Home స్కోర్ విశ్వ విజేత ఇంగ్లాండ్

విశ్వ విజేత ఇంగ్లాండ్

శ్రుబ్‌సోల్ మ్యాజిక్, రౌత్, కౌర్ పోరాటం వృథా, ఫైనల్లో  ఓడిన మిథాలీ సేన

England

లండన్: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అన్య శ్రుబ్‌సోల్ అసాధారణ బౌలింగ్‌తో ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌కు నాలుగో ప్రపంచకప్‌ను అందించింది. ఒక దశలో 190/3 పటిష్ఠ స్థితిలో కనిపించిన మిథాలీ సేన చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. భారత్ చివరి ఆరు వికెట్లను 28 పరుగుల తేడాతో కోల్పోవడం గమనార్హం. దీంతో ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన బౌలర్ల శ్రమ వృథాగా మారింది. అంతేగాక, విశ్వవిజేతగా నిలిచే సువర్ణ అవకాశాన్ని మిథాలీ సేన చేజార్చుకుంది.
ప్రారంభంలోనే…
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మందన (౦) ఈ మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచింది. అన్య శ్రుబ్‌సోల్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. అయితే మరో ఓపెనర్ పూనమ్ రౌత్‌తో కలిసి కెప్టెన్ మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ ముందుకు సాగారు. అయితే మిథాలీ (17; 31 బంతులు 3×4) కీలక సమయంలో రనౌటైంది. దీంతో భారత్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న రౌత్, కౌర్
అయితే సెమీస్ సంచలనం హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి రౌత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి పోకుండా సమన్వయంతో ఆడారు. కిందటి మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన కౌర్ ఈసారి ఆత్మరక్షణతో ఆడింది. పూనమ్ కూడా కుదురుగా బ్యాటింగ్ ఈ క్రమంలో జట్టు స్కోరును వంద దాటించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కౌర్ (51; 80 బంతులు 3×4, 2×6)ను అలెక్స్ హర్ట్‌లి ఔట్ చేసింది. మరోవైపు కౌర్ ఔటైనా రౌత్ పోరాటం కొనసా గించింది. వేద కృష్ణమూర్తి అండతో స్కోరును ముందు కు తీసుకెళ్లింది. వీరిద్దరూ కుదురుగా ఆడడంతో భారత్ విశ్వవిజేతగా నిలువడం ఖాయంగా కనిపించింది.
శ్రుబ్‌సోల్ జోరు..
ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశారు. అయితే 115 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్స్ 86 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న రౌత్‌ను శ్రుబ్‌సోల్ వెనక్కి పంపింది. మరోవైపు వికెట్ కీపర్ సుష్మ (౦)ను హర్ట్‌లి క్లీన్‌బౌల్ట్ చేసింది. ఆ వెంటనే వేద (35; 34 బంతుల్లో 5×4)ను, జులన్ గోస్వామి (౦)ను శ్రుబ్‌సోల్ వెనక్కి పంపింది. దీంతో భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. దీప్తి శర్మ (14), రాజేశ్వరి (1)లను కూడా శ్రుబ్‌సోల్ ఔట్ చేసింది. శిఖ (4) రనౌట్‌గా వెనుదిరిగింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 219 పరుగుల వద్దే ముగిసింది. కాగా, అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్ గెలిపించిన శ్రుబ్‌సోల్‌కు ప్లేయర్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు లభించింది. ప్రపంచకప్‌లో నిలకడగా రాణించిన టామీ బ్యూమాంట్‌కు ప్లేఆయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు లభించింది.
శుభారంభం
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు లారెన్ విన్‌ఫీల్డ్, టామీ బ్యూమాంట్ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. జులన్ గోస్వామి బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరూ శిఖ పాండేను లక్షంగా చేసుకున్నారు. ఒకవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూనే చెత్త బంతులను బౌండరీలు దాటించారు. వీరిని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగానే శ్రమించారు. విన్‌ఫీల్డ్ తన మార్క్ షాట్లతో చెలరేగింది. బ్యూమాంట్ కూడా వరుస బౌండరీలతో భారత బౌలర్లను హడలెత్తించింది. అయితే ఇంగ్లాండ్ స్కోరు 47 పరుగుల వద్ద ఉన్నప్పుడూ భారత్‌కు మొదటి వికెట్ లభించింది. కుదరుగా ఆడుతున్న విన్‌ఫీల్డ్ (24; 35 బంతుల్లో 4×4)ను రాజేశ్వరీ గైక్వాడ్ పెవిలియన్ పంపించింది. కొద్ది సేపటికే మరో ఓపెనర్ బ్యూమాంట్ (23; 37 బంతులు 5×4)ను పూనమ్ యాదవ్ వెనక్కి పంపింది. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 60 పరుగులు. ఆ వెంటనే కెప్టెన్ హిథర్ నైట్ (1) కూడా వెనుదిరిగింది. ఈ వికెట్ కూడా పూనమ్ ఖాతాలోకే వెళ్లింది. మూడు వికెట్లు వెంటవెంటనే పడడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో చిక్కుకుంది.
ఆదుకున్న టేలర్, షివర్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్ సారా టేలర్ తనపై వేసుకుంది. ఆమెకు నటాలి షివర్ అండగా నిలిచింది. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్‌తో స్ట్రయిక్‌ను రొటెట్ చేశారు. వీరిని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇదే క్రమంలో జట్టు స్కోరును వంద దాటించారు.
జులన్ మ్యాజిక్…
అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని భారత వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి విడగొట్టింది. కుదురుగా ఆడుతున్న టేలర్ (45; 62 బంతుల్లో)ను గోస్వామి ఔట్ చేసింది. దీంతో 83 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి బంతికే ఫ్రాన్స్ విల్సన్ (౦)ను జులన్ ఔట్ చేసింది. రెండు వరుస బంతుల్లో ఈ వికెట్లు తీసి జులన్ భారత్‌కు మళ్లీ పైచేయి అందించింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన షివర్ (51; 68 బంతుల్లో 5×4)ను కూడా జులన్ వెనక్కి పంపింది. చివర్లో క్యాథరిన్ బ్రంట్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగిన బ్రంట్ 42 బంతుల్లో రెండు ఫోర్లతో 34 పరుగులు చేసింది. మరోవైపు జెన్నీ గన్ 25 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో ఇంగ్లాండ్ స్కోరు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 228 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో గోస్వామి పది ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. పూనమ్ యాదవ్‌కు రెండు వికెట్లు లభించాయి.