Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆదుకున్న పూజారా

మళ్లీ తడబడిన మిడిలార్డర్,
చెలరేగిన మోయిన్,
భారత్ 273 ఆలౌట్,

Eng-vs-India-Fourth-Test

సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను స్టార్ ఆటగాడు, నయా వాల్ చటేశ్వర్ పుజారా అజేయ శతకంతో ఆదుకున్నాడు. అద్వితీయమైన పోరాట పటిమను కనబరిచిన పుజారా 257 బంతుల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేశాడు. మరోవైపు టాప్ ఆర్డర్ విఫలం కావడంతో భారత్ భారీ ఆధిక్యం సాధించే అవకాశాలను చేజేతులా చేజార్చుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్‌లు తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. అయితే ధావన్ (23), రాహుల్ (19) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు.

ఈ రెండు వికెట్లు బ్రాడ్‌కే దక్కాయి. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి, మిస్టర్ డిపెండబుల్ పుజారా తమపై వేసుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఆరు ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో టెస్టు క్రికెట్‌లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. మరోవైపు అజింక్య రహానె (11), రిషబ్ పంత్ (౦), హార్దిక్ పాండ్య (4), అశ్విన్ (1), మహ్మద్ షమి (0)లు నిరాశ పరిచారు. వీరంత వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో 227 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో బుమ్రా అండతో పుజారా పోరాటం కొనసాగించి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పుజారా పోరాట పటిమతో భారత్ అనూహ్యంగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. ఇంగ్లండ్ జట్టులో మోయిన్ అలీ ఐదు, బ్రాడ్ మూడు వికెట్లు పడగొట్టారు

Comments

comments