Home తాజా వార్తలు ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత ‘పంచాయతీ’ ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత ‘పంచాయతీ’ ఎన్నికలు

Some villages unanimous Elected in Peddaplli district

3,701 పంచాయతీలకు, 28,976 వార్డులకు పోలింగ్
769 పంచాయతీలు, 10,654 వార్డులు ఏకగ్రీవం
రాష్ట్రవ్యాప్తంగా 85.76% సగటు పోలింగ్ నమోదు
అత్యధికంగా భువనగిరిలో 95.32శాతం
అత్యల్పంగా వికారాబాద్‌లో 68.25శాతం
పోలింగ్ జరిగిన వెంటనే ప్రారంభమైన ఓట్లు లెక్కింపు
ఆధిపత్యం చాటుకున్న టిఆర్‌ఎస్

హైదరాబాద్:రాష్ట్రంలో ఎన్నికల పంచాయతీ మొదటి విడత పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదుకాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 85.76% మేర పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.అత్యధికంగా భువనగిరి జిల్లాలో 95.32% మేర పోలింగ్ నమోదుకాగా అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 68.25% మేర నమోదైనట్లు తెలిపింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తున్నా చాలా మంది ఓటర్లు బారులుతీరి నిలబడిన పోలింగ్ కేంద్రాల్లో మరో గంట వరకూ ఓటు హక్కు వినియోగించు కునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లోనే దాదాపు 25% మేర ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 11 గంటలకల్లా అది 50% దాటినట్లు ఎన్నికల సంఘం పేర్కొనింది. అసెంబ్లీ ఎన్నికలకంటే పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఏకగ్రీవంలోనూ, ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ ఆధిక్యత :
మొదటి విడతగా 4,470 సర్పంచ్‌లకు, 39,630 వార్డులకుగాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 769 సర్పంచ్ పదవులు, 10,654 వార్డుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలకు, 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది జిల్లాల్లోని పంచాయతీల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన 3,701 గ్రామ పంచాయతీల్లో 12,202 మంది అభ్యర్దులు, 28,976 వార్డుల్లో 70,094 మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. ఇందులో టిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ పంచాయితీల్లో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఏకగ్రీవమైన 769 పంచాయతీల్లో కూడా అధికార టిఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్‌లు603 మంది ఉన్నారు. కాంగ్రెస్ 35 పంచాయతీలను, ఇతరు పార్టీలకు చెందినవారు, స్వతంత్రులు 131 పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

Ending First Phase TS Panchayat Elections 2019