Home తాజా వార్తలు మిషన్ ప్రపంచకప్

మిషన్ ప్రపంచకప్

ట్రోఫీపై కన్నేసిన ఇంగ్లండ్
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది ఇంగ్లండ్ మాత్రమేనని చెప్పాలి. కొన్నేళ్లుగా ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం ఇంగ్లండ్ అలవాటుగా మార్చుకుంది. సుదీర్ఘ ఇంగ్లండ్ క్రికెట్ ప్రస్థానంలో ఎన్నడూ కూడా ప్రపంచకప్ గెలవని వెలితి ఇంగ్లండ్‌ను వెంటాడుతోంది. అయితే సొంత గడ్డపై జరుగుతున్న మెగా సమరంలో ఇంగ్లీష్ జట్టు ట్రోఫీని సాధించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ ఎదురులేని శక్తిగా మారింది. ఇంటాబయట జరుగుతున్న సిరీస్‌లలో వరుస విజయాలు సాధిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉండడం ఇంగ్లండ్ విజయాలకు ప్రధాన కారణంగా మారింది. ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించే సత్తా ఇంగ్లండ్‌కు ఉంది. దీనికి తోడు ఇయాన్ మోర్గాన్ సారథ్య ప్రతిభ తోడు కావడంతో ఇంగ్లండ్ అత్యంత బలమైన జట్టుగా ఎదిగింది. ప్రపంచకప్‌కు ముందు బలమైన పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ స్కోర్ల ఈ ఇరీస్‌లో ఇంగ్లండ్‌కు ఎదురులేకుండా పోయింది. పాకిస్థాన్ ఉంచిన అతి పెద్ద లక్ష్యాలను కూడా అలవోకగా ఛేదిస్తూ ప్రకంపనలు సృష్టించింది. జాసన్ రాయ్, బైర్‌స్టో, బెన్ స్టోక్స్, కెప్టెన్ మోర్గాన్, జోస్ బట్లర్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా తయారైంది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టు బ్యాటింగ్ కూడా ఇంత పటిష్టంగా లేదు. ఇంగ్లండ్ సాధిస్తున్న విజయాల్లో బ్యాట్స్‌మెన్‌దే కీలక పాత్రగా ఉంటోంది. ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపిస్తున్న ఘనత ఒక్క ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈసారి ఎలాగైనా..
అందని ద్రాక్షలా మారిన ప్రపంచకప్ ట్రోఫీను ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పురాతన జట్టుగా పేరున్న ఇంగ్లండ్ ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ను సాధించలేదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నా విశ్వకప్‌ను సొంతం చేసుకోలేక పోయింది. అయితే గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. ఎలాగైనా కప్పును సాధించాలనే పట్టుదల ఆటగాళ్లలో నెలకొంది. ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగడం, రిక్త హస్తాలతో వెనుదిరగడం ఇంగ్లండ్‌కు అలవాటుగా మారింది. కానీ, ఈ ప్రపంచకప్‌లో ఆ అపవాదును చెరిపేసుకోవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. సొంత గడ్డపై టోర్నీ జరగడం కూడా ఇంగ్లండ్‌కు కలిసివచ్చే అంశంగా మారింది. ఇక, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉండడం కూడా ఇంగ్లండ్‌కు మరో సానుకూల పరిణామం. మోర్గాన్, బట్లర్, జాసన్ రాయ్, స్టోక్స్, మోయిన్ అలీ, ఆదిల్ రషీద్, బైర్‌స్టో తదితరులతో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. అంతేగాక జోఫ్రా ఆర్చర్ రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్ జట్టులో ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ ఈసారి భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఘన విజయం సాధించడం కూడా ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో నిలకడైన విజయాలు సాధిస్తున్న ఏకైక జట్టు ఇంగ్లండ్ మాత్రమే. ఈ ప్రపంచకప్‌లో కూడా రికార్డును కాపాడుకుని ట్రోఫీని ముద్దాడాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇందులో ఎంతవరకు సఫలం అవుతుందో వేచి చూడాల్సిందే.
 England team to be ready for win world cup 2019