందానికి దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సారథ్యం వహించింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ క్రీడల ముగింపు వేడుకలకు హాజరయ్యారు.